బాబుతో మోడీ : ఆ చిరునవ్వు వెనక ?

బాబు ఒక దశలో ఎమోషన్ అయితే మోడీ ఆయన భుజం తట్టి ఓదార్చారు. ఇవన్నీ మీడియా కంటబడిన దృశ్యాలే;

Update: 2024-06-13 09:42 GMT

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్యమంత్రిగా నాలుగవ సారి ప్రమాణ స్వీకారం చేస్తున్న చంద్రబాబు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా బాబు మోడీ మంచి దోస్తులుగా కనిపించారు. ఇద్దరూ ఆలింగనం చేసుకున్నారు. చిరునవ్వులు చిందించారు.

బాబు ఒక దశలో ఎమోషన్ అయితే మోడీ ఆయన భుజం తట్టి ఓదార్చారు. ఇవన్నీ మీడియా కంటబడిన దృశ్యాలే. కెమెరాలు బంధించిన సత్యాలే. అయితే మోడీ బాబు మంత్రుల ప్రమాణ స్వీకారం అంతసేపూ దాదాపుగా గంట పాటు పక్క పక్కనే కూర్చుని కబుర్లు చెప్పుకున్నారు.

ఒక విధంగా చాలా విషయాలు ఇద్దరూ మాట్లాడుకునేంత సమయం ఉంది అని అంతా అనుకున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే మోడీ బాబుతో చిరునవ్వులు చిందించినా ఆ నవ్వులలో జీవం లేదని అంటూ ప్రచారం సాగుతోంది. ఏదో మొక్కుబడిగా నవ్వాలి కాబట్టి నవ్వారు తప్ప అందులో రియాలిటీ కనిపించలేదు అన్న కొత్త చర్చ మొదలైంది.

మోడీ రాజకీయం చూస్తే ఆయన తన ప్రత్యర్థులు ఎవరైనా గుర్తు పెట్టుకుంటారు. వారు గతంలో తనను అన్న మాటలనూ గుర్తు చేసుకుంటారు. ఆ విధంగా చూస్తే 2019 ఎన్నికల వేళ బాబు మోడీని చాలానే అన్నారు. వాటిని మోడీ గుర్తు చేసుకుని అలా వ్యవహరిస్తున్నారా అన్న చర్చ కూడా ఉంది.

అయితే చంద్రబాబుతో దోస్తీ అనివార్యం గా బీజేపీకి ఉంది. మ్యాజిక్ ఫిగర్ కి 32 సీట్ల దూరంలో బీజేపీ నిలిచిన వేళ ఆక్సిజన్ మాదిరిగా చంద్రబాబు టీడీపీకి చెందిన 16 మంది ఎంపీలు మద్దతు ఇచ్చారు. దాంతో మోడీ ప్రభుత్వం ముచ్చటగా మూడోసారి ఏర్పడింది. అందువల్ల మోడీకి బాబు అవసరం ఇపుడు చాలా ఉంది. అందుకే తెచ్చి పెట్టుకున్న నవ్వుతోనే మోడీ బాబు ప్రమాణ స్వీకారం సందర్భంగా కనిపించారా అన్న చర్చ సాగుతోంది

అద్దం అబద్ధం చెప్పదు అని అంటారు. అలాగే ఫోటోలు కూడా నిజాలే చెబుతాయి కాబట్టి మోడీ ఫేస్ లో పెద్దగా ఆనందపు జల్లులు అయితే కనిపించలేదు అని కొంతమంది అంటున్నారు. మరి అది నిజమా కాదా అంటే కొంత కాలం ఓపిక పడితే తెలిసిపోతుంది. మోడీ విషయమే తీసుకుంటే ఆయన సొంతంగా ఉండాలని చూస్తారు. ఎవరి మీద ఆధారపడే తత్వం ఆయనకు ఉండదు.

కానీ ప్రభుత్వ ఏర్పాటు లో మిత్రుల సాయం అవసరం అయింది కాబట్టే ఆయన ఇలా తగ్గినట్లుగా కనిపిస్తున్నారు అన్న చర్చ కూడా సాగుతోంది. మొత్తం మీద చూస్తే మోడీ చిరునవ్వు వెనక ఏమేమి అర్ధాలు ఉన్నాయన్నది ఎవరికి వారుగా ఆరాలు తీస్తున్నారు. భాష్యాలు చెప్పుకుంటున్నారు. చూడాలి మరి మోడీ బాబు బంధం ఎంతకాలం కొనసాగుతుంది అన్నది కాలమే జవాబు చెప్పాల్సి ఉంటుంది.

Tags:    

Similar News