మందిర్ - మసీదు వివాదాలు ఆగేదెప్పుడు? ఆర్ఎస్ఎస్ చీఫ్ ఆవేదన
మహారాష్ట్రలోని పుణేలో జరిగిన ఓ కార్యక్రమంలో ‘విశ్వగురు భారత్’ అనే అంశంపై మోహన్ భగవత్ మాట్లాడారు.
దేశంలో మందిర్ - మసీద్ వివాదాలపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఆందోళన వ్యక్తం చేశారు. మహారాష్ట్రలోని పుణేలో జరిగిన ఓ కార్యక్రమంలో ‘విశ్వగురు భారత్’ అనే అంశంపై మోహన్ భగవత్ మాట్లాడారు. అయోధ్య రామాలయం నిర్మాణం తర్వాత మందిర్ - మసీదు వివాదాలు రోజురోజు ఎక్కువవుతున్నాయని, ఇలాంటి వివాదాలు లేవనెత్తడం ద్వారా తాము హిందూ నాయకులుగా చలామణి అవ్వొచ్చని కొందరు భావిస్తున్నారని మండిపడ్డారు మోహన్ భగవత్.
మన దేశంలో పౌరులు సామరస్యంతో కలిసిమెలిసి జీవించగలరి ప్రపంచానికి చూపించాల్సిన అవసరం ఉందని అన్నారు మోహన్ భగవత్. భారతీయ సమాజం భిన్నత్వంలో ఏకత్వంతో జీవిస్తుందని గుర్తు చేశారు. రామకిష్ణ మఠంలో క్రిస్మస్ జరుపుతామని, మనం హిందువులం కాబట్టే అలా చేయగలమని చెప్పారు. ‘దేశంలో సామరస్యంగా జీవిస్తున్నాం. ఈ ఆదర్శానికి ప్రపంచానికి చూపి ఓ రోల్ మోడల్ గా ఉండాలని’ ఆర్ఎస్ఎస్ చీఫ్ సూచించారు.
ఇప్పుడు దేశంలో కొత్త వివాదాలు రేపుతున్నారు. అయోధ్య రామమందిరం పూర్తయిన తర్వాత దేశంలో ఎక్కడో చోట మందిర్ - మసీదు వివాదాలు రేపి హిందూ నాయకులుగా గుర్తింపు పొందాలనుకోవడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు. రామ మందిరం నిర్మాణమనేది హిందువుల నమ్మకానికి సంబంధించినది. ఇకపై కొత్త వివాదాలు తలెత్తకుండా చూడాల్సిన అవసరం ఉందని మోహన్ భగవత్ స్పష్టం చేశారు.
దేశంలో ఇటీవల కొన్నిచోట్ల హిందూ ఆలయాలపై మసీదులు, దర్గాలు నిర్మించారని ఫిర్యాదులు వస్తున్నాయి. దీనిపై సర్వేలు చేసి ఆలయాలను పున: ప్రతిష్ఠించాలని చాలా మంది కోర్టులకు వెళుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్ఎస్ఎస్ చీఫ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అయితే తన ప్రసంగంలో ప్రత్యేకంగా ఏ ఆలయం మసీదు పేరు ప్రస్తావించకపోయినా ఉత్తరప్రదేశ్ లో ఇటీవల సంచలనం రేపిన పలు మసీదు వివాదాలపైనే మోహన్ భగవత్ వ్యాఖ్యలు చేశారని అంటున్నారు. బయట నుంచి కొన్ని గ్రూపులు మళ్లీ పాత పాలన తేవాలని కోరుకుంటున్నాయని ఆరోపించారు. ఇప్పుడు దేశంలో రాజ్యాంగబద్ధ పాలన నడుస్తోంది. ఈ వ్యవస్థలో ప్రజలు తమ ప్రతినిధులను, ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు. ఆధిపత్యం చెలాయించే రోజులు పోయాయి అని తేల్చిచెప్పారు. ప్రతి ఒక్కరూ తమను తాము భారతీయులుగా చెప్పుకోవాలి. ఆధిపత్య భాష ఎందుకు? ఎవరు మెజార్టీ? ఎవరు మైనార్టీ? ఎవరికి ఇష్టమైన దేవుడుని వారు కొలుస్తారని చెప్పుకొచ్చారు. చట్టాలు, నిబంధనలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని సూచించారు.