‘తల్లికి వందనం’.. అసలు విషయం చెప్పేసిన లోకేశ్‌!

ఆంధ్రప్రదేశ్‌ లో ఎన్నికల ముందు టీడీపీ, జనసేన కూటమి తాము అధికారంలోకి వస్తే పలు పథకాలను అమలు చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే.

Update: 2024-07-24 07:54 GMT

ఆంధ్రప్రదేశ్‌ లో ఎన్నికల ముందు టీడీపీ, జనసేన కూటమి తాము అధికారంలోకి వస్తే పలు పథకాలను అమలు చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో ఒకటి.. ‘తల్లికి వందనం’. ఈ పథకం కింద ఒక ఇంట్లో బడికి వెళ్లే పిల్లలు ఎంత మంది ఉంటే అంతమందికి ఏడాదికి రూ.15,000 చొప్పున ఇస్తామని ప్రకటించారు.

వైసీపీ ప్రభుత్వం కూడా 2019 ఎన్నికల ముందు ఒక ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి జగనన్న అమ్మ ఒడి పేరుతో రూ.15000 ఇస్తామని చెప్పింది. స్వయంగా వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ సతీమణి వైఎస్‌ భారతి కూడా 2019 ఎన్నికల ప్రచారమప్పుడు ఒక ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అందరికీ అమ్మ ఒడి ఇస్తామని చెప్పారు.

అయితే 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక ఇంటికి ఒక్క బిడ్డకే పరిమితం చేసింది. ఎన్నికల ముందు అందరికీ ఇస్తామని చెప్పి ఒక్కరికే పరిమితం చేయడంపైన విమర్శలు వ్యక్తమయ్యాయి. అయినా వైసీపీ ప్రభుత్వం వెనకడుగు వేయలేదు. ఒక్కరికే పథకాన్ని వర్తింపజేసింది. అది కూడా మొదట్లో రెండేళ్లు రూ.15,000 చొప్పున ఇచ్చి.. ఆ తర్వాత రెండేళ్లు రూ.13,000కి కుదించింది. మిగతా రెండు వేల రూపాయలను స్కూల్‌ మౌలిక సదుపాయాలు, టాయలెట్ల వసతి, వాచ్‌ మెన్‌ జీతాల కోసమని చెప్పింది.

కాగా ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చాక ఇంతవరకు తల్లికి వందనం (గతంలో జగనన్న అమ్మ ఒడి) పథకంపై ఎలాంటి స్పందనా లేదు. దీనిపై వైసీపీతోపాటు ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. పాఠశాలలు ప్రారంభించి నెలన్నర అవుతున్నా ఇంతవరకు తల్లికి వందనం కింద నగదు ఇవ్వలేదని ఆరోపిస్తున్నాయి. తమ హయాంలో పాఠశాలలు తీసిన వెంటనే నగదు తల్లి ఖాతాల్లో వేశామని వైసీపీ గుర్తు చేస్తోంది.

తల్లికి వందనం పథకాన్ని అమలు చేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని విమర్శలు వ్యక్తమవుతున్న వేళ ఏపీ మానవ వనరులు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ దీనిపై స్పష్టత ఇచ్చారు. తాజాగా జరుగుతున్న ఏపీ అసెంబ్లీ శాసనసభ సమావేశాల్లో మాట్లాడిన ఆయన తల్లికి వందనం పథకాన్ని తాము అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఎన్నికల ముందు మాట ఇచ్చినట్టుగానే ఒక ఇంట్లో బడికి వెళ్లే పిల్లలు ఎంత మంది ఉంటే అంతమందికి ఈ పథకాన్ని వర్తింపజేస్తామని చెప్పారు.

తల్లికి వందనం పథకంపై మార్గదర్శకాలు రూపొందించడానికి తమకు కొంత సమయం కావాలని లోకేశ్‌ తెలిపారు. గత ప్రభుత్వంలో జరిగిన తప్పులు జరగకూడదన్నదే తమ లక్ష్యమన్నారు. అర్హులు ఎంతమంది ఉన్నా అంతమందికి రూ.15 వేలు చొప్పున ఇస్తామని వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలలతోపాటు ప్రైవేటు పాఠశాలలకు ఈ పథకాన్ని వర్తింపజేస్తామని స్పష్టం చేశారు.

దీంతో ప్రభుత్వం వద్ద నిధులు లేవని, ప్రభుత్వ ఖజానా ఖాళీగా ఉందని.. తల్లికి వందనం పథకాన్ని అమలు చేయకపోవచ్చని సాగిన ఊహాగానాలకు చెక్‌ పడింది.

Tags:    

Similar News