లోకేష్ చెప్పిన మాట...సీనియర్లకు టాటా ?

ఇది తన మాట తన సొంత ఆలోచన అభిప్రాయం అంటూ మంత్రి నారా లోకేష్ విశాఖలో చేసిన ప్రకటన టీడీపీలో ఇపుడు చర్చకు దారి తీస్తోంది.

Update: 2025-01-28 03:32 GMT

ఇది తన మాట తన సొంత ఆలోచన అభిప్రాయం అంటూ మంత్రి నారా లోకేష్ విశాఖలో చేసిన ప్రకటన టీడీపీలో ఇపుడు చర్చకు దారి తీస్తోంది. పార్టీలో అందరికీ పదవులు రావాలి అని లోకేష్ విశాఖ పర్యటన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.

దీని వల్లనే చాలా మందికి న్యాయం జరుగుతుందని ఆయన అన్నారు. పార్టీలో క్షేత్ర స్థాయి నుంచి పై స్థాయి వరకూ పదవుల పంపిణీ సజావుగా సాగితేనే అందరికీ అవకాశాలు వస్తాయని ఆయన అన్నారు. నిజంగా లోకేష్ చెప్పిన మాట మంచిదే అని అంటున్నారు.

పార్టీలో మూడు సార్లు కీలక పదవులు చేసిన వారు తప్పుకుంటే కొత్త వారికి చాన్స్ దక్కుతుందని ఆయన అంటున్నారు. దీని మీద ఒక విధానం పార్టీలో ఉండాలని ఆయన అంటున్నారు. లోకేష్ అంతటితో ఆగలేదు. తాను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తప్పుకుంటానని సంచలన ప్రకటన చేశారు.

తాను ఆ పదవి మళ్ళీ తీసుకోను అని ఆయన అన్నారు. ఇక లోకేష్ చెప్పిన దాని ప్రకారం చూస్తే పార్టీలో చాలా మార్పులకు ఇది నాంది పలకబోతోంది అని అంటున్నారు. ఎలా అంటే టీడీపీలో పొలిట్ బ్యూరో మెంబర్స్ చాలా మంది ఉన్నారు. వారంతా పార్టీ పుట్టిన దగ్గర నుంచి ఉన్నారు.

ఒకసారి ఆ లిస్ట్ కనుక చూస్తే అయ్యన్నపాత్రుడు, యనమల రామక్రిష్ణుడు, అశోక్ గజపతి రాజు, కిమిడి కళా వెంకట్రావు, కేఈ క్రిష్ణమూర్తి, నిమ్మకాయల చిన రాజప్ప, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, కాల్వ శ్రీనివాసులు ఇలా చాలా మంది కనిపిస్తారు.

టీడీపీకి అత్యున్నత స్థాయి విధాన నిర్ణయ కమిటీగా పొలిట్ బ్యూరో వ్యవస్థ ఉంది. పార్టీ ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఇక్కడే చర్చించి తీసుకుంటారు. మొత్తం పాతిక మంది దాకా ఎక్స్ అఫీషియో మెంబర్స్ తో కలుపుకుని ఈ కమిటీ పనిచేస్తోంది.

అదే విధంగా టీడీపీ జాతీయ కార్యవర్గంలో చూసుకుంటే అధినేత చంద్రబాబుని మినహాయిస్తే లోకేష్ అనేక సార్లు జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. అలగే జాతీయ కార్యదర్శి ఉపాధ్యక్షుడు వంటి పదవులు ఉన్నాయి. రాష్ట్ర కమిటీలలో ఇదే తరహాలో పదవులు ఉన్నాయి.

వీటిలో చాలా మంది పదే పదే కొనసాగుతున్నారు. దానిని మార్చాలని నారా లోకేష్ అంటున్నారు. తనతోనే ఆ సంస్కరణ జరగాలని ఆయన ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన విశాఖలో చేసిన ఈ ప్రకటనతో టీడీపీలో చర్చ సాగుతోంది.

అయితే లోకేష్ ఇది తన సొంత అభిప్రాయం అని అన్నారు. పార్టీలో ఉన్న పెద్దలు అంతా చర్చించి దీని మీద నిర్ణయం తీసుకోవాలని ఆయన అన్నారు. ఇదిలా ఉంటే లోకేష్ అన్నారు అంటే అది పార్టీ కచ్చితంగా చర్చిస్తుంది. ఆ దిశగా కనుక నిర్ణయం తీసుకుంటే మాత్రం సీనియర్ నేతలు అంతా తప్పుకోవాల్సి ఉంటుంది అని అంటున్నారు. అయితే పార్టీకి కొత్త నీరు అవసరం అయినపుడు పాత వారు కొన్ని సందర్భాలలో త్యాగం చేయాల్సిందే అని అంటున్నారు. సో ఇపుడు టీడీపీలో అదే జరగబోతోందా అన్నదే చర్చగా ఉంది.

Tags:    

Similar News