బాలయ్యా...ఇక ఎప్పటికీ ఇంతేనయ్యా...?

బాలయ్యకు మంత్రి పదవి ఇవ్వాలంటే సామాజిక వర్గ సమీకరణలు అడ్డు వస్తున్నాయని అంటున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో పరిటాల పయ్యావుల కుటుంబాలు రాజకీయంగా గట్టిగా ఉన్నాయి.

Update: 2024-06-14 02:45 GMT

నందమూరి తారక రాముని సినీ వారసుడు బాలకృష్ణ. ఆయన సినీ వారసత్వాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నారు. మరో రెండు నెలల్లో యాభై ఏళ్ల సినీ కెరీర్ ని బాలయ్య జరుపుకోబోతున్నారు. సినీ రంగంలో ఆయన సక్సెస్ లు చాలా ఉన్నాయి. ఆ రికార్డుల విషయం పక్కన పెడితే రాజకీయ రంగంలోనూ బాలయ్య విజయవంతంగానే కొనసాగుతున్నారు.

ఎంతో మంది సినీ నటులు రాజకీయల్లోకి వచ్చి ఒక్కసారే గెలిచారు. తరువాత ఎన్నికల్లో ఓటమి మూటగట్టుకున్నారు. కానీ బాలయ్య అలా కాదు ఓటమి ఎరుగని వీరుడుగా ఉన్నారు. హిందూపురం నుంచి ఆయన 2014 లో పోటీ చేసి గెలిచారు. 2019లో రెండోసారి జగన్ వేవ్ లో సైతం మెజారిటీని పెంచుకున్నారు. 2024లో హ్యాట్రిక్ ఎమ్మెల్యే అయ్యారు.

ఒక వైపు సినిమాలు బిజీగా చేస్తూ మరో వైపు తన సొంత నియోజకవర్గం అభివృద్ధికి బాలయ్య చేస్తున్న కృషి ప్రశంసనీయం అని అంటారు. ఇంతలా బాలయ్య రాజకీయాల్లో రాణిస్తున్నా కనీసం ఆయనకు మంత్రి పదవి అయినా ఎందుకు దక్కడం లేదు అని అభిమానులు మధన పడుతున్నారు.

మా బాలయ్యకు ఏమి తక్కువ అని వారు ప్రశ్నిస్తున్నారు. తాజాగా చంద్రబాబు కొత్త మంత్రివర్గం కొలువు తీరింది. అందులో ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచిన వారు మంత్రులు అయ్యారు. మరి బలమైన రాజకీయ వారసత్వంతో పాటు ప్రముఖ సినీ నటుడిగా ఉంటూ హ్యాట్రిక్ కొట్టి రాజకీయాల్లో విజయాలనే చవి చూస్తున్న బాలయ్యకు ఎందుకు మంత్రి పదవి దక్కలేదని ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

బాలయ్య మంత్రి కావడానికి అర్హుడు కారా అని వారు అంటున్నారు. నిజానికి ఇప్పటికి నాలుగు దశాబ్దాల క్రితం సీనియర్ ఎన్టీఆర్ బాలయ్యను చూసి అతడే నా రాజకీయ వారసుడు అని మదనపల్లి సభలో ప్రకటించేశారు. ఇది 1987లో జరిగిన ముచ్చట. ఆనాడు బాలయ్య హీరోగా ఉంటూనే టీడీపీ కోసం ప్రచారం చేస్తూ వచ్చారు. ఎన్టీఆర్ పాల్గొన్న సభలో బాలయ్య ప్రసంగించిన తీరుని చూసిన ముచ్చట పడిన అన్న గారు అన్న మాటలు ఇవి.

అంటే పెద్దాయనకు బాలయ్య రాజకీయంగా అందలాలు ఎక్కాలని కోరిక ఉందని అర్ధం అవుతోంది. అయితే బాలయ్య కాస్తా లేటుగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన 2014లో వచ్చిన సమయంలోనే మంత్రి అయి ఉండాల్సింది. కానీ ఆనాడు దక్కలేదు.

ఇక 2019లో చూస్తే టీడీపీ ఓటమి పాలు అయింది. 2024లో పార్టీ గెలిచింది బాలయ్యకు ఎదురులేదు అని అంతా అనుకున్నారు. కానీ ఆయన పేరు ఏ దశలోనూ పరిశీలనలో లేదు అని అంటున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి పయ్యావుల కేశవ్ తో పాటు బీసీ మహిళా నేత ఎస్ సవితకు చాన్స్ ఇచ్చారు. బీజేపీ నుంచి సత్యకుమార్ యాదవ్ కి మంత్రి పదవి దక్కింది.

బాలయ్యకు మంత్రి పదవి ఇవ్వాలంటే సామాజిక వర్గ సమీకరణలు అడ్డు వస్తున్నాయని అంటున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో పరిటాల పయ్యావుల కుటుంబాలు రాజకీయంగా గట్టిగా ఉన్నాయి. పయ్యావుల మూడు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న తొలిసారి మంత్రి అయ్యారు. ఆయనకు ఇవ్వడం సముచితం. దాంతో బాలయ్యకు దక్కలేదు అని అంటున్నారు.

మరి విస్తరణలో ఏమైనా మార్పు చేర్పులు ఉంటే బాలయ్యకు మంత్రి యోగం ఉంటుందా అంటే అది కూడా డౌటే అంటున్నారు. ఎందుకంటే ప్రభుత్వంలో ఇప్పటికే చంద్రబాబు నారా లోకేష్ ఉన్నారు. బాలయ్యని కూడా తెస్తే కుటుంబం మొత్తం ఉన్నారు అని అంటారు. దాంతో బాలయ్యా ఇక ఇంతేనయ్యా అని అనుకోవడం అభిమానుల వంతు అవుతోంది.

బాలయ్య తెలుగుదేశం పార్టీకి గత నాలుగు దశాబ్దాలుగా సేవ చేస్తున్నారు. 1984 నుంచి మొదలుపెట్టి లోక్ సభ అసెంబ్లీ స్థానిక సంస్థల ఎన్నికల దాకా ఆయన ఎన్నికల ప్రచారం చేస్తూ వస్తున్నారు. పార్టీ కోసం బాలయ్య బాగా కష్ట పడుతున్నారు అని అంటున్నారు. మరి బాలయ్యకు ఈ దఫా కనుక మంత్రి పదవి దక్కకపోతే వచ్చే ఎన్నికల నాటికి ఆయనకు 69 ఏళ్ళు వస్తాయి. మరి ఆయన పోటీ చేస్తారో కూడా తెలియదు. దాంతో జస్ట్ ఎమ్మెల్యేగానే అన్న గారి వారసుడు పొలిటికల్ గా మిగిలిపోతారా అన్న చర్చ కూడ సాగుతోంది.

Tags:    

Similar News