పంప‌కాలు షురూ.. అడ్డంగా దొరికిన పోలీసు అధికారి

తాజాగా మ‌ల్కాజిగిరి నియోజ‌క‌వ‌ర్గంలో ఓ పోలీసు అధికారులు డ‌బ్బుల క‌ట్ట‌ల‌తో ప‌ట్టుబ‌డ‌డం.. అంద‌రినీ విస్మ‌యానికి గురి చేసింది.

Update: 2023-11-28 09:05 GMT

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌చారం మంగ‌ళ‌వారం సాయంత్రంతో ముగియ‌నుంది. ఇక‌, ఓట‌ర్ల‌ను త‌మ‌వైపు తిప్పుకొనేందుకు ఇప్ప‌టి వ‌ర‌కు ఇంటింటికీ తిరిగి, వాడ‌వాడ‌లోనూ మీటింగులు పెట్టిన నాయ‌కులు.. మ‌రో దారి వెతుక్కుంటున్నారు. ఈ క్ర‌మంలో డ‌బ్బులు వెద‌జల్లే కార్య‌క్ర‌మాల‌కు శ్రీకారం చుట్టారు. ఈ విష‌యంలో ఆ పార్టీ ఈ పార్టీ అనే తేడా లేకుండా.. అన్నీ కూడా.. త‌మ శ‌క్తి కొల‌దీ ఓట‌ర్ల‌ను త‌మ వైపు తిప్పుకొనే ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి.

తాజాగా మ‌ల్కాజిగిరి నియోజ‌క‌వ‌ర్గంలో ఓ పోలీసు అధికారులు డ‌బ్బుల క‌ట్ట‌ల‌తో ప‌ట్టుబ‌డ‌డం.. అంద‌రినీ విస్మ‌యానికి గురి చేసింది. దారికాచిన కాంగ్రెస్ పార్టీ కార్య‌క‌ర్త‌లు.. స‌ద‌రు అధికారిని వెంబ‌డించి మ‌రీ.. ఆయ‌న ప్ర‌యాణిస్తున్న కారును అడ్డుకున్నారు. ఆయ‌న‌ను బ‌య‌ట‌కు లాగి.. కారులోప‌ల వెత‌గ్గా.. సుమారు 7 ల‌క్ష‌ల రూపాయ‌లు దొరికాయి. ఈ సొమ్మును ఎక్క‌డికి తీసుకువెళ్తున్నారు? ఎందుకు తీసుకువెళ్తున్నార‌నే విష‌యాల‌పై ఆయ‌న స‌మాధానం చెప్ప‌లేదు.

కారులోప‌ల‌.. మ‌ల్కాజిగిరి నుంచి పోటీ చేస్తున్న బీఆర్ ఎస్ అభ్య‌ర్థి మ‌ల్లారెడ్డి పేరుతో ఉన్న బ్యాన‌ర్లు, పొటోలు క‌నిపించాయి. దీంతో ఆయ‌న ప‌క్షాన ఈ అధికారులు డ‌బ్బులు పంచేందుకు వెళ్తున్నార‌ని.. కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు ఆరోపించారు. అయితే.. స‌ద‌రు అధికారి అక్క‌డ నుంచి త‌ప్పించుకునేందుకు ప్ర‌య‌త్నించ‌గా.. కార్య‌క‌ర్త‌లు అడ్డుకున్నారు. ఇదిలావుంటే.. మ‌రోవైపు సిరిపూర్ కాగ‌జ్ న‌గ‌ర్‌లోనూ ఏపీకి చెందిన ప్ర‌సాద‌రావు అనే ఐజీ ర్యాంకు పోలీసు అధికారిపై కేసు న‌మోదైంది.

సిరిపూర్ కాగ‌జ్ న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి మాజీ ఐపీఎస్ ప్ర‌వీణ్‌కుమార్ బీఎస్పీ త‌ర‌ఫున బ‌రిలో ఉన్నారు. ఆయ‌న‌కు ప్ర‌సాద‌రావు మిత్రుడు కావ‌డంతో అక్క‌డ గ్రామాల్లో డ‌బ్బులు పంపిణీ చేసేందుకు ఈయ‌న సోమ‌వారం సాయంత్రం వెళ్ల‌గా.. కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు.. గుర్తించి పోలీసుల‌కు , ఎన్నిక‌ల అధికారుల‌కు స‌మాచారం అందించారు. దీంతో వారు వ‌చ్చి.. ప్ర‌సాదరావును అదుపులోకి తీసుకుని కేసు న‌మోదు చేశారు.

Tags:    

Similar News