మంకీపాక్స్ ఎఫెక్ట్‌: 70 దేశాల్లో హెల్త్ ఎమ‌ర్జెన్సీ... ఇండియా అప్ర‌మ‌త్తం!

అంతేకాదు.. ప్ర‌భుత్వం అత్య‌ధికంగా ఆరోగ్యంపై ఖ‌ర్చు చేయాల్సి ఉంటుంది.

Update: 2024-08-16 05:20 GMT

ఒక‌టి కాదు.. రెండు కాదు.. ఏకంగా 70 దేశాల్లో హెల్త్ ఎమ‌ర్జెన్సీ ప్ర‌క‌టించారు. దీనికి కార‌ణం.. అత్యంత వేగంగా విస్త‌రిస్తున్న మంకీ పాక్స్‌(కోతి వ్యాధి). మంకీ పాక్స్ కార‌ణంగా.. ఈ ఏడాది ఇప్ప‌టి వ‌ర‌కు 530 మంది చ‌నిపోయార‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఈ నేప‌థ్యంలో ఆయా దేశాలు స‌హా.. ప‌లు ప్ర‌పంచ దేశాల‌ను కూడా హెచ్చ‌రించింది. ఇక‌, ఆఫ్రికా ఖండంలోని అన్నిదేశాల్లోనూ హెల్త్ ఎమ‌ర్జెన్సీని అమలు చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించింది. దీంతో ఆయా దేశాల ప్ర‌జ‌లు విదేశాల్లో పర్య‌టించేందుకు అనుమ‌తించ‌రు. అంతేకాదు.. ప్ర‌భుత్వం అత్య‌ధికంగా ఆరోగ్యంపై ఖ‌ర్చు చేయాల్సి ఉంటుంది.

అస‌లేంటీ వ్యాధి?

క‌రోనా కంటే వేగంగా విస్త‌రిస్తున్న‌ట్టు అంత‌ర్జాతీయ వైద్యులు చెబుతున్న మంకీపాక్స్ ప్రాణాంత‌క వ్యాధిగా గుర్తించారు. ఈ వ్యాధి సోకి.. ఇప్పటికే వందల మంది చనిపోయారని.. కాబట్టి అన్ని దేశాలు ఈ విషయమై అప్రమత్తంగా ఉండాలని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ‌ హెచ్చరించింది. ఆఫ్రికా ఖండంలోని ప్ర‌తి దేశంలోనూ ఈ పాక్స్ విస్త‌రిస్తున్న‌ట్టు తెలిపింది. ఇది ఆసియా ఖండంలోకీ విస్త‌రించే ప్ర‌మాదం ఉంద‌ని హెచ్చ‌రించ డంతో భార‌త్ అప్ర‌మ‌త్త‌మైంది. భార‌త్‌కు వ‌చ్చే విమానాల్లో ఆఫ్రిక‌న్‌లు వ‌స్తే.. వారి ఆరోగ్య రిపోర్టులు ప‌రిశీలించాల‌ని కేంద్రం ఆదేశించింది.

ఎలా వ్యాపిస్తుంది?

మంకీపాక్స్ అనేది వైరల్ ఇన్ఫెక్షన్. ఇది జంతువులను, మానవులను ప్రభావితం చేస్తుంది. ఆర్తోపాక్స్ వైరస్ జాతికి చెందినదిగా అంత‌ర్జాతీయ వైద్య బృందం గుర్తించింది. ఈ వైరస్ సోకినవారి చర్మంపై గడ్డలు, పొక్కులు ఏర్పడి అవి దురదను కలిగిస్తాయి. ఈ గడ్డలు రసి, చీముతో నిండి ఉంటాయి. దీనిని మొదటిసారిగా 1958లో కోతులలో గుర్తించారు. అందుకే దీనికి మంకీపాక్స్ అనే పేరు పెట్టారు. ఇది జ్వ‌రానికి కూడా దారి తీస్తుంది. నెమ్మ‌దిగా వ్య‌క్తి క్షీణించి, రోగ‌నిరోధ‌క శ‌క్తి త‌గ్గిపోయి.. ప్రాణాలు కోల్పోతున్నారు. పాక్స్ సోకిన వ్యక్తి వినియోగించిన పరుపు, దుస్తులు, ఇతర వస్తువుల ద్వారా ఇది వ్యాపిస్తున్న‌ట్టు గుర్తించారు.

ఇవీ ల‌క్ష‌ణాలు..

+ మంకీ పాక్స్ సోకిన వ్య‌క్తికి తలనొప్పి, జ్వరం, బాడీ పెయిన్స్ ఉంటాయి.

+ ముఖం, చేతులు, పాదాలు, శరీరంలోని ఇతర భాగాలపై దద్దుర్లు, గడ్డలు వస్తాయి.

+ చీముతో కూడిన‌ మొటిమలు ఏర్పడతాయి.

+ త‌ర‌చుగా జ్వ‌రం వ‌స్తుంది.

+ మంకీపాక్స్‌కు ప్ర‌త్యేకంగా మందులు లేవు.

Tags:    

Similar News