ఆ ముఖ్యమంత్రికి దండాలు పెట్టాల్సిందే..!
అంతో ఇంతో ఇస్తాం. అయినా ఎంతిచ్చినా ప్రతిపక్షాలు మాపై విమర్శలు చేస్తున్నప్పుడు.. ఎందుకు ఇవ్వాలి''-ఇదీ సదరు ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు.
ఔను.. ఈ ముఖ్యమంత్రికి దండాలు పెట్టాల్సిందే.. అంటున్నారు నెటిజన్లు. ఎందుకుంటే.. బాధ్యతా యుతమైన స్థానంలో ఉన్న ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంత బాధ్యతారాహిత్యంతో ఉన్నారో.. ఈ ముఖ్యమంత్రి నిరూపించారని కూడా నెటిజన్లు ఒకింత ఘాటుగానే వ్యాఖ్యానిస్తున్నారు.
ఇటీవల కాలంలో కొన్నాళ్లుగా మణిపూర్‌లో కుకీ-మైతేయి తెగల మధ్య ఏర్పడిన రిజర్వేషన్ వివాదంతో రాష్ట్రంలో అల్లర్లు చెలరేగాయి. ఇక, ఈ వివాదాలు.. ఇతర రాష్ట్రాలకు కూడా పాకాయి. ఈ క్రమంలో హరియాణాలో నూ వివాదాలు చెలరేగి.. కొందరు మరణించారు కూడా.
ఇలాంటి సమయంలో ఒక బాధ్యతాయుత ముఖ్యమంత్రిగా ఇక్కడి సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్ వ్యవహరించాల్సి ఉంది. అయితే.. ఆయన అదుపు తప్పేశారు. ఎవరి అజెండానో తన భుజాలపై వేసుకున్నట్టు వ్యాఖ్యలు చేశారు. ''రాష్ట్రంలో అల్లర్లు చెలరేగాయి. వాటికి ప్రభుత్వం బాధ్యత వహించదు. ప్రభుత్వం ఎన్నని చూస్తుంది.
ప్రతి ప్రాణానికీ.. ప్రతి ఒక్కరికీ బాధ్యత వహించేందుకు మేం సిద్ధంగా లేం. ప్రైవేటు ఆస్తులు పాడైతే.. ధ్వంసమైతే.. మేం బాధ్యత వహించాలా? వాటికి ఆయా యజమానులే బాధ్యులు. పోయిన ప్రాణాలు తిరిగి రావు కాబట్టి.. అంతో ఇంతో ఇస్తాం. అయినా ఎంతిచ్చినా ప్రతిపక్షాలు మాపై విమర్శలు చేస్తున్నప్పుడు.. ఎందుకు ఇవ్వాలి''-ఇదీ సదరు ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు.
ఈ వ్యాఖ్యలపైనే ప్రజలు మండిపడుతున్నారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి రాజ్యాంగానికి బాధ్యుడు. ఆర్టికల్ 163 ప్రకారం.. ఆయన ప్రజల ధన, మాన ప్రాణాలకు రక్షణ వహిస్తానని.. తాను ముఖ్యమంత్రిగా(ఎవరైనాసరే.. ఏముఖ్యమంత్రి అయినా కూడా) పేర్కొంటారు. మంత్రుల విషయం వేరు. వారు వారి వారి శాఖలకే పరిమితమై ప్రమాణ స్వీకారం చేస్తారు కానీ.. ముఖ్యమంత్రి మాత్రం రాష్ట్రం మొత్తానికి బాధ్యత వహిస్తారు. వహించాలని రాజ్యాంగమే చెబుతోంది.
అయితే.. ఖట్టర్ మాత్రం తన హద్దులు తానే దాటేసి.. బాధ్యతా రహితంగా.. తనకు ఏమాత్రం సంబంధం లేదని.. ప్రజలందరనీ కాపాడే బాధ్యత తాను తీసుకోనని చెప్పడంతో నెటిజన్లు తీవ్రస్థాయిలో ఫైర్ అవుతున్నారు. తక్షణమే రాజీనామాచేయాలని కొందరు డిమాండ్ చేయడం గమనార్హం.