మూడేళ్ళ తరువాత విశాఖకు మోడీ!
వాతావరణం అనుకూలించక అందువల్లనే క్యాన్సిల్ అయింది అని అపుడు చెప్పారు. ఇక 2025 జనవరి 8న ప్రధాని ఉమ్మడి విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దాదాపు మూడేళ్ల తరువాత విశాఖ జిల్లాకు వస్తున్నారు. చాలా సార్లు ప్రధాని విశాఖ పర్యటన ఉన్నా కూడా అది అనివార్య కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. ఈ ఏడాది నవంబర్ లో ప్రధాని విశాఖ టూర్ దాదాపుగా ఖరారు అయి చివరి నిముషంలో క్యాన్సిల్ అయింది.
వాతావరణం అనుకూలించక అందువల్లనే క్యాన్సిల్ అయింది అని అపుడు చెప్పారు. ఇక 2025 జనవరి 8న ప్రధాని ఉమ్మడి విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు. ఆయన అనకాపల్లికి వస్తారు అని అంటున్నారు. అక్కడ స్థానికంగా అనేక కార్యక్రమాలను ప్రారంభిస్తారు అని చెబుతున్నారు. అంతే కాదు అనకాపల్లి లో ప్రధాని బహిరంగ సభను ఏర్పాటు చేశారు.
అనకాపల్లి ఎంపీ బీజేపీకి చెందిన సీఎం రమేష్ ఉన్నారు. అందువల్ల ప్రధాని అనకాపల్లి లో పర్యటిస్తారు అని తెలుస్తోంది. అయితే ఆయన విశాఖ జిల్లాలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలకు కూడా ఈ సందర్భంగా శ్రీకారం చుడతారు అని అంటున్నారు. ప్రధాని చేతుల మీదుగా రైల్వే జోన్ భవన నిర్మాణాలకు శంకుస్థాపన జరుగుతుంది అని అంటున్నారు. అదే విధంగా అనేక ఇతర కార్యక్రమాలు ఆయన ప్రారంభిస్తారు అని తెలుస్తోంది.
అయితే ప్రధాని ఉమ్మడి విశాఖ జిల్లా టూర్ లో మరోమారు విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ ఇష్యూ చర్చకు వస్తోంది. ప్రధాని దీని మీద ఏమి చెబుతారు అన్నది అంతా ఆసక్తిగా చూస్తున్నారు. విశాఖ ఉక్కు విషయంలో కీలక నిర్ణయం తీసుకోవాలని దానిని ప్రభుత్వ రంగంలోనే ఉంచాలని ఉక్కు కార్మికులు కోరుతున్నారు.
ఇప్పటికి పదిహేను వందల రోజులుగా ఏకధాటీగా ఉక్కు ఉద్యోగులు కార్మికులు నిరవధిక దీక్షలు చేస్తున్నారు. ప్రజా సంఘాలు అన్నీ కలసి ఉత్తరాంధ్ర వేదికగా ఏర్పడి విశాఖ ఉక్కు విషయంలో పోరాటం చేస్తూ వస్తున్నాయి. లక్ష పోస్టు కార్డులను ప్రధానికి పంపించడం ద్వారా విశాఖ ఉక్కుని కాపాడుకోవాలని కూడా నిర్ణయించారు.
అంతే కాదు జనవరి 27న విశాఖలో లక్ష మంది ప్రజానీకంతో భారీ బహిరంగ సభను విశాఖ ఉక్కు కర్మాగారం విషయంలో నిర్వహించాలని కూడా నిర్ణయించారు. ఈ క్రమంలో ప్రధాని రాక మీద అధికార ప్రకటన విడుదల కావడంలో ఉక్కు పోరాట కమిటీ నిర్వాహకులు తన కార్యాచరణను రూపొందించుకుంటున్నారు.
ఏది ఏమైనా విశాఖకు ప్రధాని వస్తున్నారు. అదీ కూడా మూడవసారి ఆయన ప్రధాని అయ్యాక రావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. రాజకీయంగా కూడా ఇది చర్చనీయాంశం అవుతోంది. ప్రధాని నరేంద్ర మోడీ ఉమ్మడి విశాఖ జిల్లాకు ఇవ్వబోయే వరాలు గురించి కూడా అంతా చర్చించుకుంటున్నారు. అదే విధంగా ఉత్తరాంధ్రాకు విభజన చట్టంలో ఇచ్చిన హామీల మీద ప్రధాని ఏమి చెప్పబోతున్నారు అన్నది కూడా ఆసక్తిగా ఉంది. మొత్తానికి మోడీ టూర్ ఎట్టకేలకు అధికారికంగా ఫిక్స్ అయింది. దాంతో అంతా ఆయన రాక కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు.