అమెరికా అధ్యక్షుడికి ఇంతకంటే షాకింగ్ అనుభవం ఏముంటుంది?
వరుస ఎదురుదెబ్బలతో ఉక్కిరిబిక్కిరి అవుతూ.. తాజాగా కరోనా బారిన పడిన ఆయనకు మరో ఊహించని షాక్ ఎదురైంది
వరుస ఎదురుదెబ్బలతో ఉక్కిరిబిక్కిరి అవుతూ.. తాజాగా కరోనా బారిన పడిన ఆయనకు మరో ఊహించని షాక్ ఎదురైంది. ఒక విధంగా చెప్పాలంటే అమెరికా అధ్యక్ష పదవి రేసులో ఉండి ఇలాంటి చేదు అనుభవం ఆయన కలలో కూడా ఊహించి ఉండరు. ఎన్నికల్లో పోటీకి సరిపడా సామర్థ్యం లేనప్పుడు గౌరవంగా తప్పుకోకుండా.. మొండిగా ముందుకు వెళుతున్న ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. సొంత పార్టీకి చెందిన స్టీల్ ఉమెన్ గా.. విషయం ఏదైనా సూటిగా చెప్పేసే అలవాటున్న పార్టీ సీనియర్ నేత, మాజీ హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసీ అధ్యక్షుడు బైడెన్ కు నేరుగా ఫోన్ చేశారు.
తాజా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ను ఓడించలేవని ఎన్నికల అంచనాలు వెల్లడిస్తున్నాయని.. అందుకే.. పోటీ నుంచి తప్పుకోవాలని స్పష్టం చేసినట్లుగా అమెరికన్ పత్రికలు సంచలన వార్తలు పబ్లిష్ చేశాయి. 81 ఏళ్ల బైడెన్ కానీ డెమొక్రాట్ల తరపు అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తే డెమొక్రాట్ల గెలుపు అవకాశాలు తీవ్రంగా దెబ్బ తింటాయన్న ఆందోళన వ్యక్తం చేసినట్లుగా చెబుతున్నారు. అయితే.. బైడెన్ మాత్రం తాను చూసిన పోలింగ్ అంచనాలన్నీ కూడా తాను గెలిచేందుకే అనుకూలంగా ఉన్నట్లుగా పేర్కొన్నారు.
బైడెన్ అభ్యర్థిత్వానికి వ్యతిరేకంగా పెలోసీ బలంగా తన గళాన్ని వినిపిస్తున్నారు. గత వారంలో మాజీ అధ్యక్షుడు ఒబామాను కలిసిన ఆమె.. బైడెన్ అభ్యర్థిత్వంపై తనకున్న సంశయాలను ప్రస్తావించారు. మరికొందరు నేతల్ని కలిసి ప్రైవేటుగా తనకున్న అభిప్రాయాన్ని పంచుకున్నారు. మొత్తంగా బైడెన్ ను పోటీ నుంచి తప్పుకునేలా చేయటానికి ఆమె శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో అధ్యక్షుడైన బైడెన్ కే నేరుగా ఫోన్ చేసి పోటీ నుంచి తప్పుకోవాలన్న సూచనను చేయటం మాత్రం సంచలనంగా మారింది. ఇన్ని చేదు అనుభవాల వేళలోనూ బైడెన్ అధ్యక్ష్ రేసులో ఉంటారా? వెనక్కి తగ్గుతారా? అన్నది చూడాలి.