లడ్డూ ఇష్యూలో లోకేశ్ గ్రేట్ ఎస్కేప్.. గమనించారా?
ఏపీ రాజకీయాల్ని గమనిస్తున్నారా? అధికారంలో లేని వేళలో పార్టీని పవర్ లోకి తెచ్చేందుకు కిందా మీదా పడిన ముఖ్య నేతల్లో నారా లోకేశ్ ముందుంటారు.
ఏపీ రాజకీయాల్ని గమనిస్తున్నారా? అధికారంలో లేని వేళలో పార్టీని పవర్ లోకి తెచ్చేందుకు కిందా మీదా పడిన ముఖ్య నేతల్లో నారా లోకేశ్ ముందుంటారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడిగా.. ఆయన రాజకీయ వారసుడిగా లోకేశ్ పార్టీలోకి ఎంట్రీ ఇచ్చినా.. ఆరంభంలో ఎదురుదైన ఎదురుదెబ్బలతో అతడు తన తీరును మొత్తంగా మార్చేసుకున్నారని చెప్పాలి. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లు.. నాటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పటంలో.. అప్పటి ప్రభుత్వ విధానాల్ని ప్రశ్నించటంలో జోరు చూపించిన లోకేశ్.. కూటమి సర్కారులో మాత్రం తన పని తాను అన్నట్లుగా చేసుకుంటూ పోతున్నారు.
ప్రభుత్వ వ్యవహారాల్లో నామమాత్రంగా మాత్రమే జోక్యం చేసుకుంటున్న ఆయన.. పార్టీ అంశాల్లో మాత్రం అన్నీ తానై అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. కాకుంటే.. లో ప్రొఫైల్ ప్రదర్శించటం ఆసక్తికరంగా మారింది. నిజానికి ఏపీ వ్యాప్తంగా కూటమి సర్కారులోని ముఖ్యమంత్రి.. ఉప ముఖ్యమంత్రి.. ఎమ్మెల్యేలు..ఎమ్మెల్సీలు.. ఎంపీలతో పోలిస్తే లోకేశ్ మాత్రమే క్రమం తప్పకుండా ప్రజలకు అందుబాటులో ఉంటున్నట్లుగా చెబుతున్నారు.
ప్రతి రోజు ఉదయమే రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి వచ్చే వారి సమస్యలు వినటం.. వారికి తగిన సాయం చేస్తానని మాట ఇవ్వటంతో పాటు.. ఆ విన్నపాలన్ని త్వరగా పరిష్కరించేలా జాగ్రత్తలు తీసుకుంటున్న లోకేశ్.. ఆ అంశాన్ని మీడియాలో హైలెట్ చేసే విషయంలో మాత్రం పెద్దగా ఆసక్తి చూపకపోవటం కనిపిస్తుంది. ఇటీవల విజయవాడకు పోటెత్తిన వరదల వేళలోనూ లోకేశ్ తీరు ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ మొత్తం ఎపిసోడ్ లో చంద్రబాబు హైలెట్ కాగా.. ఆ తర్వాతి స్థానంలో పవన్ కల్యాణ్ నిలిచారు. కానీ.. లోకేశ్ మాత్రం కనిపించలేదు.
దీంతో ప్రతిపక్ష నేతలు సైతం లోకేశ్ బాధ్యతతో వ్యవహరించట్లేదంటూ విమర్శలు చేశారు. ఆయన హైదరాబాద్ కే పరిమితమైనట్లుగా విమర్శలు చేశారు. వాస్తవం ఏమంటే.. వరద ప్రభావిత ప్రాంతాల్లో లోకేశ్ పర్యటించినప్పటికీ.. వాటికి పెద్దగా ప్రచారం లేకుండా ఉండేందుకు ప్రాధాన్యత ఇవ్వటం కనిపిస్తుంది. తిరుమల లడ్డూ విషయంలోనూ ఆయన ఫాలో అవుతున్న లో ప్రొఫైల్ ఆయనకు మేలు చేస్తుందనే చెప్పాలి. ఈ రోజున లడ్డూ కల్తీ ఆరోపణలపై సుప్రీం సైతం సీరియస్ అయ్యింది. ఆధారాలు ఏమిటంటూ ప్రశ్నించింది. దీనికి ఏపీ ప్రభుత్వం తరఫు న్యాయవాది సైతం నీళ్లు నమిలిన పరిస్థితి.
ఇంతకూ లోకేశ్ లోప్రొఫైల్ వెనుక వ్యూహం ఏమిటి? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ప్రచారం కోసం ఎలాంటి ప్రయత్నం చేయకపోవటమే కాదు.. చేస్తున్న పని సైతం హైలెట్ కాకుండా ఎందుకు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు? అన్నదిప్పుడు చర్చగా మారింది. కూటమి ప్రభుత్వంలో ఇప్పటికే అధికార కేంద్రాలుగా చంద్రబాబు.. పవన్ కల్యాణ్ ఉన్నప్పుడు.. తాను మరో పవర్ సెంటర్ గా ఫోకస్ అయితే ఇబ్బందులు తలెత్తుతాయన్న ఉద్దేశంతో తన పని తాను చేసుకుంటూ పోవటానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెబుతున్నారు. అదే సమయంలో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరిలో తన బలాన్ని పెద్ద ఎత్తున పెంచుకోవటంతో పాటు.. కంచుకోటగా మార్చుకునే అంశానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి లోకేశ్ వేస్తున్న ప్రతి అడుగు వ్యూహాత్మకంగా.. భవిష్యత్ అవసరాలకు తగినట్లుగా ఉందని చెప్పక తప్పదు.