వైసీపీలో చేరిన ముద్రగడ... జగన్ ఆప్యాయ ఆలింగనం!
ఈ సమయంలో పద్మనాభంతో పాటు ఆయన కుమారుడు ముద్రగడ గిరి కూడా వైసీపీలో చేరారు.
ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీరాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా మాజీమంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వైసీపీలో జాయిన్ అయ్యారు. శుక్రవారం ఉదయం తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో సీఎం వైఎస్ జగన్ సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సమయంలో పద్మనాభంతో పాటు ఆయన కుమారుడు ముద్రగడ గిరి కూడా వైసీపీలో చేరారు.
అవును... ఒకపక్క రానున్న ఎన్నికల్లో కాపుల ఓట్లు అత్యంత కీలకం అని చెబుతున్న సమయంలో, మరోపక్క కాపులకు వ్యూహాత్మకంగా అన్యాయం జరుగుతుందనే చర్చ జరుగుతున్న తరుణంలో... కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా స్పందించిన ఆయన... వైసీపీలో చేరడం తనకు చాలా సంతోషంగా ఉందని, వచ్చే ఎన్నికల్లో జగన్ గెలుపుకోసం కృషి చేస్తానని తెలిపారు. దీంతో... ఏపీ రాజకీయాల్లో ఇదొక కీలక పరిణామం అని అంటున్నారు పరిశీలకులు.
వచ్చే ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీచేస్తానని పవన్ ప్రకటించిన నేపథ్యంలో... వైసీపీలో ముద్రగడ చేరిక మరింత ఆసక్తికరంగా మారింది. వాస్తవానికి గత కొంతకాలంగా ఆయన ఏ పార్టీలో చేరతారనే విషయంపై తీవ్ర చర్చ జరుగుతుంది. ఒకానొక సయమంలో జనసేనలో చేరతారని.. పవన్ కల్యాణ్ స్వయంగా ఆయన ఇంటికొచ్చి మరీ పార్టీలోకి ఆహ్వానిస్తారనే కథనాలు వచ్చాయి.
అయితే... పొత్తులో భాగంగా జనసేనకు తొలుత 24 సీట్లు కేటాయించబడిన అనంతరం ముద్రగడ హర్ట్ అయినట్లు చెబుతారు. ఈ సమయంలో.. ఆ 24 మందిని గెలిపించుకోవడానికి మీకు నా అవసరం రాకూడదని కోరుకుంటున్నా అన్నట్లుగా పవన్ కు ఒక బహిరంగ లేఖ రాశారు ముద్రగడ. దీంతో... నాటి నుంచీ ఆయన వైసీపీలో చేరతారనే ప్రచారం బలంగా జరిగింది.
ఈ క్రమంలోనే తాజాగా ఆయన జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. ఇక.. ముద్రగడ వైసీపీలో చేరిన కార్యక్రమంలో ఆ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డితో పాటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు కురసాల కన్నబాబు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ విషయాలను వైసీపీ తన అధికారిక ఎక్స్ లో వెల్లడించింది.