హిందీలో కేంద్రమంత్రి లేఖ... తమిళ ఎంపీ షాకింగ్ రిప్లై!

కేంద్రంలోని బీజేపీ సర్కార్ కి, తమిళనాడులోని స్టాలిన్ ప్రభుత్వానికి మధ్య భాషాపరమైన వివాదం ఇటీవల తీవ్రస్థాయికి చేరుకుంటున్న సంగతి తెలిసిందే.

Update: 2024-10-26 17:30 GMT

కేంద్రంలోని బీజేపీ సర్కార్ కి, తమిళనాడులోని స్టాలిన్ ప్రభుత్వానికి మధ్య భాషాపరమైన వివాదం ఇటీవల తీవ్రస్థాయికి చేరుకుంటున్న సంగతి తెలిసిందే. ఇటీవల చెన్నై దూరదర్శన్ గోల్డెన్ జూబ్లీ వేడుకలతో పాటు హిందీ మాసోత్సవ వేడుకలను జరుపుకోవడాన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు సీఎం తెలిపారు.

భారత రాజ్యాంగం దేశంలోని ఏ భాషకూ జాతీయ భాష హోదా కల్పించలేదు.. హిందీయేతర రాష్ట్రాల్లో హిందీ భాషా మాసోత్సవాలు జరుపుకోవడం అంటే భాషా వైవిధ్యంపై ఆందోళనలు లేవనెత్తడమే అంటూ ప్రధానికి ఆయన లేఖ రాశారు. ఈ నేపథ్యంలో తాజాగా కేంద్రమంత్రికి - తమిళ ఎంపీకి మధ్య లేఖల రూపంలో జరిగిన సంభాషణ ఆసక్తిగా మారింది.

అవును... కేంద్రం, తమిళనాడు మధ్య భాషాపరమైన వివాదం నడుస్తోన్న వేళ.. కేంద్రమంత్రి-ఎంపీ మధ్య జరిగిన వ్యవహారం ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఇందులో భాగంగా.. కేంద్రమంత్రి హిందీలో రాసిన లేఖకు... తమిళంలో సమాధానం ఇచ్చిన డీఎంకే ఎంపీ.. హిందీ లేఖ తనకు ఏమాత్రం అర్ధం కాలేదని బదిలిచ్చారు.

వివరాళ్లోకి వెళ్తే... రైళ్లలో ఆహారనాణ్యత, పరిశుభ్రతకు సంబంధించిన అంశాన్ని లేవనెత్తారు డీఎంకే ఎంపీ పుదుకొట్టై ఎంఎం అబ్ధుల్లా. ఈ ప్రశ్నలకు సమాధానంగా కేంద్రమంత్రి రవనీత్ సింగ్ బిట్టూ హిందీలో సమాధానం ఇచ్చారు. దీనిపై రెండు వేరు వేరు భాషల్లో ఒకరికొకరు రాసుకున్న లేఖలను ఎంపీ అబ్దుల్లా ఎక్స్ వేదికగా పంచుకున్నారు.

ఇందులో భాగంగా... "రైల్వేశాఖ సహాయమంత్రి నుంచి వచ్చే లేఖ ఎప్పుడూ హిందీలోనే ఉంటుంది.. ఆయన ఆఫీసులో ఉన్న అధికారులకు ఫోన్ చేసి.. నాకు హిందీ రాదని, లేఖను ఇంగ్లిష్ లో పంపాలని కోరినా.. దానికీ హిందీలోనే రిప్లై వచ్చింది.. నేను మాత్రం ఆయన అర్ధం చేసుకునేలాగానే రిప్లై పంపాను" అని వెల్లడించారు.

ఇప్పుడు ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఒక ఎంపీ తనకు హిందీ రాదని.. తన స్థానిక భాషలో కాకపోయినా, కనీసం ఇంగ్లిష్ లో అయినా రిప్లై ఇవ్వాలని అడిగినా కూడా అధికారులు స్పందించకపోవడంపై నెట్టింట కామెంట్లు హల్ చల్ చేస్తున్నాయి.

Tags:    

Similar News