మహేశ్‌ సినిమా చూపిస్తూ ఆపరేషన్‌ చేసేశారు!

దీంతో రోగికి ఆపరేషన్‌ అవసరమైంది. ఆపరేషన్‌ చేసి కణితిని తొలగించేటప్పుడు కుడికాలు, కుడిచెయ్యి చచ్చుపడిపోయే ప్రమాదం ఉందని వైద్యులు భావించారు.

Update: 2024-02-04 07:36 GMT

సాధారణంగా ఎవరికైనా ఆపరేషన్‌ చేయాలంటే వైద్యులు ఏం చేస్తారు?.. మత్తు మందు ఇస్తారు. ఆపరేషన్‌ చేస్తున్నట్టు రోగికి తెలియకుండానే.. దాదాపు అతడు స్పృహలో లేనప్పుడే ఆపరేషన్‌ చేస్తుంటారు.

అయితే.. గుంటూరు సమగ్ర ప్రభుత్వాస్పత్రిలో వైద్యులు ఒక రోగికి బ్రెయిన్‌ సర్జరీని అతడు స్పృహలో ఉన్నప్పుడే చేసేశారు. అతడికి మహేశ్‌ బాబు అంటే ఇష్టమని చెప్పడంతో పోకిరి సినిమాను చూపిస్తూ వైద్యులు బ్రెయిన్‌ సర్జరీని చేశారు. ఇది అత్యంత అరుదైన చికిత్స అని వైద్యులు చెబుతున్నారు.

గుంటూరు సమగ్ర ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్‌ ఏకుల కిరణ్‌ కుమార్‌ ఈ అరుదైన చికిత్స గురించి వివరించారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం ఇలపర్రు గ్రామానికి చెందిన 48 ఏళ్ల కోటి పండు అనే వ్యక్తి జనవరి 2న అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. దీంతో ఆయన గుంటూరు సమగ్ర ప్రభుత్వాస్పత్రిలో చేరారు. ఆయన కుడికాలు, కుడిచెయ్యి బలహీనపడ్డాయి. దీంతో న్యూరో విభాగం వైద్యులు పరీక్షలు చేసి మెదడులో ఎడమవైపు కుడి కాలు, కుడి చెయ్యి పనిచేసే నోటారకార్డెక్స్‌ భాగంలో కణితి ఉన్నట్టు తేల్చారు.

దీంతో రోగికి ఆపరేషన్‌ అవసరమైంది. ఆపరేషన్‌ చేసి కణితిని తొలగించేటప్పుడు కుడికాలు, కుడిచెయ్యి చచ్చుపడిపోయే ప్రమాదం ఉందని వైద్యులు భావించారు. దీంతో రోగి మెలకువగా ఉండగానే ఆపరేషన్‌ చేయాలని నిర్ణయించారు. ఈ విషయం రోగికి తెలిపారు.

ఆపరేషన్‌ కు రోగి సహకరించడంతో అతడి అభిమాన హీరో మహేష్‌ బాబు నటించిన పోకిరి సినిమాను ల్యాప్‌ టాప్‌లో చూపించారు. అతడు సినిమా చూస్తుండగానే అవేక్‌ బ్రెయిన్‌ సర్జరీ చేసి కణితిని తొలగించారు. జనవరి 25న ఆపరేషన్‌ చేసిన తరువాత రోగికి ఎలాంటి ఇబ్బంది లేకపోవడంతో ఫిబ్రవరి 3న డిశ్చార్జి చేశారు.

ప్రభుత్వ వైద్య రంగంలో తొలిసారిగా రోగి మెలకువలో ఉండగానే ఈ ఆపరేషన్‌ చేసినట్లు గుంటూరు జీజీహెచ్‌ వైద్య వర్గాలు తెలిపాయి.


Tags:    

Similar News