ముద్రగడ లేఖలు ఎక్కడికి పోతున్నాయి ?

ఆయన దివంగత ఎన్టీఆర్ మంత్రివర్గంలో కీలక శాఖలు చూసారు. ఆ తరువాత ఆ పార్టీ నుంచి తానే బయటకు వచ్చారు.

Update: 2024-11-22 21:30 GMT

మాజీ మంత్రి సీనియర్ మోస్ట్ పొలిటికల్ లీడర్, గోదావరి జిల్లాలలో బలమైన సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ పెద్దన్నగా ఉండే ముద్రగడ పద్మనాభం తో పెట్టుకుంటే రగడ తప్పదు అన్నట్లుగా ఒకనాడు పరిస్థితి ఉండేది. ఆయన దివంగత ఎన్టీఆర్ మంత్రివర్గంలో కీలక శాఖలు చూసారు. ఆ తరువాత ఆ పార్టీ నుంచి తానే బయటకు వచ్చారు.

ఇక 1993 ప్రాంతంలో అప్పటి ఉమ్మడి ఏపీ సీఎం గా ఉన్న పెద్దాయన కోట్ల విజయభాస్కరరెడ్డి ప్రభుత్వాన్ని సైతం కాపు ఉద్యమంతో గడగడలాడింది. జీవో 30ని తెచ్చుకుని కాపులకు విజయం చేకూర్చారు. ఇక ఆ తరువాత బీజేపీ టీడీపీ కాంగ్రెస్ ఇలా రాజకీయ పయనం సాగించిన ముద్రగడ 2024 నాటికి వైసీపీలో చేరారు.

ఆయన వైసీపీ కంటే ముందు జనసేనలో చేరాల్సింది. అయితే ఆయన రాజకీయంగా అక్కడే రాంగ్ స్టెప్ వేశారు అని అంటున్నారు. దాంతో ఆయన వైసీపీలో చేరి ఇపుడు ఏమీ కాకుండా అయ్యారా అన్న చర్చ నడుస్తోంది. మరో విషయం ఏమిటి అంటే ముద్రగడ వైసీపీలో చేరినా గోదావారి జిల్లాలలో వైసీపీకి ఒక్క సీటు కూడా దక్కలేదు.

దాంతో ముద్రగడ ఒకనాటి ఇమేజ్ మీద కూడా సందేహాలు కలుగుతున్నాయని అంటున్నారు. ఆయన దానికి తోడు పవన్ గెలిస్తే ముద్రగడ పద్మనాభరెడ్డిగా తన పేరు మార్చుకుంటాను అని సవాల్ చేసి ఆ మీదట తన పేరుని కూడా మార్చేసుకున్నారు. దాంతో బలమైన సామాజిక వర్గంలోనూ ఆయన వైఖరి పట్ల అసంతృప్తి చెలరేగింది అని అంటున్నారు.

పెద్దాయన I’m మీద పెదవి విరిచే వారు ఆ సామాజిక వర్గంలో ఎక్కువ అయ్యారు అని అంటున్నారు. ఈ రోజున గోదావరి జిల్లాలతో పాటు ఏపీలో బలమైన సామాజిక వర్గం పవన్ లోనే తమ ఆశలను చూసుకుంటోంది. వెనకటి తరం నాయకులు అయితే పూర్తిగా వెనకబడిపోయారు. 2014 నుంచి 2019 దాకా చంద్రబాబు ప్రభుత్వాన్ని తన లేఖలతో పాటు తన ఉద్యమాలతో ఒక లెక్కన ఇబ్బంది పెట్టిన ముద్రగడ ఇపుడు ఏమీ కాకుండా అవుతున్నారా అన్న చర్చకు తెర లేస్తోంది.

టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక అయిదు నెలల పాటు మౌనం వహించిన ముద్రగడ ఇటీవల ఒక పవర్ ఫుల్ లేఖాస్త్రాన్నే సంధించారు. నిజానికి రామబాణం మాదిరిగా ముద్రగడ లేఖాస్త్రాలు కూడా గురి తప్పవు. అవి ఏపీ వ్యాప్తంగా చర్చకు నోచుకుంటాయి. అంతే కాదు ప్రభుత్వంలోనూ కలవరం కలిగిస్తాయి.

చంద్రబాబు సూపర్ సిక్స్ హామీలను నెరవేర్చలేదని చెబుతూనే ముద్రగడ ఆ లేఖలో బాబు వైఖరి మీద అనేక ఆరోపణలు చేశారు. ప్రత్యేక హోదా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, పోలవరం ప్రాజెక్ట్ వంటి అంశాలు ఆయన ప్రస్తావించారు.

ఇలా ఘాటైన లేఖ రాసినా కూడా అది ఏ విధంగానూ చర్చకు రాకుండా పోయింది అంటే ముద్రగడ లేఖల పవర్ ఏమైపోయింది అన్న చర్చ అయితే సాగుతోంది. గతంలో ముద్రగడ లేఖ ప్రభుత్వానికి రాసారు అంటే అవతల వైపు నుంచి కౌంటర్లు వచ్చేవి. లేదా ప్రభుత్వం నుంచి తమ వివరణ కూడా ఉండేది

కానీ ముఖ్యమంత్రిని ఉద్దేశిస్తూ నేరుగా ముద్రగడ లేఖ రాసినా కూడా దానికి తగిన స్పందన రాలేదా అన్న చర్చ సాగుతోంది. ముద్రగడను లైట్ తీసుకుంటున్నారా అన్న డౌట్లు కూడా వస్తున్నారు. ఏడు పదులకు చేరువలో ఉన్న ముద్రగడ తన లేఖలకు ఎంత పదును పెట్టినా రిజల్ట్ ఇలాగే ఉంటే మాత్రం ఆయన పొలిటికల్ గా సైలెంట్ అవడమే మంచిదేమో అన్న చర్చ కూడా వస్తోంది.

ఏది ఏమైనా ముద్రగడ పద్మనాభం అలియాస్ పద్మనాభరెడ్డి లేఖల పవర్ అయితే బాగా తగ్గిందని అంటున్న నేపధ్యం ఉంది. అయితే కాలం ఎపుడూ ఒకేలా ఉండదు కాబట్టి ఉందిలే మంచి కాలం అనుకుని కరెక్ట్ టైం లో లెటర్లకు పని చెబితే మంచిదేమో అంటున్నారు. అంతవరకూ గమ్మున ఉండడమే మేలు అని అంటున్న వారూ ఉన్నారు.

Tags:    

Similar News