దక్కని సీటు.. నాగబాబు సంచలన వ్యాఖ్యలు!

దీంతో జనసేన పార్టీ 21 అసెంబ్లీ, 2 పార్లమెంటు సీట్లలో పోటీకే పరిమితమైంది.

Update: 2024-03-15 06:05 GMT

ఆంధ్రప్రదేశ్‌ లో వచ్చే ఎన్నికలకు టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా జనసేన మొదట 24 అసెంబ్లీ, 3 పార్లమెంటు సీట్లలో పోటీ చేస్తుందని ఆ పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ ప్రకటించారు. అయితే చివరి క్షణంలో బీజేపీ కూడా కూటమిలో చేరడంతో జనసేన పార్టీ తన సీట్లను తగ్గించుకోవాల్సి వచ్చింది. అసెంబ్లీ సీట్లలో మూడు, పార్లమెంటు సీట్లలో ఒకదాన్ని కుదించుకుంది. దీంతో జనసేన పార్టీ 21 అసెంబ్లీ, 2 పార్లమెంటు సీట్లలో పోటీకే పరిమితమైంది.

ఈ క్రమంలో పవన్‌ కళ్యాణ్‌ సోదరుడు, జనసేన ముఖ్య నేత నాగబాబుకు సీటు దక్కలేదు. స్వయంగా ఈ విషయాన్ని పవన్‌ కళ్యాణే తాజాగా ప్రకటించారు. పొత్తులో భాగంగా పార్టీలో త్యాగాలు చేయాల్సి వచ్చిందని తెలిపారు. తన సొంత అన్న నాగబాబు కూడా తన స్థానాన్ని వదులుకున్నారని చెప్పారు. మొదట టికెట్‌ ఇస్తానని తన సోదరుడికి చెప్పానన్నారు. అయితే ఇప్పుడు ఇవ్వలేకపోయానని తెలిపారు.

నాగబాబు తాను ఎక్కడ ప్రచారం చేయాలంటే అక్కడ చేస్తానని లేఖ రాశారన్నారు. పొత్తులో భాగంగా కొన్ని సీట్లు త్యాగం చేశామని.. దీనివల్ల కొందరు నాయకులకు ఇబ్బందులు ఎదురయ్యాయని వెల్లడించారు.

ఈ నేపథ్యంలో నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఒక వీడియోలో మాట్లాడిన ఆయన హాట్‌ కామెంట్స్‌ చేశారు. తన దృష్టిలో జన సైనికుడిగా పనిచేయడం కంటే గొప్ప పదవి ఏదీ లేదన్నారు. ప్రజల సమస్యలే తన సమస్యలుగా పవన్‌ పోరాడుతున్నారని తెలిపారు. ప్రజల కోసం తన సమయాన్ని, కుటుంబాన్ని, వ్యక్తిగత ఆదాయాన్ని, ఆస్తులను పవన్‌ త్యాగం చేస్తున్నారని గుర్తు చేశారు. అలాంటి నాయకుడి మాటను శిరసా వహిస్తానన్నారు.

సీటు రాకపోయినా తనలాంటివారు, పోతిన మహేశ్‌ లాంటి జనసేన పార్టీలో ఎంతోమంది ఉన్నారని నాగబాబు గుర్తు చేశారు. కొన్ని లక్షల మంది ఏమీ ఆశించకుండా పవన్‌ కళ్యాణ్‌ ఆశయాల కోసం, ఆయన ఆశయ సాధన కోసం వెంట నడుస్తున్నారని తెలిపారు.

పవన్‌ కళ్యాణ్‌ తనకు పదవి ఇచ్చినా, ఇవ్వకపోయినా జనసేన పార్టీ కోసం కృషి చేస్తానని నాగబాబు తెలిపారు. జనసైనికుడిగానే పనిచేస్తానని తెలిపారు. జనసేన పార్టీ కోసం, నాయకుడి ఆశయాల కోసం ఆయన వెన్నంటి నడుస్తామని స్పష్టం చేశారు.

కాగా నాగబాబు అనకాపల్లి లోక్‌ సభ స్థానం నుంచి పోటీ చేస్తారని మొదట వార్తలు వచ్చాయి. ఇందుకు తగ్గట్టే ఆయన నియోజకవర్గంలో ఇల్లు కూడా తీసుకున్నారు. అయితే బీజేపీ కూడా టీడీపీ, జనసేన కూటమిలో చేరడంతో అనకాపల్లి సీటు బీజేపీకి పోయింది. దీంతో నాగబాబుకు సీటు లేకుండా పోయింది.

Tags:    

Similar News