నల్లారి కిరణ్ నల్లపూసగా మారిపోయారా ?
టీడీపీ కూటమి ప్రభంజనం ఏపీలో బలంగా వీచినా నల్లారి కిరణం మాత్రం మెరవలేదు.
ఉమ్మడి ఏపీ చివరి సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరిన తరువాత కొన్నాళ్ళు సైలెంట్ అయ్యారు. అయినా సరే మాజీ సీఎం హోదాలో ఆయనను గుర్తించి రాజంపేట లోక్ సభ నుంచి టికెట్ ఇచ్చి పోటీ చేయించారు. టీడీపీ కూటమి ప్రభంజనం ఏపీలో బలంగా వీచినా నల్లారి కిరణం మాత్రం మెరవలేదు. ఆయన ఓటమి పాలు అయ్యారు.
నిజంగా కనుక ఆయన గెలిచి ఉంటే కేంద్ర మంత్రిగా కేబినెట్ ర్యాంక్ హోదాలో ఉండేవారు. బ్యాడ్ లక్ అంటే అదే అని అంటున్నారు. 2014 తరువాత పదేళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న కిరణ్ జాతకం 2024లో అయినా మారుతుందని అనుకుంటే ఈసారి అలాగే జరిగింది.
ఇక ఓటమి తరువాత కిరణ్ కుమార్ రెడ్డి సైతం డీలా పడినట్లుగా ఉన్నారు. అందరూ గెలిచి తాను ఓటమి పాలు కావడం ఆయన బహుశా జీర్ణించుకోలేకపోయి ఉండాలి. అందుకే ఆయన చాలా కాలం పాటు సైలెంట్ అయ్యారు. అయితే ఇపుడు ఆయన మళ్లీ జనంలోకి వస్తేనే గుర్తింపు ఉంటుందని అంటున్నారు.
కేంద్రంలో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉంది. ఆయన సీనియర్ మోస్ట్ నేతగా ఉన్నారు. దాంతో కిరణ్ కుమార్ రెడ్డి ఏపీలో బీజేపీ బలోపేతానికి కృషి చేయడానికి ఇదే తగిన సమయం అని అంటున్నారు. అంతే కాదు రాయలసీమలో ఆయనకు ఉన్న పట్టుని నిలుపుకోవడానికి కూడా ప్రయత్నించాలి కదా అని అంటున్నారు.
రాజంపేట నుంచి పోటీ చేశారు, ఓటమి పాలు అయిన తరువాత అయినా ఆ నియోజకవర్గానికి వచ్చి కేడర్ కి తాను ఉన్నాను అని భరోసా ఇస్తేనే కదా తరువాత ఎన్నికల్లో అయినా గెలుపు పిలుపు వినిపిస్తుంది అని అంటున్నారు. ఇక ఆయన గెలుపు కోసమెంతో కృషి చేసిన వారికి కూడా భరోసా ఇవ్వాలి కదా అని కూడా అంటున్నారు.
బీజేపీలో చూస్తే కష్టపడి పనిచేసిన వారికే పదవులు ఇస్తారు. కిరణ్ కి టికెట్ ఇచ్చారూ అంటే అది ఆయన సీనియారిటీని గుర్తించే. అయితే ఆయన హైదరాబాద్ లోనే ఉంటూ ఎన్నికలప్పుడే రాజకీయం అనుకుంటే ఇబ్బంది అవుతుందని అంటున్నారు.
మరో వైపు నల్లారి చురుకుగా ఉండాలని ఆయన అనుచరులు భావిస్తున్నారు. తన నాయకుడు ఎంత డైనమిక్ గా ఉంటే తమకు అంతలా గుర్తింపు వస్తుందని అంటున్నారు. రాజకీయాలు చేయాల్సిన క్షేత్రం ఏపీ అయితే హైదరాబాద్ లో ఉంటే లాభం ఏంటి అని కూడా అంటున్నారు. అదే విధంగా ఉంటే బీజేపీ సైతం పెద్దగా పట్టించుకోదని అంటున్నారు.
బీజేపీ లెక్కలు వేరే ఉంటాయని పనిచేసిన వారికి విధేయతకు పెద్ద పీట వేస్తారు అని అంటున్నారు. మొత్తం మీద చూస్తే నల్లారి హైదరాబాద్ విడిచిపెట్టి రావాలని అనుచరులు బలంగా కోరుకుంటున్నారు. ఒకవేళ ఆయన రాజకీయాలు వద్దు అనుకుంటే మాత్రం చేసేది లేదని అంటున్నారు. గవర్నర్ పదవులు వంటివి దక్కుతాయి అన్నది ప్రచారం తప్ప నిజం కాదని కూడా అంటున్నారు.