బీజేపీ సర్వేలో మందకృష్ణ పాసయ్యారా?
శాసనసభ ఎన్నికల సందడి ముగియడం, కొత్త ప్రభుత్వం ఏర్పడటం జరిగిన సంగతి తెలిసిందే.
శాసనసభ ఎన్నికల సందడి ముగియడం, కొత్త ప్రభుత్వం ఏర్పడటం జరిగిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో కర్ణాటక, తెలంగాణలో గెలిచిన ఉత్సాహంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ లోక్ సభ ఎన్నికలకు సమాయత్తమవుతుంది. ఇందులో భాగంగా అభ్యర్థుల ఎంపికపై కసరత్తులు చేస్తుందని తెలుస్తుంది. ఇదే సమయంలో తెలంగాణలో లోక్ సభ ఎన్నికల్లో ఎలాగైనా సత్తా చాటాలని బీజేపీ పట్టుమీద ఉందని తెలుస్తుంది. ఈ సమయంలో సర్వేల ఫలితాలపై దృష్టి సారించిందని చెబుతున్నారు.
అవును... లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాన పార్టీలన్నీ అభ్యర్థుల ఎంపికలపై దృష్టి సారించినట్లు తెలుస్తుంది. ఈ సమయంలో ప్రధాన పార్టీల తరఫున అభ్యర్థుల ఎంపిక కొత్త సమీకరణాలకు తెర తీయబోతోందని అంటున్నారు. ఈ సమయంలో... ఆయా పార్టీల్లో అంతర్గతంగా చోటుచేసుకుంటున్న ఘటనలు అనూహ్య పరిణామాలకు దారి తీయబోతున్నాయని తెలుస్తుంది.
ఈ సమయంలో తాము ఆశిస్తున్న పార్టీ నుంచి టిక్కెట్ రానిపక్షంలో మరోపార్టీలోకి జంప్ చేసేందుకు ఇప్పటికే పలువురు సీనియర్లు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారని తెలుస్తుంది. మరోపక్క ఆయా పార్టీల్లో సీనియర్లకు పోటీగా సినీ నిర్మాతలు, మాజీ అధికారుల నుంచి గట్టిపోటీ నెలకొందని చెబుతున్నారు. ఈ సమయంలో అనూహ్యంగా మందకృష్ణ పేరు తెరపైకి వచ్చింది.
తెలంగాణ రాష్ట్రంలో మాదిగల ఓటుబ్యాంకు ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. దీంతో ఆ ఓటు బ్యాంకును ఎలాగైనా కైవసం చేసుకునే దిశగా బీజేపీ పావులు కదుపుతోందని తెలుస్తుంది. ఇందులో భాగంగా ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగను వరంగల్ లోక్ సభ స్థానం నుంచి పోటీకి దించాలని భావిస్తోందని సమాచారం. ఈ విషయంలో వరంగల్ నుంచి ఆయన పోటీకి సంబంధించి సర్వే కూడా నిర్వహించిందని అంటున్నారు.
అయితే ఈ సర్వేలో మందకృష్ణ అభ్యర్థిత్వానికి సానుకూలంగానే సర్వే ఫలితాలు వచ్చాయని.. దీంతో అతనికే వరంగల్ బీజేపీ ఎంపీ టిక్కెట్ కన్ ఫాం చేయబోతున్నారని ఊహాగాణాలు తెరపైకి వస్తున్నాయి. దీంతో ఇది సరికొత్త ఎత్తుగడ అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. మరోపక్క ఇక్కడ నుంచి మాజీ ఐపీఎస్ కృష్ణప్రసాద్ తోపాటు పార్టీ సీనియర్ నేతలు చింతా సాంబమూర్తి, శ్రీధర్ కూడా టికెట్ ఆశిస్తున్నారు.
కాగా... ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పరేడ్ గ్రౌండ్స్ వేదికగా.. మాదిగలకు బీజేపీ అండగా ఉంటుందని, వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని ప్రధాని మోడీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అందుకు తగ్గట్లుగానే న్యాయపరంగా వర్గీకరణ ప్రక్రియను వేగవంతం చేసేందుకు మోడీ సర్కార్ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసిందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు!
ఈ క్రమంలోనే మందకృష్ణను లోక్ సభ ఎన్నికల బరిలోకి దించితే మాదిగల మెజారిటీ ఓట్లు తమకే పడతాయన్న నమ్మకంతో బీజేపీ నేతలు ఉన్నారని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఆయనకు టిక్కెట్ ఇచ్చే విషయంలో సర్వే నిర్వహించారని.. అందులో మందకృష్ణకు సానుకూల ఫలితాలు వచ్చాయని.. దీంతో ఆయన అభ్యర్థిత్వం ఆల్ మొస్ట్ కన్ ఫాం అని అంటున్నారు!