కేసీఅర్ వ్యూహాన్ని స్టాలిన్ అమలు చేస్తున్నారా ?
తమిళనాడు అధికార డీఎంకే పార్టీకి వచ్చే ఎన్నికలు చావో రేవో అన్నట్లుగా మారుతున్నాయి.
తమిళనాడు అధికార డీఎంకే పార్టీకి వచ్చే ఎన్నికలు చావో రేవో అన్నట్లుగా మారుతున్నాయి. ఎందుకంటే ఏడున్నర పదుల వయసుకు చేరువలో ముఖ్యమంత్రి స్టాలిన్ ఉన్నారు. ఈసారి ఆయన డీఎంకేని గెలిపించి తన రాజకీయ వారసుడు కుమారుడు ఉదయనిధి స్టాలిన్ కి సీఎం గా పట్టాభిషేకం చేయవచ్చు అన్నది ఆలోచన. ఒకవేళ అది జరగకపోతే మాత్రం మరో 2031 వరకూ ఆగాలి. అప్పటికి ఎనభయ్యేళ్ళకు స్టాలిన్ వస్తారు.
ఆనాటికి రాజకీయాలు ఎలా ఉంటాయో ఎవరికి ఎరుక. దాంతో స్టాలిన్ కి 2026లో జరిగే అసెంబ్లీ ఎన్నికలు చాలా ముఖ్యంగా మారాయి. ఇదిలా ఉంటే గత అయిదేళ్ళ స్టాలిన్ పాలన ఏమంత గొప్పగా లేదని విపక్షాలు అంటున్నాయి. దాంతో పాటు యాంటీ ఇంకెంబెన్సీ కూడా సహజంగా ఉంటుంది.
మరో వైపు చూస్తే సూపర్ స్టార్ డం ఉన్న హీరో విజయ్ కొత్త పార్టీ పెట్టి డీఎంకే మీదకు దూసుకుని వస్తున్నారు. ఆయన అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకుంటారని ప్రచారం సాగుతోంది. అదే జరిగితే విజయ్ గ్లామర్ అన్నాడీఎంకే క్యాడర్ కలసి అధికార డీఎంకే గుండెల్లో రైళ్ళను పరిగెట్టించవచ్చు.
తెలంగాణా ఆత్మగౌరవ నినాదంతో రెండు సార్లు అధికారం అందుకున్న కేసీఆర్ ని ఈ విషయంలో స్టాలిన్ ఫాలో అవుతున్నారా అన్న చర్చ కూడా సాగుతోంది. ఈ క్రమంలో స్టాలిన్ తమిళుల ఆత్మ గౌరవం అంటూ కొత్త నినాదాన్ని ఎత్తుకున్నారని అంటున్నారు. ఆయన హిందీ భాషను తమిళుల మీదకు రుద్దడాన్ని తప్పు పడుతున్నారు. కేంద్రం జాతీయ విద్యా విధానాన్ని ప్రశ్నిస్తున్నారు అది అమలు చేయలేదని అయిదు వేల కోట్ల రూపాయలు కేంద్రం ఇవ్వకుండా ఆపిందని విమర్శిస్తున్నారు.
తమిళులకు ఈ జాతీయ విద్యా విధానం అవసరం లేదని హిందీ కూడా వద్దు అని ఆయన నినదిస్తున్నారు. మరో వైపు చూస్తే కేంద్రం చేసిన మూడు భాషల పాలసీ మీద అలాగే అసెంబ్లీ నియోజకవర్గాల పునర్ విభజన విషయంలో ఆయన కేంద్రంతో ఢీ కొట్టాలని చూస్తున్నారుఇ. తాను కేంద్రం మీద సమరం చేస్తున్నానని తనకు మద్దతుగా నిలవాలని ఆయన తమిళనాడు ప్రజలను కోరుతున్నారు.
కేంద్రం డీ లిమిటేషన్ అమలు చేస్తే అది తమిళనాడు రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బ తీస్తుందని అంటున్నారు. సామాజిక న్యాయం అని కూడా గొంతెత్తుతున్నారు. సంక్షేమ పధాకాలకు తీవ్ర నష్టం అని ప్రజలను హెచ్చరిస్తున్నారు. దీని మీద కేంద్రంతో ఎంతైనా పోరాటానికి రెడీ అంటున్నారు.
నిజానికి తమిళలకు ఆత్మ గౌరవ నినాదం అతి పెద్ద భావోద్వేగం కలిగించే ఇష్యూగా ఉంటుంది. దానిని సరిగ్గా ఎన్నికలకు ఏడాది సమయం ఉన్న వేళ వ్యూహాత్మకంగానే స్టాలిన్ బయటకు తీసారు అని అంటున్నారు. మరి అది కనుక పారితే మరోసారి తమిళ పీఠం స్టాలిన్ దే అని అంటున్నారు అదే సమయంలో విజయ్ రూపంలో కొత్తగా పుట్టుకుని వచ్చిన పార్టీ కేంద్రంతో ఏ మేరకు పోరాడుతుంది అన్న చర్చ కూడా జనంలో ఉంటుంది. స్టాలిన్ అనుభవం ఆయన దూకుడు ప్లస్ పాయింట్ గా అయితే మాత్రం వచ్చే ఎన్నికలు రసవత్తరంగా మారుతాయని అంటున్నారు.