మోదీ సమాధానం చెబుతారా ?

అయితే తాజాగా పార్లమెంట్ లో జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే అవిశ్వాస తీర్మానంపై మోడీ చివరలో సమాధానం చెబుతారా అనే అనుమానం పెరిగిపోతోంది

Update: 2023-08-04 05:34 GMT

ఇండియా కూటమి, ప్రతిపక్షాల అధినేతల ఆలోచన ఏమిటంటే మణిపూర్ అల్లర్లపై నరేంద్రమోడీతో పార్లమెంటులో ఒక ప్రకటన చేయించాలని. మణిపూర్ అల్లర్లను దేశమంతా వినిపించేట్లుగా ఎండగట్టడం, మోడీ స్టాండ్ ఏమిటో దేశానికి వినిపించేట్లు చేయటమే ప్రతిపక్షాల వ్యూహం. ఇందుకోసమే అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించాయి. మణిపూర్ల అల్లర్లపై ప్రతిపక్షాలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానాన్ని వేరేదారిలేక లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా ఆమోదించాల్సి వచ్చింది. దానిపై 8,9,10 తేదీల్లో పార్లమెంట్ లో చర్చలు జరుగుతాయి. మూడురోజుల చర్చల తర్వాత చివరకు మోదీ సమాధానం చెబుతూ ఒక ప్రకటన చేయాలి.

అయితే తాజాగా పార్లమెంట్ లో జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే అవిశ్వాస తీర్మానంపై మోడీ చివరలో సమాధానం చెబుతారా అనే అనుమానం పెరిగిపోతోంది. ఎందుకంటే ఢిల్లీ ప్రభుత్వం అధికారాలపై కత్తెర వేసే బిల్లును లోక్ సభ గురువారం ఆమోదించింది.

ఆమోదానికి ముందు ఇండియా కూటమి, ప్రతిపక్షాలు బిల్లును తీవ్రంగా వ్యతిరేకించాయి. ప్రతిపక్షాల ఎంపీలు బిల్లుకు వ్యతిరేకంగా మాట్లాడారు. సంఖ్యా బలం కారణంగా లోక్ సభలో బిల్లు తేలికగానే పాసైపోయింది. ప్రతిపక్షాలు మాట్లాడిన తర్వాత సమాధానం చెప్పాల్సిన మోడీ చెప్పలేదు.

మోడీకి బదులుగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమాధానమిచ్చారు. వాస్తవానికి సమాధానం చెప్పాల్సింది హోంశాఖ మంత్రిగా అమిత్ షానే. కానీ బిల్లు కున్న ప్రాధాన్యత దృష్ట్యా మోడీయే సమాధానం చెప్పాలని ప్రతిపక్షాలు ఎన్ని డిమాండ్లుచేసినా లెక్కచేయలేదు. మొదటి నుంచి కూడా మోడీ వైఖరి ఇలాగే ఉంటోంది. ప్రతిపక్షాలు అడిగాయని కాకుండా తాను మాట్లాడాలని అనుకుంటే మాత్రమే మాట్లాడుతున్నారు. లేకపోతే అసలు సభకే హాజరుకారు.

ఇంతటి కీలకమైన, ప్రతిపక్షాలన్నీ వ్యతిరేకించిన బిల్లు విషయంలోనే మోడీ లెక్కచేయలేదు. రేపు మణిపూర్ అల్లర్లపైన మాత్రం మోడీయే సమాధానం చెబుతారా ? అనే సందేహాలు పెరిగిపోతున్నాయి. అవిశ్వాతీర్మానంకు చివరలో సమాధానం చెప్పాల్సింది సభానేతే.

అయితే బీజేపీ నియమ, నిబంధనలని కాకుండా తాను అనుకున్నట్లుగానే వ్యవహారాలను నడుపుతోంది. కాబట్టి 10వ తేదీన కూడా ఏదో కారణంగా తనకు బదులుగా అమిత్ షా తో సమాధానం చెప్పించినా ఎవరు చేసేదేమీలేదు. లేకపోతే అసలు ప్రభుత్వం తరపున సమాధానం అన్నది రాకుండానే అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరిగిపోతుందంతే.

Tags:    

Similar News