బాబు సీఎం పదవికీ వైసీపీ ఎమ్మెల్యే బోడి గుండుకూ లింకేంటి ...?
ఇక చంద్రబాబు మళ్లీ సీఎం అయ్యేది కల అనేశారు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి.
చంద్రబాబు ఏడున్నర పదుల వయసులోనూ దూకుడు చేస్తున్నారు. చంద్రబాబు జిల్లాల టూర్లలో మాటలతో మంట పెట్టేస్తున్నారు. ఎక్కడికి వెళ్లినా లోకల్ లీడర్స్ మీద ఒక లెవెల్ లో విరుచుకుపడుతున్నారు. ఆయన అనంతపురం టూర్ లో భాగంగా రాప్తాడు వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మీద హాట్ కామెంట్స్ చేశారు.
వైసీపీ ఎమ్మెల్యే అక్రమంగా అవినీతి చేసి ఏకంగా రెందు వేల కోట్ల రూపాయలకు అధిపతి అయ్యారని బాబు భారీ ఆరొపణే చేశారు. ఈ ఆరోపణలకు అగ్గి మీద గుగ్గులం అయ్యారు తోపుదుర్తి. ఆయన వెంటనే మీడియా ముందుకు వచ్చేసారు. చంద్రబాబుకు దమ్ముంటే నాకు ఎక్కడ నుంచి వచ్చాయో ఆ సొమ్మెక్కడ ఉందో నిరూపించాలని సవాల్ చేసారు.
నాకు రెండు వేల కోట్ల సంపద అన్నారు. అంత వద్దు జస్ట్ యాభై కోట్లు నాకు ఇచ్చేసి మిగిలిన 1950 కోట్ల రూపాయలతో రాప్తాడులో సాగునీటి ప్రాజెక్టులను చంద్రబాబు పూర్తి చేయిస్తే చాలు. నేను ధన్యుడిని అవుతాను అని తోపుదుర్తి సెటైర్లు వేశారు. చంద్రబాబు ఇష్టం వచ్చినట్లుగా ఆరోపించడం కాదు, మాటకు కట్టుబడి తన సవాల్ ని స్వీకరించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇదిలా ఉండగా హెరిటేజ్ ద్వారా రైతుల నుంచి 25 వేల కోట్ల రూపాయలు చంద్రబాబు దోపిడీ చేశారని వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి భారీ ఆరోపణ చేశారు. ఆయనే అతి పెద్ద అవినీతిపరుడు అయి ఉండి మరొకరిని విమర్శించడమా అని వెటకరించారు. ఇక చంద్రబాబు మళ్లీ సీఎం అయ్యేది కల అనేశారు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. ఆయన కనుక 2024 ఎన్నికల్లో టీడీపీని గెలిపించి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తే ఆ రోజే నేను గుండు కొట్టించుకుంటాను అని అతి పెద్ద చాలెంజ్ నే చేసారు తోపుదుర్తి.
దీంతో తోపుదురి దృష్టిలో టీడీపీ ఇక అధికారంలోకి రాదు, చంద్రబాబు సీఎం అయ్యే చాన్స్ కూడా లేదని నిర్ధరించేశారు. మరి వచ్చే ఎన్నికల్లో గెలుస్తామని జస్ట్ ఆరు నెలలు ఓపిక పట్టాలని చంద్రబాబు అటు లోకేష్ జనాలకు చెబుతూ వస్తున్నారు కానీ బాబు గెలవడం అన్నది కల్ల అని తోపుదుర్తి ఏకంగా జోస్యమే చెప్పారు. బాబు సీఎం అయితే తన తలనీలాలు ఇచ్చేసి గుండు ఫోజులో ఉంటాను అని అంటున్నారు. మరి దీని మీద తమ్ముళ్లు ఏమంటారో.
ఏది ఏమైనా బాబు సీఎం పదవికీ వైసీపీ ఎమ్మెల్యే బోడి గుండుకూ లింకేంటి అన్నదే ఇపుడు చర్చకు వస్తున్న విషయం. అయితే కాదేదీ రాజకీయాలకు అనర్హం అన్నట్లుగా నేతలు మాటల తూటాలు పేలుస్తున్నారు. కొంపదీసి నిజంగా టీడీపీ గెలిస్తే తోపుదుర్తి గుండు చేయించుకుంటారా లేక నా సవాల్ ని బాబు స్వీకరించలేదు కాబట్టి నో అని చెప్పేసి తప్పించుకుంటారా అన్నది కూడా చూడాలని అంటున్నారు. మొత్తానికి చూస్తే అనంతపురం టూర్ చేసిన బాబు 2024 ఎన్నికల్లో తోపుదుర్తి చేత బోడి గుండు సవాల్ చేయించేసారు.