మండలిలోనూ ఖాతా తెరిచిన జనసేన!
రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఎమ్మెల్యే కోటాలోనివే కావడం, శాసనసభలో వైసీపీకి కేవలం 11 స్థానాలు మాత్రమే ఉండటంతో ఆ పార్టీ గెలవడానికి ఆస్కారం లేకుండా పోయింది.
శానసమండలికి ఎమ్మెల్యే కోటాలో ఖాళీలో అయిన రెండు ఎమ్మెల్సీ స్థానాలను టీడీపీ, జనసేన దక్కించుకున్నాయి. టీడీపీ తరఫున మాజీ మంత్రి, మాజీ ఎంపీ సి.రామచంద్రయ్య, జనసేన పార్టీ తరఫున డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యదర్శి పిడుగు హరిప్రసాద్ ఏకగ్రీవంగా ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యారు.
రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఎమ్మెల్యే కోటాలోనివే కావడం, శాసనసభలో వైసీపీకి కేవలం 11 స్థానాలు మాత్రమే ఉండటంతో ఆ పార్టీ గెలవడానికి ఆస్కారం లేకుండా పోయింది. దీంతో వైసీపీ తరఫున ఎవరూ బరిలో నిలవలేదు. దీంతో టీడీపీ, జనసేన పార్టీల నుంచి పోటీ చేసిన సి.రామచంద్రయ్య, పిడుగు హరిప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు,
రామచంద్రయ్య, హరిప్రసాద్ మాత్రమే నామినేషన్లు దాఖలు చేశారు. మరెవరూ నామినేషన్లు దాఖలు చేయలేదు. దీంతో వీరిద్దరూ ఏకగ్రీవంగా ఎన్నికయినట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. వీరిద్దరూ గెలవడానికి కావాల్సిన సంఖ్యా బలం కూటమి ప్రభుత్వానికి ఉన్న సంగతి తెలిసిందే.
కాగా ఎన్నికల ముందు వైసీపీ ఎమ్మెల్సీలుగా ఉన్న సి.రామచంద్రయ్య, మహ్మద్ ఇక్బాల్ టీడీపీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. మహ్మద్ ఇక్బాల్ తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి టీడీపీలో చేరగా రామచంద్రయ్య తన పదవికి రాజీనామా చేయకుండా టీడీపీలో చేరారు. దీంతో వైసీపీ ఫిర్యాదుతో శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజు.. రామచంద్రయ్యపై అనర్హత వేటు వేశారు.
ఈ క్రమంలో ఖాళీ అయిన రెండు ఎమ్మెల్సీల్లో తిరిగి సి.రామచంద్రయ్యకు మళ్లీ టీడీపీ అవకాశమిచ్చింది. మిత్రపక్షం జనసేనకు ఒకటి ఇవ్వాల్సి ఉన్న నేపథ్యంలో మరో స్థానాన్ని ఆ పార్టీకి ఇచ్చారు.
కాగా సి.రామచంద్రయ్య గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీఆర్, కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గాల్లో మంత్రిగా పనిచేశారు. టీడీపీ తరఫున రాజ్యసభ సభ్యుడిగానూ పనిచేశారు. 2019 ఎన్నికల ముందు వైసీపీలో చేరిన ఆయనకు ఎమ్మెల్సీ పదవి దక్కింది. ఇటీవల ఎన్నికల ముందు వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు.
అలాగే పిడుగు హరిప్రసాద్ గతంలో వివిధ పత్రికల్లో, న్యూస్ చానెళ్లలో జర్నలిస్టుగా పనిచేశారు. వివిధ రాజకీయ, సామాజిక అంశాలపై ఆయనకు మంచి అవగాహన ఉంది. జనసేన ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో కొనసాగుతున్నారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు రాజకీయ కార్యదర్శిగా ఉన్నారు.