బీజేపీ దగ్గర బేరాల్లేవమ్మా బాబూ...!

Update: 2024-02-25 03:00 GMT

ఏపీలో పొత్తుల కధ కొత్త మలుపు తిరుగుతోంది. టీడీపీ జనసేన పొత్తు విషయంలో చాలా దూరం వెళ్ళిపోయాయి. తమతో కలసి రావాలని బీజేపీని ఆ పార్టీలు పిలుస్తున్నాయి. కానీ బీజేపీ మదిలో ఏముందో తెలియదు దాంతో ఇపుడు అభ్యర్ధుల ప్రకటన దాకా టీడీపీ జనసేన వచ్చేశాయి.

దీంతో ఏపీలో వత్తిడి రాజకీయం నడుస్తోందా అన్న చర్చ వస్తోంది. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది అని దాంతో పొత్తు పెట్టుకుంటే ఎన్నికల వేళ తమకు ఉపయోగకరం అని టీడీపీ జనసేన భావిస్తూ వచ్చాయి. అయితే ఈ నెల మొదటి వారంలో చంద్రబాబు ఢిల్లీ వెళ్ళి అమిత్ షా తో భేటీ వేశారు కానీ ఆ మ్యాటర్ ఏంటో ఎవరికీ తెలియలేదు.

ఇంతలో ఉన్నట్లుండి టీడీపీ జనసేన తమ అభ్యర్ధులను ప్రకటించేశాయి. మూడు వంతులు ప్రకటించి ఒక వంతుని మాత్రం అలా ఉంచేశాయి. ఈ సందర్భంగా చంద్రబాబు అన్న మాటలు కూడా ఆసక్తికరంగా ఉన్నాయి. బీజేపీ కూడా కలిసివస్తే అన్న మాట వాడారు.

దాని ఉద్దేశ్యం ఏమిటి అన్న చర్చ సాగుతోంది. చంద్రబాబు ఢిల్లీ వెళ్లి బీజేపీ అసలు సూత్రధారి అమిత్ షాతో చర్చలు జరిపినా కూడా ఇంకా కలసి వస్తుందో రాదో అన్నది తెలియలేదా అన్న ధర్మ సందేహం కూడా కలుగుతోంది. అదే సమయంలో బీజేపీ నుంచి మళ్లీ వర్తమానం రాలేదా అన్న ప్రశ్నలు వస్తున్నాయి.

ఈ నేపధ్యంలో బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు మీడియాతో మాట్లాడుతూ కొన్ని కీలక కామెంట్స్ చేశారు. ఏపీలో పొత్తుపై బీజేపీ హైకమాండ్ నిర్ణయం తీసుకోలేదని ఆయన చెప్పారు. అలాగే, మాకు హైకమాండ్ నుండి స్పష్టమైన ఆదేశాలు లేవు కాబట్టి పొత్తుల మీద తాను ఏమీ వ్యాఖ్యానించలేనని జీవీఎల్ అన్నారు.

అంతే కాదు ఎవరితో పొత్తు పెట్టుకోవాలో బీజేపీ హైకమాండ్ నిర్ణయిస్తుందని ఆయన చెప్పారు. ఇక అప్పటి వరకు ఏపీ నాయకత్వం సొంతంగా ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతుందని జీవీఎల్ చెప్పారు. పొత్తుపై చర్చలు జరుపుతున్న బీజేపీ ఇంకా అధికారికంగా ప్రకటించకపోవడమే ఇక్కడ అసలైన ట్విస్ట్.

అంతే కాదు బీజేపీకి ఎన్ని సీట్లు ఇస్తారు ఎన్ని బీజేపీ కోరుతోంది అన్నది తేలేంతవరకూ ఈ సస్పెన్స్ కంటిన్యూ అవుతుంది అని అంటున్నారు. పవన్ కళ్యాణ్ మాదిరిగా బీజేపీ సీట్ల విషయంలో తగ్గేది ఉండదని చంద్రబాబు రాజకీయానికి పై ఎత్తు రాజకీయమే బీజేపీ అగ్ర నాయకత్వం వేస్తుందని అంటున్నారు. సో బీజేపీతో బంధం తెంపులోకోలేరు, అలాగని కుదుర్చుకోనూ లేరు అని అంటున్నారు.

Tags:    

Similar News