'ఇండియా'పై ఫైర్ బ్రాండ్ నిప్పులు.. ఇలాంటివారే కూటమికి చేటు

ఈ లోగా పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో వ్యవహరించాల్సిన తీరుపై కూటమిలోని మరో కీలకపార్టీ అయిన టీఎంసీ విభేదించింది.

Update: 2024-12-07 09:30 GMT

దాదాపు రెండేళ్ల కిందట ఏర్పాటైన ‘ఇండియా’ కూటమికి ఇప్పుడు బీటలు పడుతున్నాయి. మరీ ముఖ్యంగా లోక్ సభ ఎన్నికల్లో ఓటమి తర్వాత అసలు ఈ కూటమి ఉందా? అనే అనుమానం తలెత్తింది.. ఇక మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం.. అందులోనూ ఇండియా కూటమి సీనియర్ నేతల్లో ఒకరైన ఎన్సీపీ వ్యవస్థాపకుడు శరద్ పవార్ పార్టీ కూడా ప్రభావం చూపలేకపోవడంతో ‘ఇండియా’ మనుగడే ప్రశ్నార్థకం అవుతోంది. ఈ లోగా పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో వ్యవహరించాల్సిన తీరుపై కూటమిలోని మరో కీలకపార్టీ అయిన టీఎంసీ విభేదించింది.

ఆమెను అంచనా వేయడం కష్టమే?

టీఎంసీ అంటే మమతా బెనర్జీ.. మమతా బెనర్జీ అంటే టీఎంసీ. ఈ పశ్చిమ బెంగాల్ ఫైర్ బ్రాండ్ ను అంచనా వేయడం కష్టం. వరుసగా మూడోసారి బెంగాల్ లో అధికారం చేజిక్కించుకున్న మమతా ఇండియా కూటమిలోనూ తన పెత్తనం నెగ్గాలనుకున్నారు. కానీ, కాంగ్రెస్ వంటి పెద్ద పార్టీ ఉండగా అది సాధ్యం కాలేదు. పైగా ఎన్నికల్లో హస్తం పార్టీ బలహీన పడడంతో మమతా తన వ్యతిరేక గళం వినిపిస్తున్నారు. ఇప్పటికే కూటమి ఎంపీల సమావేశానికి టీఎంసీ ఎంపీలు డుమ్మా కొట్టారు. ఉభయసభల్లో ఎన్డీయేను ఎదుర్కొనే వ్యూహంపై జరిగిన ఈ కీలక సమావేశానికి ఆ పార్టీ దూరంగా ఉండడంపై అనేక ఊహాగానాలు వినిపించాయి. అయితే, ధరల పెరుగుదల, నిరుద్యోగం, నిధుల కొరత, మణిపూర్‌ హింస అంశం వంటి ఆరు కీలక అంశాలను పార్లమెంట్‌ లో లేవనెత్తాలనేది టీఎంసీ డిమాండ్. కాంగ్రెస్ మాత్రం అదానీ అవినీతిపై జేపీసీకే పట్టుబడుతోంది. దీనిని కారణంగా చూపుతూ టీఎంసీ తన నిరసన వ్యక్తం చేస్తోంది.

పగ్గాలు మాకిచ్చేయండి..

ఇండియా కూటమిలో కాంగ్రెస్ పెత్తనాన్ని మొదటినుంచి సహించని మమతా బెనర్జీ ఇప్పుడు మరో ప్రతిపాదన తెచ్చారు. ఇండియా పగ్గాలను తమకు అప్పగించాలని కోరుతున్నారు. అసలు ఆ కూటమిని ఏర్పాటు చేసిందే తాను అని.. దానిని నడిపించేవారికి చేతకాకుంటే ఏం చేయాలో తనకు తెలుసని అన్నారు. దానికి తానేం చేయగలనని ప్రశ్నించారు. అయితే, బెంగాల్ ను విడిచి వెళ్లేది లేదని.. సొంత రాష్ట్రం నుంచే దేశంలో ప్రతిపక్ష కూటమిని నడిపిస్తానని చెబుతున్నారు.

Tags:    

Similar News