లోకేష్ అన్నయ్యా అంటూ...గంటా వారబ్బాయా మజాకానా ?

అందువల్ల లోకేష్ నాయకత్వం జిందాబాద్ అంటూ తమ్ముళ్ళు చేసే హడావుడు పీక్స్ లోకి వెళ్తోంది.

Update: 2025-01-24 13:21 GMT

తెలుగుదేశం రాజకీయం ఇపుడు నారా లోకేష్ చుట్టూ తిరుగుతోంది. ఆ విధంగా చూస్తే ఏపీ పాలిటిక్స్ కూడా ఆయన చుట్టూ తిరుగుతోంది అని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఏపీని ఏలుతోంది తెలుగుదేశం నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం. అందువల్ల లోకేష్ నాయకత్వం జిందాబాద్ అంటూ తమ్ముళ్ళు చేసే హడావుడు పీక్స్ లోకి వెళ్తోంది.

ఇక ఒకరి కంటే మరొకరు అన్నట్లుగా నారా లోకేష్ ని పొగడ్తలతో ముంచేస్తున్నారు. నారా లోకేష్ డిప్యూటీ సీఎం అన్న దాంతో మొదలైన ఈ వ్యవహారం కాస్తా ఇపుడు ఎక్కడికో వెళ్ళిపోతోంది. ఉప ముఖ్యమంత్రి ఏంటి కాబోయే సీఎం అని మంత్రి టీజీ భరత్ ఒక రకమైన పొలిటికల్ కలరింగ్ ఇచ్చాక అది మరింతగా ముందుకు సాగుతోంది.

సీనియర్ మంత్రి అచ్చెన్నాయుడు అయితే చంద్రబాబు తరువాత లోకేష్ బాబే ఎనీ డౌట్స్ అంటూ బిగ్ సౌండ్ చేసారు. ఇపుడు మరో మాజీ మంత్రి సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు తనయుడు టీడీపీ యువ నాయకుడు గంటా రవితేజా అయితే డిప్యూటీ సీఎం అలాగే సీఎం ఎందుకు ఏకంగా ప్రధానమంత్రి గానే లోకేష్ ని మనం ఫ్యూచర్ లో చూడబోతున్నామని విషయాన్ని ఎక్కడికో తీసుకెళ్ళారు.

నారా లోకేష్ బర్త్ డే ఈసారి ఎన్నడూ జరగని విధంగా జరిగింది. ఒక విధంగా ఊరూ వాడా హోరెత్తింది. భీమిలీలో జరిగిన కార్యక్రమంలో రవితేజా మాట్లాడుతూ ఏపీ పాలిటిక్స్ లో గేమ్ చేంజర్ నారా లోకేష్ అని కీర్తించారు. నారా లోకేష్ అన్నయ్య తమందరికీ స్పూర్తి అని చెప్పారు. తామంతా కూడా విదేశాలలో చదువుకుని వచ్చిన వారిమని అన్నారు. తమకు ప్రజా సేవ చేయాలన్న దానికి లోకేష్ ఇన్స్పిరేషన్ అని చెప్పారు.

తాను తొలిసారి లోకేష్ ని తన తండ్రి ఎంపీగా ఉన్నపుడు ఢిల్లీలో కలిశాను అని ఫ్లాష్ బ్యాక్ ని గుర్తు చేసుకున్నారు. అప్పట్లో చాలా సింపుల్ గా కనిపించిన లోకేష్ లో ఇంత పెద్ద నాయకుడు ఉన్నారా అని తామంతా ఆశ్చర్యపోయేలా ఆయన ఏపీ రాజకీయాల్లో కీ రోల్ ప్లే చేస్తున్నారు అని అన్నారు.

తెలుగు వారి నుంచి ఒక్క పీవీ నరసింహారావు మాత్రమే ప్రధాని అయ్యారని ఆయన అన్నారు. మరి ఆ లోటు లోకేష్ తో తీరుతుందని ధీమాను వ్యక్తం చేసారు. లోకేష్ కి ప్రధాని అయ్యే నాయకత్వ లక్షణాలు నిండుగా ఉన్నాయని కితాబు ఇచ్చారు. లోకేష్ పార్టీ కోసం వేస్తున్న ప్రతీ అడుగూ అందరికీ స్పూర్తిగా ఉంటోందని అన్నారు. లోకేష్ కోటి సభ్యత్వాలను చేర్పించడం అలాగే కార్యకర్తలకు అయిదు లక్షల దాకా బీమాను అందించే ఆలోచనలు చేయడం నిజంగా గ్రేట్ అని గంటా రవితేజా పొగిడేశారు.

గంటా రవితేజా ఏకంగా లోకేష్ ని ప్రధాని అవుతారు అంటూ చెబుతున్న జోస్యం ఇటీవల కాలంలో ఆయన గురించి తమ్ముళ్ళు పొగుడుతూ ఇస్తున్న కితాబుల కంటే వేయి రెట్ల అతి పెద్ద మతాబు అని అంటున్నారు. లోకేష్ అన్నయ్యా అని ప్రతీ మాటకు ముందూ వెనకా అంటూ గంటా రవితేజా ఆయన్ని ఏకంగా ప్రధానిని చేయడం అంటే ఏ రేంజిలో పొగిడారుగా బాబూ అని అంటున్నారు. ఎంతైనా గంటా వారి అబ్బాయి కదా అని కూడా అంటున్నారు.

వచ్చే ఎన్నికల్లో భీమిలీ నుంచి టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేయాలని చూస్తున్న రవితేజా ఇపుడు లోకేష్ యంగ్ టీం లో చోటు కోసం చూస్తున్నారు అని సెటైర్లు కూడా పడుతున్నాయి. మొత్తానికి లోకేష్ ఈ రకమైన పొగడ్తలను ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాల్సి ఉంది.

Tags:    

Similar News