అప్పులు లేని ఆర్థికవేత్త... మన్మోహన్ లైఫ్ లో ఆ ఫోన్ కాల్ బిగ్ టర్న్!

కష్టపడి పని చేసుకుంటూ పోతుంటే.. కొంత కాలానికి ప్రకృతి కూడా సహకరిస్తుందని, అదృష్టం దానంతట అదే వచ్చి తలుపు తడుతుందని అంటారు

Update: 2024-12-27 19:30 GMT

కష్టపడి పని చేసుకుంటూ పోతుంటే.. కొంత కాలానికి ప్రకృతి కూడా సహకరిస్తుందని, అదృష్టం దానంతట అదే వచ్చి తలుపు తడుతుందని అంటారు. మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ కు అలానే వచ్చింది.. కాకపోతే తలుపు తట్టలేదు కానీ.. ఫోన్ కాల్ ద్వారా వచ్చింది. ఇదంతా ఓ అర్ధరాత్రి జరిగింది. అప్పటి నుంచి మన్మోహన్ సింగ్ జీవితం పొలిటికల్ ఎంట్రీ ఇచ్చింది.

అవును.. పలు సందర్భాల్లో తన పొలిటికల్ ఎంట్రీ గురించి స్పందించిన మన్మోహన్ సింగ్.. తాను యాక్సిడెంటల్ ప్రధాన మంత్రిని మాత్రమే కాదు.. యాక్సిడెంటల్ ఆర్థిక శాఖ మంత్రిని కూడా అని చెప్పేవారు. ఈ సందర్భంగా ఓ అర్ధరాత్రి వచ్చిన ఫోన్ కాల్ తన జీవితాన్ని రాజకీయాలవైపు మల్లించిందని చెబుతుంటారు. ఆ కథ ఏమిటో ఇప్పుడు చూద్దామ్!

అది 1991వ సంవత్సరం. ప్రధానమంత్రిగా తెలుగు వ్యక్తి పీవీ నరసింహారావు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సమయం. నాడు భారతదేశ ఆర్థిక వ్యవస్థ దివాలా అంచున ఉందని చెబుతారు. దానికి తోడు రాజకీయ సంక్షోభం తారాస్థాయికి చేరుకుందని అంటారు. ఆ సమయంలో నెదర్లాండ్స్ లో నిర్వహించిన ఓ సదస్సుకు వెళ్లిన మన్మోహన్ సింగ్ తిరిగి వచ్చారు.

అలా పర్యటన ముగించుకుని భారత్ కు తిరిగి వచ్చిన మన్మోహన్ ఇంట్లో నిద్రిస్తుండగా.. అర్ధరాత్రి సమయంలో ఫోన్ కాల్ వచ్చింది. అది కూడా ప్రధాన మంత్రి ముఖ్య కార్యదర్శిగా పని చేస్తున్న పీసీ అలెగ్జాండర్ నుంచి. ఆ ఫోన్ కాల్ సారాంశం ఏమిటంటే.. మన్మోహన్ సింగ్ ను ఆర్థిక శాఖ మంత్రిగా కేంద్ర కేబినెట్ లోకి తీసుకోబోతున్నారు!

అర్థారాత్రి పూట వచ్చిన ఆ ఫోన్ కాల్ తో బిత్తరపోయిన మన్మోహన్.. తాను ఆర్థిక మంత్రిగా పనిచేయడం ఏమిటి అని అనున్నారంట. ఈ క్రమంలోనే 1991 జూన్ 21న రాష్ట్రపతి భవన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మన్మోహన్ సింగ్ దేశ ఆర్థిక మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అప్పటి నుంచి పలు సంస్కరణల దిశగా అడుగులు వేశారు.

ఈ విషయాలను మన్మోహన్ సింగ్ కుమార్తె దమన్ సింగ్ రాసిన "స్ట్రిక్ట్ లీ పర్సనల్: మన్మోహన్ అండ్ గురుశరణ్" అనే పుస్తకంలో ప్రస్తావించారు. తల్లితండ్రులతో చేసిన సంభాషణలు, గ్రంథాలయాల్లో సేకరించిన సమాచారంతో దమన్ సింగ్ ఈ పుస్తకాన్ని తీసుకొచ్చారు.

కాగా.. మన్మోహన్ సింగ్ – గురుశరణ్ కౌర్ లకు ముగ్గురు కుమార్తెలు. వారి పేర్లు... ఉపిందర్ సింగ్, అమృత్ సింగ్, దమన్ సింగ్. వీరిలో మన్మోహన్ సింగ్ పెద్దకుమార్తె ఉపిందర్ సింగ్.. అశోక విశ్వవిద్యాలయంలో ఫ్యాకల్టీ డీన్ గా ఉన్నారు. ఆమె గతంలో ఢిల్లీ యూనివర్శిటీలో హిస్టరీ డిపార్ట్ మెంట్ హెడ్ గానూ పనిచేశారు.

ఇక మన్మోహన్ సింగ్ రెండో కుమార్తె అమృత్ సింగ్.. ప్రముఖ మానవ హక్కుల న్యాయవాదిగా ఉన్నారు. హింస, ఏకపక్ష నిర్భంద పద్దతులకు వ్యతిరేకంగా అంతర్జాతీయ వేదికపై సైతం ఆమె తన గళం వినిపించారు. చిన్న కుమార్తె దమన్ సింగ్ మంచి రచయిత్రి కాగా.. ఆమె భర్త అశోక్ పట్నాయక్.. ఐఏఎస్ అధికారి.

ఇదే సమయంలో.. మన్మోహన్ సింగ్ ఆస్తుల గురించి మాట్లాడుకోవాలంటే... ఆయన చివరిగా 2019లో రాజ్యసభకు ఎన్నికైన సమయంలో ఇచ్చిన అఫిడవిట్ ను ఖాయం చేసుకోవచ్చని అంటారు. అందులో ఆయన తన ఆస్తులు, అప్పులు, ఆదాయాల వివరాలను వెల్లడించారు.

ఆ అఫిడవిట్ ప్రకారం మాజీ ప్రధాని, డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆస్తుల విలువ రూ.15 కోట్ల 77 లక్షలు. ఢిల్లీ, చండీగఢ్ లో రూ. 7.27 కోట్ల విలువైన అపార్ట్మెంట్లు కాగా.. ఈ దేశ దశ దిశను మార్చిన ఆర్థిక వేత్తకు ఎలాంటి అప్పుల్లు లేవు!

Tags:    

Similar News