ప్రజలు వైసీపీ విషయంలో అదే చేయాలన్న లోకేష్
విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ అధినేత జగన్ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఎర్ర బుక్ అన్నది ఇప్పటికే ఏపీలే పనిచేస్తోందని మంత్రి నారా లోకేష్ అన్నారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ అధినేత జగన్ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎర్ర బుక్ లో ఉన్నది తప్పుడు పనులు చేసిన వారి పేర్లని, గత ప్రభుత్వంలో వైసీపీ నేతలు చేసిన తప్పులు అన్నీ అందులో ఉంటాయని చెప్పారు.
ఎర్ర బుక్ లో ఉన్న వారి పేర్లను దగ్గర పెట్టుకుని విచారణ చేస్తామని అది కూడా చట్టబద్ధంగానే అని ఆయన స్పష్టం చేశారు. అంబేద్కర్ రచిందిన రాజ్యాంగం ప్రకారమే ఎవరి మీద అయినా చర్యలు ఉంటాయి తప్ప వేరే విధంగా ఉండదని ఆయన అన్నారు.
చట్టం తన పనిని తాను చేయనీయరా అని ప్రశ్నించారు. అసలు ఎర్ర బుక్ అంటే జగన్ కి భయం ఎందుకని లోకేష్ నిలదీశారు. ప్రభుత్వానికి బాధ్యత ఉంటుంది కదా తప్పు చేసిన వారిని శిక్షించే అధికారం ఉంటుంది కదా అని ఆయన అన్నారు.
ఆనాడు వ్యవస్థలలో ఎన్నో తప్పులు జరిగాయని ఆయన అన్నారు. తన మీద తప్పుడు రాతలు రాసిన ఒక పత్రిక మీద పరువు నష్టం దావా వేశాను అని ఆ కేసు విచారణకు ఇప్పటికి నాలుగు సార్లు విశాఖకు వచ్చాను అని ఆయన చెప్పారు. పరువు నష్టం కేసులో తాను గెలుస్తాను అన్న నమ్మకం ఉందని ఆయన అన్నారు.
వ్యక్తుల మీద వ్యవస్థల మీద ప్రభుత్వం మీద తప్పుడు ప్రచారం చేస్తే ఎవరి పైన అయినా చట్టపరంగా చర్యలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. తాను పాతిక లక్షలు చిరుతిళ్ళను తిన్నాను అని రాయడం తప్పు కదా అని ఆయన మీడియా ముందే సదరు పత్రిక నిర్వాహకులను ప్రశ్నించారు.
ఇప్పటికి అయిదేళ్ళు అయింది తన మీద రాసిన తప్పుడు రాతలను నిరూపించలేకపోయారు అని ఆయన అన్నారు. ఇదిలా ఉంటే ఏపీలో అనేక పరిశ్రమలను తీసుకుని వస్తామని ఆయన చెప్పారు. తాను ఈ విషయంలో పూర్తి దృష్టి పెట్టాను అని అన్నారు.
గతంలో విశాఖకు లూలూ పరిశ్రమను తీసుకుని వస్తే వైసీపీ ప్రభుత్వం వచ్చాక తరిమేశారు అని ఆయన అన్నారు ఇపుడు మళ్లీ లూలూ విశాఖకు వస్తోందని అన్నారు. విశాఖలో లూలూ నాడే వచ్చి ఉంటే ఇరవై వేల మందికి ఉద్యోగాలు దక్కేవని ఆయన అన్నారు.
అమర్ రాజా కంపెనీని కూడా ఏపీ నుంచి పంపించేశారు అని లోకేష్ విమర్శించారు. తాము కష్టపడి ఒక ప్రణాళికా ప్రకారం పరిశ్రమలను తీసుకుని వస్తున్నామని అయితే వైసీపీ వస్తే మళ్లీ వాటిని పంపించేస్తారు అన్న భయాందోళనలు ప్రజలలో ఉన్నాయని లోకేష్ అన్నారు. అందువల్ల ప్రజలు చేయాల్సింది ఒక్కటేనని మళ్లీ వైసీపీని ఎప్పటికీ గెలవనీయకుండా చూడాలని ఆయన కోరారు. ఈ విషయంలో ప్రజలు సహకరిస్తేనే తాము కూడా పనిచేయగలుగుతామని అన్నారు.
అంటే ఏపీలో వైసీపీ ఇక ఎప్పటికీ గెలవరాదు అని లోకేష్ కోరుకుంటున్నారు అని అంటున్నారు అది కూడా ప్రజల కోణంలోనే అని ఆయన చెప్పడమే విశేషం. అయితే ప్రజలు ఏ పార్టీని శాశ్వతంగా తిరస్కరించడం కానీ ఆదరించడం కానీ రాజకీయ చరిత్రలో జరగలేదు. అందువల్ల ఒకటికి రెండు మూడు సార్లు గెలిచిన పార్టీలు కూడా తరువాత ఎన్నికల్లో ఓటమి పాలు అయ్యాయి. ప్రజలకు మెప్పిస్తే ఎక్కువ కాలం అధికారంలో ఉండవచ్చు కానీ మరో పార్టీని రానీయవద్దు అని ప్రజలకు చెప్పినా అది ఎంతవరకూ ఆచరణలో జరుగుతుందో చూడాల్సి ఉంది అని అంటున్నారు.