ఆలయం కోసం ల్యాండ్ ఇచ్చిన ముస్లింలు

రాజకీయ నేతలు.. మరికొందరు మతం పేరుతో మనుషుల మధ్య దూరాన్ని పెంచేస్తుంటారు.

Update: 2024-05-28 04:50 GMT

రాజకీయ నేతలు.. మరికొందరు మతం పేరుతో మనుషుల మధ్య దూరాన్ని పెంచేస్తుంటారు. అందుకు భిన్నంగా మత సామరస్యంతో ఇచ్చి పుచ్చుకునే దోరణితో అన్నదమ్ముల మాదిరి కలిసి జీవిస్తుంటారు. రాజకీయాలు ఎంతగా దిగజారినా మనుషుల్లోని మానత్వం మాత్రం ఇంకా ఇంకిపోలేదన్న విషయం తరచూ వెలుగు చూసే అంశాల్ని చూస్తే అర్థమవుతుంది.

తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి చోటు చేసుకుంది. హిందూ ముస్లిం మతసామరస్యానికి నిదర్శనంగా.. మేరా భారత్ మహాన్ అనేలా చోటు చేసుకున్న ఈ ఉదంతం తమిళనాడులో చోటు చేసుకుంది. ఆలయం ఏర్పాటుకు అవసరమైన భూమిని ఇచ్చేందుకు ముస్లింలు ముందుకు రావటం ఒక ఎత్తు అయితే.. దాన్ని దానంగా ఇవ్వటం ద్వారా మతసామరస్యాన్ని చాటటం ఈ మొత్తం ఘటనకు హైలెట్ గా చెప్పక తప్పదు. అసలేం జరిగిందంటే..

తమిళనాడులోని తిరుప్పూరు జిల్లా ఓట్టపాళెయం రోస్ గార్డెన్ ప్రాంతంలో హిందూ.. ముస్లిం వర్గాలకు చెందిన 300 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. అక్కడ మసీదు ఉన్నప్పటికి హిందువులకు గుడి లేదు. గుడి కట్టేందుకు అవసరమైన స్థలం లేకపోవటంతో హిందువులు ఏమీ చేయలేని పరిస్థితి. ఇదిలా ఉంటే.. ఆలయాన్ని నిర్మించాలని భావిస్తున్న హిందువుల ఆలోచనకు స్పందించిన స్థానిక ముస్లింలు తమ మసీదుకు చెందిన 3 సెంట్ల భూమిని ఆలయ నిర్మాణానికి దానంగా ఇచ్చారు.

దీంతో గుడి నిర్మాణం మొదలై.. తాజాగా పూర్తైంది. గుడి కుంభాభిషేకం జరిగింది. ఈ సందర్భంగా సారెతో వచ్చిన ముస్లింలకు హిందువులు స్వాగతం పలకటంతో పాటు.. తాము గుడిని ఏర్పాటు చేయటానికి సాయం చేసిన ముస్లిం సోదరులకు థ్యాంక్స్ చెబుతూ.. వారిని అభినందించారు. ఈ వైనం కాస్త ఆలస్యంగా వెలుగు చూసింది.

Tags:    

Similar News