ఆమెకు న్యాయం కోసం చిరకాల ప్రత్యర్థులు కలిసి రోడ్డు మీదకు!

ఒకటి కాదు రెండు కాదు.. ఏళ్లకు ఏళ్లుగా వారు ప్రత్యర్థులు. వారి పేరు చెప్పినంతనే.. ఉప్పు నిప్పులా వ్యవహరిస్తారు.

Update: 2024-08-19 04:10 GMT

ఒకటి కాదు రెండు కాదు.. ఏళ్లకు ఏళ్లుగా వారు ప్రత్యర్థులు. వారి పేరు చెప్పినంతనే.. ఉప్పు నిప్పులా వ్యవహరిస్తారు. ఇక.. ఆటలో భాగంగా మైదానంలోకి దిగితే.. ఆ మ్యాచ్ మీదే అందరి కళ్లు. అంతలా పోటాపోటీ ఉండే రెండు ఫుట్ బాల్ టీంలు ఇప్పుడు కలిసికట్టుగా రోడ్డు మీదకు ఎక్కాయి. అది కూడా న్యాయం కోసం. ఇప్పుడు చెప్పేదంతా కోల్ కతా వైద్య విద్యార్థిని దారుణ హత్యాచార ఘటన నేపథ్యంలో అక్కడి రెండు ఫుట్ బాల్ క్లబ్ లు న్యాయం కోసం చేతులు కలిపాయి. ఈ రెండు గ్రూపులు ఏకతాటిపైకి వచ్చి.. కోల్ కతా ఘటనపై భారీ ర్యాలీ చేపట్టేందుకు సిద్ధమయ్యాయి. అయితే.. సెక్యూరిటీ కారణాలతో వారి ప్రయత్నాల్ని అడ్డుకున్నారు.

దేశంలోని మిగిలిన రాష్ట్రాలకు భిన్నంగా పశ్చిమబెంగాల్ ప్రజలు ఫుట్ బాల్ కు ఇచ్చే ప్రాధాన్యత గురించి తెలిసిందే. ఇక.. ఆ రాష్ట్ర రాజధాని కోల్ కతా ప్రజలు ఫుట్ బాల్ ఆటకు పెద్దపీట వేస్తారు. కోల్ కతాలోని రెండు క్లబ్ లు చిరకాల ప్రత్యర్థులుగా పేరుంది. వారే.. ఈస్ట్ బెంగాల్.. మోహన్ బగాన్ క్లబ్ లు. ఈ రెండు క్లబ్ ల మధ్య ఆటలో ఒకరికొకరంటే అస్సలు పడదు. దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన ఫుట్ బాల్ క్లబ్ లుగా వాటికి పేరుంది.

ఈ రెండు క్లబ్ లకు చెందిన వారిని కోల్ కతా వైద్య విద్యార్థిని హత్యాచార ఉదంతం కదిలించి వేసింది. అందుకే.. ఈ రెండు క్లబ్ లకు చెందిన వందలాది మంది మద్దతుదారులు.. సాల్ట్ లేక్ స్టేడియం వద్దకు చేరుకున్నారు. వైద్య విద్యార్థిని కుటుంబానికి న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. తొలుత ఒక ఫుట్ బాల్ క్లబ్ రాగా.. కాసేపటికే మరో క్లబ్ మద్దతుదారులు వచ్చి చేశారు. ఇలా మొత్తం మూడు ఫుట్ బాల్ క్లబ్ మద్దతుదారులు ఒక చోటుకు చేరటం.. వారంతా కలిసి కట్టుగా నిరసనకు ప్లాన్ చేయటం.. అత్యంత అరుదైన పరిణామంగా చెబుతున్నారు.

అయితే.. పోలీసులు వీరి నిరసన ప్రదర్శనకు అభ్యంతరం తెలియజేశారు. భద్రతా సమస్యలు చోటుచేసుకుంటాయని నచ్చజెప్పారు. అయినప్పటికీ ఆందోళనాకారులు మాత్రం ముందుకు వెళ్లే ప్రయత్నం చేశారు. ఈ నిరసనల్లో ఆలిండియా ఫుట్ బాల్ ఫెడరేషన్ అధ్యక్షుడు కల్యాణ్ చౌబే కూడా పాల్గొనటం గమనార్హం. మొత్తంగా వైద్య విద్యార్థినిపై జరిగిన దారుణ హత్యాచారం రెండు క్లబ్ ల మధ్య శత్రుత్వాన్ని చెరిపేసి.. ఆమెకు న్యాయం చేయాలంటూ రోడ్డు బాట పట్టటం హాట్ టాపిక్ గా మారింది.

Tags:    

Similar News