మావోయిస్టుల ఆయువు పట్టు చిక్కింది!
ఛత్తీస్‌గఢ్‌లో గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వచ్చింది. వచ్చీ రావడంతోనే రాష్ట్రానికి సవాలుగా మారిన మావోయిస్టులపై వ్యూహం ప్రకారం ముందుకు కదలింది.
ఛత్తీస్‌గఢ్‌లో గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వచ్చింది. వచ్చీ రావడంతోనే రాష్ట్రానికి సవాలుగా మారిన మావోయిస్టులపై వ్యూహం ప్రకారం ముందుకు కదలింది. ఈ నేపథ్యంలో మావోయిస్టుల ఆయువుపట్టు, వారికి కంచుకోటగా భావించే బీజాపూర్ జిల్లాలోని పూర్వి గ్రామాన్ని కేంద్ర బలగాలు తాజాగా స్వాధీనం చేసుకున్నారు. ఇది ఒక రికార్డనే చెప్పాలి. సుమారు 40 ఏళ్లకుపైగానే ఈ గ్రామాన్ని.. స్వాధీనం చేసుకోవాలని కేంద్ర బలగాలు ప్రయత్నిస్తున్నాయి. అయితే.. ఎప్పటకప్పుడు వారికి ఎదురు దాడులు ఎదురవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఒకసారి 70 మంది, తర్వాత 25 మంది మావోయిస్టుల దాడుల్లో చనిపోయారు.
ఏంటీ ప్రత్యేకత?
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా అంటేనే మావోయిస్టుల ప్రబావిత ప్రాంతం. ఇక్కడి పూర్వి గ్రామానికి ఒక ప్రత్యేకత ఉంది. మావోయిస్టు అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా పుట్టిన ప్రాంతం ఇదే. ఆయన తల్లి, ఇతర కుటుంబ సభ్యులు ఇప్పటికీ ఇక్కడే ఉంటున్నారు. అంతేకాదు.. మావోయిస్టులకు ఈ గ్రామం ఒక కార్యాలయంగా మారిపోయింది. ఎటు నుంచి ఎప్పుడైనా.. ఇక్కడకు వచ్చి.. వ్యూహ ప్రతివ్యూహాలు పన్నడంలోనూ.. కొన్ని కొన్ని సార్లు ఇక్కడే సమావేశాలు ఏర్పాటు చేయడంలోను.. విశ్రాంతి తీసుకోవడం.. విందులు, పెళ్లిళ్లు చేసుకోవడం వంటివి హిడ్మా సొంత గ్రామంలోనే చేసుకుంటారు.
హైలెవిల్ సెక్యూరిటీ
మావోయిస్టు అగ్రనేత హిడ్మా సొంత గ్రామం పూర్వి అంటే..ఆషామాషీ కాదు. భారత పార్లమెంటుకు ఎంత కట్టుదిట్టమైన భద్రత ఉంటుందో అంతకు మించిన భద్రత అది కూడా అధునాతన భద్రత ఇక్కడ మావోయిస్టులు కల్పించారు. పూర్తి సౌర విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడి గ్రామంలో ప్రతి ఒక్కరికీ మ్యాన్ ప్యాక్‌లు ఉన్నాయి. చీమ చిటుక్కుమన్నా.. గ్రామంలో కొత్త వ్యక్తులు ఎవరైనా వచ్చినా.. సెక న్ల వ్యవధిలో సమాచారం కేంద్ర వ్యవస్తకు చేరిపోతుంది. దీంతో మావోయిస్టులు వెంటనే అలెర్ట్ అయిపోతారు. ఆ కొత్త వ్యక్తులు ఎవరనేది సెన్సార్ల ద్వారా తెలుసుకుని.. అవసరమైతే.. దాడులు చేస్తారు. ఇలానే కేంద్ర బలగాలు అనేక సందర్భాల్లో చావు దెబ్బతిన్నాయి.
ఇక, తాజాగా పూర్వి గ్రామాన్ని చాలా చాకచక్యంగా కేంద్ర బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. అంతేకాదు.. ఇక్కడ జాతీయ జెండాను కూడా ఎగురవేశాయి. హిడ్మా బంధువులకు నిత్యావసరాలు ఇవ్వడంతోపాటు వారికి వైద్య సేవలు అందించారు. యువతకు విద్యను అందించేందుకు కూడా ఏర్పాట్లు చేశారు. ఇక, పోలీసులు రావడంతో స్తానిక యువత అడవుల్లోకి పరారయ్యారు. వారిని కూడా నయానో.. భయానో వెనక్కి రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇదిలావుంటే.. 40 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత.. మావోయిస్టుల కంచుకోట భారత పతాకం ఎగరడం రికార్డు!!