సైలెంట్ గా ఉండకపోతే.. మీ ఇంటికి ఈడీ వస్తుంది!
ఈ చర్చ సందర్భంగా కేంద్రమంత్రి మీనాక్షి లేఖి.. ప్రతిపక్షాలను ఉద్దేశిస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆ వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి.
చిన్నప్పుడు పిల్లలు అన్నం తినకకుండా మారాం చేసుంటే.. చెప్పిన మాట వినిపించుకోకుండా అల్లరి చేస్తుంటే.. బూచోడు వస్తాడు అని చెబుతుంటారు పెద్దలు. అలా వారి అల్లరిని, మారామును సున్నితంగా అదుపు చేస్తుంటారు. ఇక సినిమాల్లోనూ గట్రా... బ్లాక్ మెయిల్ సన్నివేశాలు ఉంటుంటాయి. దాదాపు ఈ రెండో కోవకు చెందినట్లుగా అనిపించే ఒక సన్నివేశం తాజాగా పార్లమెంటులో జరిగింది!
అవును... అల్లరిచేస్తే బూచోడు వస్తాడు అని పిల్లలను అదిరించినట్లు... అడిగినంత డబ్బు ఇవ్వకపోతే మీ అంతుచూస్తాం అని విలన్లు బెదిరించినట్లు... తాజాగా పార్లమెంటు లో బీజేపీ నాయకురాలు, కేంద్రమంత్రి స్పందించారు. ఈ సందర్భంగా విపక్షాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పరోక్షంగా ఇన్ని రోజులూ ఉన్న ఆరోపణలను నిజం చేసుకునేటంత పనికి పూనుకున్నారు!
అత్యంత వివాదాస్పదమైన "ఢిల్లీ అధికారుల నియంత్రణ బిల్లు" (జాతీయ రాజధాని ప్రాంత సవరణ బిల్లు-2023)ను లోక్ సభ తాజాగా ఆమోదించింది. విపక్షాల నిరసనల మధ్యే సుదీర్ఘ చర్చ జరిపిన అనంతరం ఈ బిల్లును దిగువసభ ఆమోదించింది. ఈ చర్చ సందర్భంగా కేంద్రమంత్రి మీనాక్షి లేఖి.. ప్రతిపక్షాలను ఉద్దేశిస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆ వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి.
"విపక్ష నేతలు సైలెంట్ గా ఉండకపోతే.. వారి ఇంటికి ఈడీ వస్తుంది" అని కేంద్రమంత్రి మీనాక్షి లేఖి విపక్షాలను హెచ్చరించారు. "ఢిల్లీ అధికారుల నియంత్రణ బిల్లు"పై లోక్ సభలో చర్చ జరుగుతుండగా.. ఈ బిల్లును వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టాయి. దీనిపై మీనాక్షి లేఖి స్పందిస్తూ.. "నిశ్శబ్దంగా ఉండండి. లేదంటే మీ ఇళ్లకు ఈడీ అధికారులు రావాల్సి ఉంటుంది" అని హెచ్చరించారు.
దీంతో విపక్షాలు ఫైరవ్వడం మొదలుపెట్టాయి. కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందని తాము చెప్పిన మాటలు ఇప్పుడు రుజువయ్యాయని దుయ్యబట్టాయి. ఇదే సమయంలో.. "ఆవేశంలో మీనాక్షి లేఖి విపక్షాలను బెదిరించే ప్రయత్నం చేశారు. మేం చేసిన ఆరోపణలకు ఇదే సాక్ష్యం"అని ఎన్సీపీ తెలిపింది.
ఇదే సమయంలో కేంద్రమంత్రి పార్లమెంటు సాక్షిగా ఇలా వ్యాఖ్యానించడంపై విపక్షాలు తీవ్రస్థాయిలో మండి పడ్డాయి. ఈ సందర్భంగా... "ఇది హెచ్చరికనా..? బెదిరింపా..?" అని ఇండియన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్ బీవీ కేంద్రంపై మండిపడ్డారు. ఇదే సమయంలో... పార్లమెంట్ వేదికగా ప్రతిపక్షాలను బెదిరించడం తీవ్ర దిగ్భ్రాంతికరమని టీఎంసీ మండిపడింంది.
మరోపక్క... ఈ బిల్లు పాసయిన నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై పరోక్షంగా మీనాక్షి లేఖి ఘాటు విమర్శలు చేశారు. ఆయన "పావు వంతు ముఖ్యమంత్రి" అని వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు. ఢిల్లీలో శాంతి భద్రతలకు సంబంధించిన అంశాల్లో కేంద్రానికే సగం అధికారం ఉంటుందని సుప్రీంకోర్టు ఇప్పటికే స్పష్టం చేసింది. అందువల్ల ఆయన 1/4 వంతు ముఖ్యమంత్రే" అని మంత్రి విమర్శించారు.