సక్సెస్ ఎవరికీ ఊరికేరాదు... ఇన్ఫోసిస్‌ మూర్తి లైఫ్ లో బ్యాడ్ ఎక్స్పీ ఇదే!

ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకులు నారాయణమూర్తి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.

Update: 2024-01-08 10:30 GMT

ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకులు నారాయణమూర్తి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. నేడు ఇండియాలోని ఐటీ దిగ్గజాల్లో ఒకటైన ఇన్ఫోసిస్‌ సంస్థ నిలదొక్కుకోవడం కోసం ఆయన పడిన కష్టం, చేసిన శ్రమ గురించి చాలా మంది కథలు కథలుగా చెబుతుంటారు. ఆయన విజనరీ అని అభినందిస్తుంటారు. ఈ సమయంలో ఇటీవల విడుదలైన "అన్‌ కామన్‌ లవ్‌: ది ఎర్లీ లైఫ్‌ ఆఫ్‌ సుధా అండ్‌ నారాయణమూర్తి" పుస్తకంలో ఆసక్తి విషయాలు వెలుగులోకి వచ్చాయి!

అవును... జీవితంలో నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకునేందుకు, అనుకున్న గమ్యస్థానాలను అందుకునేందుకు ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకులు నారాయణమూర్తి.. తన కెరీర్‌ ప్రారంభంలో ఎదుర్కొన్న ఇబ్బందికర పరిస్థితులు, అవమానాలు, కష్టాల గురించి గతేడాది డిసెంబరులో విడుదలైన "అన్‌ కామన్‌ లవ్‌: ది ఎర్లీ లైఫ్‌ ఆఫ్‌ సుధా అండ్‌ నారాయణమూర్తి" పుస్తకంలో వెల్లడించారు. భారత-అమెరికన్‌ రచయిత్రి చిత్రా బెనర్జీ దివకరుణి రచించిన ఈ పుస్తకంలో అమెరికాలో మూర్తి పడిన కష్టాలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి.

వివరాళ్లోకి వెళ్తే... ఇన్ఫోసిస్‌ స్థాపించిన తొలినాళ్లలో అమెరికాలోని డేటా బేసిక్స్‌ కార్పొరేషన్‌ అనే సంస్థ క్లయింట్‌ గా ఉండేది. ఆ సమయంలో డేటా బేసిక్స్‌ కార్పొరేషన్‌ కంపెనీని డానీ లిల్స్‌ అనే వ్యాపారవేత్త నిర్వహించేవాడు. ఈ సమయంలో సమయానికి చెల్లింపులు చేయకుండా నారాయణ మూర్తి బృందాన్ని ఇబ్బందులకు గురి చేసేవాడని, మాన్‌ హాట్టన్‌ లోని డేటా బేసిక్స్‌ కార్యాలయానికి వచ్చినప్పుడు వారికి కనీసం సరైన వసతి సౌకర్యాలు కూడా కల్పించేవాడు కాదని పుస్తకంలో వెల్లడించారు.

ఇందులో భాగంగా చెల్లింపులు సమయానికి ఇవ్వకపోవడం ఒకటి.. పైగా ఆఫీసుకి వెళ్లినప్పుడు చేసిన అవమానాలు మరొకెత్తు అని పుస్తకంలో వెల్లడించారు. ఈ క్రమంలో... డేటా బేసిక్స్‌ కు సర్వీస్‌ అందించేందుకు ఒకసారి నారాయణమూర్తి అమెరికా వచ్చారు.. ఆ సమయంలో డానీ కిటికీలు లేని చిన్న గది (చిన్న సైజు స్టోర్ రూం) ని ఆయన ఉండటానికి ఇచ్చారని, అందులోని బల్లపై మూర్తి పడుకునేవారని.. తన ఇంట్లో నాలుగు విశాలవంతమైన బెడ్ రూం లు ఉన్నప్పటికీ.. మూర్తిని ఆ గదిలో ఉంచారని పుస్తకంలో పేర్కొన్నారు.

తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ విషయం నారాయణమూర్తి పడిన అవమానాలను కళ్లకు కట్టినట్లు చూపించడంతోపాటు.. ఎన్ని ఎక్కువ కష్టాలు, మరెన్ని ఎక్కువ అవమానాలు ఎదురైతే అంత గొప్ప విజయం దక్కుతుందనే విషయాన్ని నేటి యువతరానికి చెప్పకనే చెప్పినట్లయ్యిందని అంటున్నారు పరిశీలకులు. సక్సెస్ ఎవరికీ ఊరికే రాదు కదా!

Tags:    

Similar News