పవన్‌ కళ్యాణ్‌ ను పద్మనాభరెడ్డి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడా?

ఈ నేపథ్యంలో తాజాగా డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ పై ముద్రగడ పద్మనాభరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-06-21 08:09 GMT

ఆంధ్రప్రదేశ్‌ లో జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ పై తీవ్ర విమర్శలు చేసినవారిలో వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం ఒకరు. పిఠాపురంలో పవన్‌ కళ్యాణ్‌ ను ఓడించి తరిమేయకపోతే తన పేరును ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని సవాల్‌ విసిరారు. అయితే ఎన్నికల్లో పవన్‌ కళ్యాణ్‌ భారీ మెజార్టీతో ఘనవిజయం సాధించడంతో ముద్రగడ మాట మీద నిలబడ్డారు. తన పేరును ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకున్నారు. ఈ మేరకు ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ కూడా జారీ చేసింది.

ఈ నేపథ్యంలో తాజాగా డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ పై ముద్రగడ పద్మనాభరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను అసమర్థుడినని అందుకే కాపులకు రిజర్వేషన్‌ తేలేకపోయానని తెలిపారు. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాపు ఉద్యమం నడిపి జగన్‌ హయాంలో ఉద్యమం ఎందుకు నడపలేదని అందరూ తనను తిడుతున్నారని పద్మనాభరెడ్డి వెల్లడించారు.

దయచేసి తనను, తన కుటుంబాన్ని బూతులు తిట్టించవద్దని పవన్‌ కళ్యాణ్‌ ను కోరారు. తన కుటుంబంలో తాను, తన భార్య, తన ఇద్దరు కొడుకులు, ఒక కోడలు, మనుమరాలు, మనుమడు ఇలా మొత్తం ఏడుగురుం ఉన్నామని.. మనుషులను పంపించి చంపించి వేయాలని పద్మనాభరెడ్డి పవన్‌ కు సూచించారు. తమకు ఎవరూ లేరని.. తాము అనాథలమన్నారు. పవన్‌ కళ్యాణ్‌ అభిమానులు, ఆయనను అభిమానించే యువత తనను బూతులు తిడుతూ మెసేజులు పంపుతున్నారని చెప్పారు.

తనను బూతులు తిట్టించడం ఆపి పవన్‌ కళ్యాణ్‌ కాపులకు రిజర్వేషన్‌ తీసుకురావాలని సూచించారు. రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ పవన్‌ కళ్యాణ్‌ చెబితే వినే ప్రభుత్వాలే ఉన్నాయని ముద్రగడ పద్మనాభరెడ్డి గుర్తు చేశారు.

పవన్‌ కళ్యాణ్‌ చేతిలో కీలుబొమ్మ ప్రభుత్వమే కేంద్రంలో ఉందన్నారు. ఈ నేపథ్యంలో కాపులకు రిజర్వేషన్‌ తోపాటు రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావాలని సూచించారు. అలాగే విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ ఆపించాలని పద్మనాభరెడ్డి పవన్‌ కు విజ్ఞప్తి చేశారు. తాను అసమర్థుడినని.. కాపులకు రిజర్వేషన్‌ తేలేకపోయానని.. పవన్‌ కాపులకు రిజర్వేషన్‌ తేవాలని కోరారు.

మొత్తానికి పవన్‌ పై తన పోరాట పంథాను ఆపేది లేదని ముద్రగడ తేల్చిచెప్పినట్టయింది. పవన్‌ ను ఇరుకునపెట్టడమే లక్ష్యంగా ఆయన కాపుల రిజర్వేషన్‌ అంశాన్ని బయటకు తీశారని అంటున్నారు. రాష్ట్రంలో, కేంద్రంలో రెండు ప్రభుత్వాలు పవన్‌ కళ్యాణ్‌ మాట వింటాయి కాబట్టి.. రిజర్వేషన్‌ సాధించాలని పెద్ద టాస్కే విధించారు.

Tags:    

Similar News