అప్పటి ‘జంబలకిడిపంబ’ ఇప్పుడు నిజమవుతోందా?

మగాళ్లు మందుకు బానిసలై.. ఇంటిని పట్టించుకోవటం లేదంటూ మహిళలు ఆందోళనలు చేయటం.. నిరసనలు వ్యక్తం చేయటం చూస్తాం.;

Update: 2025-03-13 04:16 GMT

మూడు దశాబ్దాల క్రితం కన్నడ రీమేక్ మూవీ జంబలకిడిపంబ పేరుతో రిలీజ్ కావటం తెలిసిందే. నరేష్ హీరోగా నటించిన ఈ మూవీ 1992లో రిలీజ్ అయి డబ్బాలు వెనక్కి వెళ్లిపోయాయి. కట్ చేస్తే.. ఈ మూవీని 1993లో రీరిలీజ్ చేయటం.. అది కాస్తా బంపర్ హిట్ కావటమే కాదు.. కొన్ని నెలల పాటు ఈ సినిమా గురించి మాట్లాడుకున్న పరిస్థితి. పురుషాధిక్య సమాజంగా ఆడోళ్ల రాజ్యంగా మారిపోతే.. మగాడి పరిస్థితిని కామెడీగా చూపించిన ఈ మూవీ అప్పట్లో సంచలనం.

మగాళ్లు మందుకు బానిసలై.. ఇంటిని పట్టించుకోవటం లేదంటూ మహిళలు ఆందోళనలు చేయటం.. నిరసనలు వ్యక్తం చేయటం చూస్తాం. తాజాగా అందుకు భిన్నమైన జంబలకిడిపంబ సీన్ ఒడిశా రాష్ట్రంలో చోటు చేసుకుంది. తమ గ్రామంలోని మహిళలు మద్యానికి బానిసలైన వైనంపై ఆయా కుటుంబాలకు చెందిన మగాళ్లు పోలీసుల్ని ఆశ్రయించిన సిత్రం తాజాగా చోటుచేసుకుంది. ఒడిశాలోని కొరాపుట్ జిల్లా బొరిగుమ్మ సమితిలోని పూజారిపుట్ పంచాయితీ కొండగూడ గ్రామానికి చెందిన పలువురు మగాళ్లు పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు.

గ్రామంలోని కొందరు యువకులు నాటుసారాను పెద్ద ఎత్తున తయారు చేస్తున్నారని.. దానికి తమ ఆడోళ్లు అలవాటు పడ్డారని వాపోయారు. మగవారు కూలిపనులు చేస్తూ డబ్బులు సంపాదిస్తుంటే.. మహిళలు మాత్రం వారి కష్టాన్ని మద్యానికి ధారబోస్తున్నారని ఫిర్యాదు చేశారు. తమ పిల్లల ఫ్యూచర్ చెడిపోతుందని.. తమ మహిళలు మద్యానికి దూరమయ్యేలా చేయాలంటూ పోలీసుల్ని కోరారు. నాటుసారా తయారీ స్థావరాలపై అధికారులు దాడులు చేయాలని కోరుతున్నారు.

Tags:    

Similar News