జీతం చాలక మిషన్ భగీరథ ఉద్యోగిని సూసైడ్!
ఆ నిర్లక్ష్యానికి మూల్యం తాజాగా ఒక ఉద్యోగిని ఆత్మహత్య
నోరు తెరిస్తే చాలు గొప్పలు చెప్పుకునే తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీశ్ రావుకు ఇప్పుడో అనుకోని కష్టం ఎదురైంది. తెలంగాణ రాష్ట్ర సీఎం కలల ప్రాజెక్టు అయిన మిషన్ భగీరథకు సారథ్యం వహించిన ఆయన.. అది సాధించిన విజయాల గురించి తరచూ ఏకరువు పెడుతుంటారు. అయితే.. ఆయన చెప్పే గొప్పలకు.. వాస్తవాలకు ఏ మాత్రం లింకు లేదన్నట్లుగా పరిస్థితులు ఉన్నట్లు చెబుతారు. కానీ.. వాటిని ఆయన పట్టించుకున్నది లేదు.
ఆ నిర్లక్ష్యానికి మూల్యం తాజాగా ఒక ఉద్యోగిని ఆత్మహత్య చేసుకోవాల్సిన దుస్థితి. మిషన్ భగీరథతో కేసీఆర్ సర్కారుకు వచ్చిన మైలేజీ ముందు.. ఆ ప్రాజెక్టు కింద పని చేసే ఉద్యోగులకు దక్కేది ఏమీ లేదనే చెప్పాలి. మిషన్ భగీరథ ప్రాజెక్టులో నీటి శుద్ధి కేంద్రంలో కాంట్రాక్టు ఉద్యోగినిగా పని చేసే పుష్పలత తాజాగా ఆత్మహత్య చేసుకున్నారు. చాలీచాలని జీతంతో పిల్లల్ని సాకలేకపోతున్నట్లుగా ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
నల్గొండ జిల్లా హాలియాలో చోటు చేసుకున్న ఈ విషాద ఉదంతం గురించి చూస్తే.. ప్రభుత్వం చెప్పే గొప్పల వెనుక ఇన్ని కష్టాలు ఉన్నాయా? అన్న భావన కలుగక మానదు.
తిరుమలగిరిసాగర్ మండలానికి చెందిన అల్వాల గ్రామానికి చెందిన పుష్పలత భర్త మహేశ్... పానగల్ మిషన్ భగీరథ నీటి శుద్ధి కేంద్రంలో కాంట్రాక్టు ఉద్యోగిగా పని చేస్తుండేవాడు. వీరికి ఒక పాప.. ఒక కుమారుడు ఉన్నారు.
అయితే.. చాలీచాలని జీతంతో ఇబ్బందులు పడుతూ.. ఆర్థిక సమస్యల నుంచి బయటకు రాలేక ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో.. భర్త ఉద్యోగాన్ని పుష్పలతకు ఇచ్చారు. తాజాగా ఆమె సైతం ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆమె రాసుకున్న సూసైడ్ నోట్ లో నెలకు రూ.9500 జీతంతో చాలీచాలని బతుకును గడపటం కష్టంగా ఉందని.. ఆ జీతం డబ్బులు కూడా సకాలంలో రాకపోవటంతో ఇబ్బందులు పడుతున్నట్లుగా పేర్కొంది.
తన కడుపులో గడ్డ ఉందని.. ఆపరేషన్ కు రూ.2 లక్షలు అవుతుందని.. అంత స్థోమత లేకపోవటంతో ఆత్మహత్య చేసుకున్నట్లుగా చెబుతున్నారు. నోరు తెరిస్తే.. తెలంగాణ గురించి గొప్పలు చెప్పుకునే హరీశ్.. తాను సారధ్యం వహించిన మిషన్ భగీరథలో పని చేసే ఉద్యోగుల కష్టాలు ఎంతన్న విషయం కళ్లకు కట్టినట్లుగా పుష్పలత ఆత్మహత్య చెప్పేసింది. ధనిక రాష్ట్రంలో పేదల ఆత్మహత్యలపై సమాధానం చెప్పే ధైర్యం హరీశ్ కు ఉందా? అన్నది ప్రశ్న.