మోడీ ఆరోపణలు కరెక్టేనా ?
దేశానికి ప్రధానమంత్రిగా పనిచేస్తున్న నరేంద్రమోడీ కూడా సగుటు నేతల్లాగ చవకబారు ఆరోపణలు చేయటం ఆశ్చర్యంగా ఉంది
దేశానికి ప్రధానమంత్రిగా పనిచేస్తున్న నరేంద్రమోడీ కూడా సగుటు నేతల్లాగ చవకబారు ఆరోపణలు చేయటం ఆశ్చర్యంగా ఉంది. కూటమి తరపున చిలకలూరిపేటలో ప్రజాగళం బహిరంగసభ జరిగింది. ఈ సభకు హాజరైన నరేంద్రమోడి మాట్లాడుతు వైసీపీ, కాంగ్రెస్ ఒకే ఒరలో కత్తులని ఆరోపించారు. అలాగే మంత్రులు అవినీతిలో కూరుకుపోయారన్నారు. నిజానికి ఈ రెండు ఆరోపణలు కూడా మోడీ చేయాల్సిన స్ధాయి ఆరోపణలు కావు. ఎందుకంటే మోడీ చేసిన రెండు ఆరోపణలు కూడా గాలి ఆరోపణల్లాగే ఉన్నాయి. ప్రత్యర్ధుల మీద ఆరోపణలు చేసేటపుడు మోడీ అందుకు తగ్గ ఆధారాలను కూడా జనాలకు వివరించాలి.
ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించిన మోడి అందుకు ఆధారాలను కూడా చూపుంటే బాగుండేది. ఎన్నికల ప్రచారసభలో ఆరోపణలు చేయాలికాబట్టి చేశారన్నట్లుగా ఉంది. ప్రభుత్వం ఎక్కడెక్కడ అవినీతికి పాల్పడింది, అందుకు బాధ్యులు ఎవరన్న విషయాన్ని మోడీ చెప్పకపోతే జనాలు ఎలా నమ్ముతారు ? చేసిన ఆరోపణలకు ఆధారాలను సేకరించటం, జనాలముందుంచటం మోడీకి పెద్ద కష్టంకాదని అందరికీ తెలుసు. అయినాసరే మోడీ ఆరోపణలకు మాత్రమే పరిమితమై ఆధారాలను చూపకపోవటం గమనార్హం.
ఇదే సమయంలో వైసీపీ, కాంగ్రెస్ ఒకే ఒరలోని కత్తులని చేసిన మరో ఆరోపణలో కూడా పసలేదు. ఎందుకంటే గడచిన ఐదేళ్ళుగా లోక్ సభ, రాజ్యసభలో మద్దతు తీసుకుంటున్నది ఎవరు ? కీలకమైన బిల్లులు పాస్ అవటానికి రాజ్యసభలో జగన్మోహన్ రెడ్డి మద్దతు తీసుకుంటున్నది మోడీయే అన్న విషయం అందరికీ తెలుసు. ఒకవైపు పార్లమెంటులో జగన్ మద్దతు తీసుకుంటున్న మోడీ తాజాగా వైసీపీ, కాంగ్రెస్ ఒకే ఒరలోని కత్తులని ఆరోపించటంలో అర్ధంలేదు. వైసీపీ, కాంగ్రెస్ ఒకటే అన్నపుడు జగన్ మద్దతును మోడీ ఎందుకు తీసుకుంటున్నారు ? ఎలాగ తీసుకుంటున్నారు ?
మామూలుగా రచ్చబండ దగ్గర జనాలు మాట్లాడుకునేట్లుగా ఉన్నాయి మోడీ చేసిన ఆరోపణలు కూడా. ఎవరిమీదైనా మోడీ ఆరోపణలు చేస్తే జనాలకు అవి నిజమనిపించేట్లుగా ఉండాలి. మోడీచేసిన ఆరోపణలపై జనాలంతా చర్చించుకోవాలి. అంతేకాని ఆరోపణలను వినగానే ఇవి ఉత్త గాలి ఆరోపణలని తేలిపోకూడదు. నిజంగానే వైసీపీ ప్రభుత్వం అవినీతికి పాల్పడితే మరి ఐదేళ్ళల్లో ఎందుకని మోడీ ప్రభుత్వం యాక్షన్ తీసుకోలేదు ? పై రెండు ప్రశ్నలకు మోడీ సమాధానం చెప్పగలరా ?