బీజేపీ రాజు గారు : మనిషొక చోట.. మనసొక చోట...?

తాజగా ఏపీలో రాజకీయ పరిణామాల మీద ఆయన మాట్లాడుతూ చంద్రబాబు అరెస్ట్ తరువాత ఏపీలో వైసీపీ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత అమాంతం పెరిగిపోయింది అని అంటున్నారు.

Update: 2023-10-08 03:19 GMT

విశాఖలో బీజేపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు తన రాజకీయ భవిష్యత్తు మీద తెగ టెన్షన్ పడుతున్నారని చర్చ సాగుతోంది. ఆయన ఆ మధ్య టీడీపీ అనుకూల చానల్ లో హార్ట్ విప్పి మరీ తనలోని టీడీపీ అభిమానం ఎంత వుందో స్వయంగా ప్రకటించుకున్నారు. ఏపీలో బీజేపీ టీడీపీల మధ్య పొత్తులు ఉంటాయని కూడా కామెంట్స్ చేసి షోకాజ్ నోటీసులు నాటి బీజేపీ ప్రెసిడెంట్ సోము వీర్రాజు ద్వారా అందుకున్నారు.

ఇక ప్రస్తుత బీజేపీ ప్రెసిడెంట్ పురంధేశ్వరి ఆశీస్సులు ఆయనకు నిండుగా ఉన్నాయని అంటున్నారు. టీడీపీ బీజేపీల మధ్య పొత్తును ఆమెతో సహా చాలా మంది కీలక నేతలు కోరుకుంటున్నారు అని కూడా ప్రచారంలో ఉంది. అయితే జనసేన టీడీపీల మధ్య పొత్తు కుదిరింది. బీజేపీ విషయం ఎటూ తేలడం లేదు. దాంతో రాజు గారు పరేషాన్ ఆవుతున్నారు. ఆన మనసు ఒక వైపు ఉందని, మనిషి బీజేపీలో ఉన్నారని అంటున్నారు.

ఆయన తనకు టికెట్ హామీ ఇస్తే జనసేన లేదా టీడీపీలోకి వెళ్తారని చాలా కాలంగా ప్రచారంలో ఉంది. అయితే బీజేపీలో ఉంటూ 2014లో గెలిచిన రాజు గారు చివరి నిముషంలో బీజేపీతో పొత్తు ఉంటే తాను జంప్ చేసి అప్రతిష్ట పాలు అవుతానేమో అని ఆలోచిస్తున్నారు అంటున్నారు.

ఎలాగైనా బీజేపీ టీడీపీ పొత్తు కుదరాలని భావిస్తున్న వారిలో ఆయన అతి ముఖ్య బీజేపీ నేతగా ఉన్నారని అంటున్నారు. ఇక ఆయన మాటలు కూడా టీడీపీకి అనుకూలంగానే ఎపుడూ ఉంటూ ఉంటాయి. తాజగా ఏపీలో రాజకీయ పరిణామాల మీద ఆయన మాట్లాడుతూ చంద్రబాబు అరెస్ట్ తరువాత ఏపీలో వైసీపీ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత అమాంతం పెరిగిపోయింది అని అంటున్నారు. ప్రజలంతా వైసీపీకి దూరం అయ్యారని తనదైన సర్వేని వినిపిస్తున్నారు.

అదే సమయంలో ఏపీలో చంద్రబాబు అరెస్ట్ జనంలో పెద్ద ఎత్తున చర్చగా మారిందని, చంద్రబాబుకు సానుభూతి పవనాలు బాగా వీస్తున్నాయని రాజు గారు అంటున్నారు. ఏతా వాతా ఆయన తేల్చింది ఏంటి అంటే ఏపీలో టీడీపీ అధికారంలోకి వస్తుందని. ఆయన ఉన్నది బీజేపీ, మరి టీడీపీకి సానుభూతి రావడం ఏంటో చంద్రబాబుకు ఆదరణ పెరగడం ఏంటో.

నిజంగా బీజేపీ వారు ఎవరైనా ఇలా మాట్లాడుతారా అని అంటున్నారు. ఈ రోజుకు చూస్తే బీజేపీకి టీడీపీకి పొత్తు లేదు. ఒక వేళ ఉంటే రాజు గారు ఈ రకంగా కామెంట్స్ చేసినా సబబుగా ఉండేది. కానీ బీజేపీ వేరే పార్టీ, అలా ఆ పార్టీలో ఉంటూ టీడీపీని రాజు గారు కీర్తించడం అంటే ఆయన మనసంతా సైకిలెక్కేయాలని ఉందని అంటున్నారు. అయితే ఆయన కోరుకుంటున్న సీటు విశాఖ ఉత్తరం.

ఆ సీటు నుంచి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన ఇటీవల పొలిటికల్ గా యాక్టివ్ అయ్యారు. దాంతో పాటు ఆయన ఈసారి వేరే సీటు నుంచి పోటీ చేయాలనుకున్నా చంద్రబాబు మార్చే సీన్ లేదని అంటున్నారు. దాంతో ఉత్తరం నుంచే మళ్లీ పోటీకి గంటా సిద్ధం అంటున్నారు. అదే జరిగితే రాజు గారు ఎంతలా టీడీపీని చంద్రబాబుని కీర్తించినా కూడా పొత్తులో భాంగా టికెట్ దక్కదనే అంటున్నారు. జనసేనలోకి వెళ్ళినా అదే పని అని అంటున్నారు. ఏది ఏమైనా రాజు గారు మాత్రం టీడీపీని పొగుడుతూ వైసీపీని విమర్శిస్తూ తన రాజకీయాన్ని రక్తి కట్టిస్తున్నారు.

Tags:    

Similar News