విష్ణు ప్రోత్బలం, వినయ్ వైఖరి... మనోజ్ సంచలన వ్యాఖ్యలు!
రాచకొండ పోలీస్ కమిషనర్ వద్ద విచారణకు హాజరు కావాలంటూ మోహన్ బాబు, విష్ణు, మనోజ్ లకు పోలీసులు నోటీసులు అందించిన సంగతి తెలిసిందే.
రాచకొండ పోలీస్ కమిషనర్ వద్ద విచారణకు హాజరు కావాలంటూ మోహన్ బాబు, విష్ణు, మనోజ్ లకు పోలీసులు నోటీసులు అందించిన సంగతి తెలిసిందే. వీటిపై మోహన్ బాబు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయగా.. ఆ కుర్చీకి గౌరవం ఇచ్చి తాను వెళ్తానని విష్ణు స్పందించారు. ఈ సమయంలో రాచకొండ సీపీని మనోజ్ కలిశారు.
అవును... రాచకొండ పోలీస్ కమిషనర్ ను మంచు మనోజ్ కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా.. తానెప్పుడూ ఆస్తులు అడగలేదని.. తనపై కావాలనే అనవసరపు అరోపణలు చేస్తున్నారని.. కూర్చుని మాట్లాడుకోవడానికి తాను ఎప్పటికీ సిద్ధమేనని మంచు మనోజ్ వెల్లడించారు.
ఈ సందర్భంగా ఈ వ్యవహారంలో తన భార్యను, చిన్న పాపను వాడుకున్నారని.. ఇప్పుడు అమ్మను అడ్డుపెట్టుకుని.. ఆమె హాస్పటల్ లో ఉన్నారని అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని.. కన్న తల్లిపై ఇలాంటి ప్రచారం చేయొద్దని.. ఆమె ఇంట్లోనే ఉన్నారని మనోజ్ తెలిపారు. ఇప్పుడు జరుగుతున్న వివాదానికి మా నాన్న కారణం కాదని పునరుద్ఘాటించారు.
అప్పట్లో విద్యాసంస్థలను మా నాన్న హైదరాబాద్ లోనే పెట్టొచ్చని.. కానీ, పేద ప్రజలు ఎక్కువగా ఉండే చంద్రగిరి ప్రాంతం అభివృద్ధి చెందాలని అక్కడ నెలకొల్పారని.. అయితే, ఆ ప్రాంత ప్రజలను మా నాన్న వరకూ రీచ్ కానివ్వడం లేదని.. అది ఆయనకు తెలియపరచాలని ప్రయత్నిస్తుంటే అడ్డుకుంటున్నారని మనోజ్ తెలిపారు.
ఇదే సమయంలో.. తిరుపతిలో విద్యానికేతన్ సంస్థల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వినయ్ వ్యవహార శైలి తనకు నచ్చడం లేదని.. వాటికి సమాధానం చెప్పాలని మనోజ్ స్పందించారు. ఇప్పటికే తాను ఫిర్యాదులో పేర్కొన్న విజయ్, కిరణ్ అనే వ్యక్తులను పోలీసులు పట్టుకుని విచారణ చేస్తున్నారని తెలిపారు.
ఈ సందర్భంగా... వినయ్ వైఖరి వల్లే తమ కుటుంబంలో వివాదాలు తలెత్తాయని.. మా అన్న మంచు విష్ణు ప్రోత్బలంతోనే ఇదంతా జరుగుతుందని మంచు మనోజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు!