జనాలను మోడీ, షా పిచ్చోళ్ళనుకుంటున్నారా ?

తెలంగాణా ప్రజలను నరేంద్రమోడి, అమిత్ షా పిచ్చోళ్ళని అనుకుంటున్నారా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.

Update: 2023-11-27 09:13 GMT

తెలంగాణా ప్రజలను నరేంద్రమోడి, అమిత్ షా పిచ్చోళ్ళని అనుకుంటున్నారా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ప్రజలకు కేంద్రప్రభుత్వం అందిస్తున్న పథకాలు, వివిధ రాష్ట్రాల్లో కేంద్రం చేస్తున్న అభివృద్ధిని చెప్పుకోవటంలో తప్పులేదు. ఇందులో భాగంగానే గడచిన పదేళ్ళుగా తెలంగాణా అభివృద్ధికి కేంద్రం చేసిన సాయాన్ని వివరించి చెప్పటంలో కూడా తప్పుపట్టాల్సిన పనిలేదు. అయితే ఈ విషయాలు చెప్పకుండా కేసీయార్ అవినీతిగురించి పదేపదే ప్రస్తావిస్తున్నారు. సరే ప్రత్యర్ధులపై ఆరోపణలు మామూలే అని సరిపెట్టుకోవచ్చు.

కానీ వీళ్ళ ప్రచారంలో పదేపదే చెబుతున్నది ఏమిటంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కేసీయార్ కూతురు కవిత జైలుకు వెళ్ళక తప్పదని, అవినీతికి పాల్పడినందుకు కేసీయార్ కూడా జైలు జీవితం తప్పదని చెబుతున్నారు. నిజానికి కేసీయార్ మీద కానీ కవిత మీద ఈగ వాలకుండా జాగ్రత్తగా చూసుకుంటున్నదే మోడీ అన్న విషయం జనాల్లో బాగా చర్చ జరుగుతోంది. మోడీ, కేసీయార్ మధ్య జరిగిన లోపాయికారి ఒప్పందంలో భాగంగానే లిక్కర్ స్కామ్ లో పీకల్లోతు కూరుకుపోయిన కవితను ఈడీ అరెస్టు చేయలేదని జనాలందరు నమ్ముతున్నారు.

లేకపోతే లిక్కర్ స్కామ్ లో పాత్రదారులు, బినామీలను కూడా అరెస్టుచేసిన ఈడీ కవితను మాత్రం విచారణ చేసి ఎందుకు అరెస్టుచేయకుండా విడిచిపెట్టేసినట్లు ? వీళ్ళిద్దరి మధ్య జరిగిన ఒప్పందమే కారణమని కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఆరోపణలు నిజమే అని జనాలు నమ్ముతున్నారు. అలాగే కేసీయార్ అవినీతి పై యాక్షన్ తీసుకోవాలంటే కేంద్రం ఎప్పుడో తీసుకునుండచ్చు. అయినా ఇంతకాలం అలాంటి ప్రయత్నాలు కూడా చేయలేదు.

రహస్య మిత్రులు కాబట్టే కేసీయార్, కవితను కేంద్రప్రభుత్వం ముట్టుకోవట్లేదని జనాలకు తెలిసిపోయింది. మరీ పరిస్ధితుల్లో ఎన్నికల ప్రచారంలో కేసీయార్, కవిత అరెస్టులు ఖాయమని మోడీ, షా పదేపదే ఎందుకు హెచ్చరిస్తున్నారో అర్ధంకావటంలేదు. ఇక్కడే జనాలను వీళ్ళిద్దరు పిచ్చోళ్ళని అనుకుంటున్నారా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఎవరిని ఎందుకు అరెస్టు చేస్తున్నారు ? ఎవరిని ఎందుకు వదిలేస్తున్నారు అనే విషయాలు చాలా డీటైల్డ్ గా జనాలకు సోషల్ మీడియా ద్వారా తెలిసిపోతోంది. కాబట్టి అనవసర విషయాలపై మాట్లాడి టైం వేస్తుచేసుకోవటం దండగనే చెప్పాలి.

Tags:    

Similar News