బ్రేకింగ్... మోహన్ బాబుకు బిగ్ షాక్... ఏ క్షణమైనా అరెస్ట్ చేస్తారా?

మోహన్ బాబుకు తెలంగాణ హైకోర్టులో బిగ్ షాక్ తగిలింది!

Update: 2024-12-23 10:45 GMT

మంచు కుటుంబ వ్యవహారం ఇటీవల తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. తమకు ప్రాణహాని ఉందంటూ మనోజ్.. మనోజ్ తో తనకు ప్రాణహాని ఉందంటూ మోహన్ బాబు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులు చేయడం తీవ్ర సంచలనంగా మారింది. ఈ సమయంలో దాదాపు ఎవరి ఊహకూ అందనన్ని మలుపులు చోటు చేసుకున్నాయనే కామెంట్లు వినిపించాయి.

అయితే.. ఈ ఘటనలో ప్రధానంగా జల్ పల్లి లోని ఆయన నివాస ఆవరణలో మంచు మనోజ్ తో పాటు వెళ్లిన జర్నలిస్టులపై దాడులు జరిగాయని అంటున్నారు! ఈ సమయంలో ఓ జర్నలిస్టుపై మోహన్ బాబు దాడి చేయగా.. ఆయన తీవ్రంగా గాయపడ్డారు. దీంతో.. మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు పోలీసులు.

ఈ నేపథ్యంలో..ఆస్పత్రి లో ఉన్న సదరు జర్నలిస్టును మోహన్ బాబు వెళ్లి పరామర్శించి రావడంతో పాటు.. జరిగిన ఘటనపై కుటుంబానికి క్షమాపణలు చెప్పారు. ఇదే సమయంలో.. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా హైకోర్టు షాకిచ్చింది.

అవును... మోహన్ బాబుకు తెలంగాణ హైకోర్టులో బిగ్ షాక్ తగిలింది! జర్నలిస్టుపై దాడి కేసులో ఆయన పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. ఈ సందర్భంగా... మోహన్ బాబు అనారోగ్యంతో ఉన్నారని.. గుండె, నరాల సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారని ఆయన తరుపు న్యాయవాది కోర్టుకు తెలిపారు!

ఇదే సమయంలో... ఇటీవల తన మనవడిని కలిసేందుకు దుబాయ్ వెళ్లొచ్చిన మోహన్ బాబు ప్రస్తుతం తిరుపతిలోనే ఉన్నారని.. అక్కడ ఉన్న విద్యాసంస్థల బాధ్యతలు చూస్తున్నారని తెలిపారు. మరోపక్క... దాడి ఘటనలో ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని అడిషనల్ అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించారు.

ఇలా ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం మోహన్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ ను కొట్టేసింది. దీంతో... మోహన్ బాబును ఏక్షణమైనా అరెస్ట్ చేసే అవకాశం ఉందా అనే చర్చ మొదలైందని అంటున్నారు.

Tags:    

Similar News