ఏపీకి ఏ హామీ ఇవ్వని ప్రధాని మోడీ...!

కానీ అదేమీ లేకుండా పర నింద స్వీయ ప్రశంస అన్న తీరున ప్రధాని ప్రసంగం చేశారు.

Update: 2024-03-17 14:39 GMT

ఏపీకి ఎన్నికల వేళ వచ్చారు. పదేళ్లుగా ఏపీ విభజన సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. రాజధాని లేదు, పోలవరం లేదు, విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేస్తున్నారు. అదే టైం లో విభజన హామీలు కూడా పూర్తిగా నెరవేరలేదు. ఎన్నికల వేళ ఓట్ల కోసం ఏపీకి వచ్చిన మోడీ కొన్ని కీలక అంశాల మీద స్పష్టత ఇస్తారని అంతా భావించారు అలాగే హామీలు కూడా ఏమైనా ఇస్తారు అనుకుంటే డబుల్ ఇంజన్ సర్కార్ అంటూ ఆయన రొటీన్ స్పీచ్ ఇచ్చేసి వెళ్లిపోయారు అని అంటున్నారు.

ఏపీకి తాము ఎంతో చేశామని ప్రధాని చెప్పుకున్నారు. సరే కొన్ని విద్యా సంస్థలు ఇచ్చారు. అలాగే కేంద్ర ప్రభుత్వ పధకాలు దేశంలో అమలు అయినట్లే ఏపీలో కూడా అయ్యాయి. కానీ ఏపీని స్పెషల్ గా చూడాల్సి ఉంది. ప్రత్యేక హోదా అన్నది ఏపీకి ఇవ్వాలి. విభజన నాటి కంటే కూడా ఈ రోజు అప్పుల కుప్పగా ఏపీ ఉంది. ఏపీని ఆదుకునేందుకు ఇదీ మా యాక్షన్ ప్లాన్ అని ప్రధాని స్థాయి వ్యక్తి, మరోసారి ప్రధాని కాబోతున్న వారు చెప్పాల్సిన మాట.

కానీ అదేమీ లేకుండా పర నింద స్వీయ ప్రశంస అన్న తీరున ప్రధాని ప్రసంగం చేశారు. ఎన్డీయేకు నాలుగు వందల సీట్లు కట్టబెట్టాలి అంటూ ప్రధాని చెప్పుకొస్తున్నారు తప్ప ఏపీకి ఏమి చేశారని ఏమి చేయబోతారని ప్రజలు అడిగితే మాత్రం జవాబు లేదు అన్న విమర్శలు ఉన్నాయి. ప్రత్యేక హోదాను లేకుండా చేశారు.

ప్రధాని ప్రసంగం చేసిన ప్రాంతంలోనే అమరావతి ఉంది. దానిని చంద్రబాబు కూడా ప్రస్తావించారు. అయినా సరే మోడీ ఆ ఊసే చెప్పలేదు. పోలవరం అన్న మాట కూడా ఎత్తలేదు, సవరించిన అంచనాలను కేంద్రం ఆమోదించిందో లేదో తెలియదు, పోలవరం నిధులు లేక పడకేసింది అని విమర్శలు ఉన్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రవేట్ పరం చేయబోమని ఒక్క హామీ ఇవ్వలేదు.

అసలు ఏపీ సమస్యలనే ప్రధాని టచ్ చేయలేదని అంటున్నారు. మరి ఏమీ కాకుండా నాలుగు వందల సీట్లు ఇవ్వాలని ఆయన కోరడంలో అర్ధం ఏమిటి అన్నదే తెలియడం లేదు అంటున్నారు. ఎన్డీయేతో టీడీపీ పొత్తు పెట్టుకోవడం వల్ల బలోపేతం అయింది అని చెబుతున్న ప్రధాని ఏపీని బలోపేతం చేసేందుకు తాము ఏమి చేస్తామో కూడా చెప్పాలి కదా అన్న ప్రశ్నలు వస్తున్నాయి.

అయితే డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటే అభివృద్ధి అని మోడీ అంటున్నారు. 2014 నుంచి 2018 దాకా డబుల్ ఇంజన్ సర్కార్ ఉంది కదా అపుడు ఏమి చేశారు అన్న ప్రశ్నలకూ జవాబులు లేవు అనే అంటున్నారు. మొత్తం మీద ఇండియా కూటమిని తిట్టడానికి ఎన్డీయేని పొగడడానికే మోడీ చిలకలూరిపేట సభకు వచ్చారు అని అంటున్నారు.

మోడీ స్పీచ్ ఎఫెక్టివ్ గా లేదని కామెంట్స్ వస్తున్నాహ్యి. ఎన్నికల వేళ మరోసారి ప్రధాని అవుదామని చూస్తున్న దేశ పెద్ద నుంచి ఏపీకి కీలక హామీలు కొన్ని అయినా వస్తే కూటమి సభ సక్సెస్ అయినట్లుగా భావించుకోవాల్సి ఉందని, కానీ అలా జరగలేదని అంటున్నారు. ఇక ఈ సభ ద్వారా కూటమి ఎన్నికల ప్రచారానికి శుభారంభం చేద్దామని చూసినా ఆ జోష్ అయితే కనిపించలేదని అంటున్నారు. ఏపీకి వచ్చిన ప్రధాని ఎన్నికల వేళ కూడా ఎంతో చేశామని చెప్పుకుంటూ పోతున్నారు తప్ప ప్రజలు ఆశించిన స్థాయిలో అయితే ఆయన ప్రసంగం లేదని పెదవి విరుస్తున్నారు.

Tags:    

Similar News