సునీతా విలియమ్స్ రిటన్ జర్నీ... ముహూర్తంపై కీలక అప్ డేట్!
దీనికి గల కారణం.. వాహన నౌక థ్రస్టర్లలో లోపాలు తలెత్తడంతో పాటు హీలియం లీకేజీ సమస్యగా పరిణమించింది.
భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్ తోపాటు బుచ్ విల్ మోర్ లు బోయింగ్ కు చెందిన స్టార్ లైనర్ లో జూన్ 5న ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ఐ.ఎస్.ఎస్.) కు చేరుకున్నారు. వాస్తవానికి వీరిద్దరూ వారంలోగా తిరిగిరావాల్సి ఉన్నా ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ యాత్రలో పలు సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వాయిదాలపై వాయిదాలు పడుతున్న పరిస్థితి.
దీనికి గల కారణం.. వాహన నౌక థ్రస్టర్లలో లోపాలు తలెత్తడంతో పాటు హీలియం లీకేజీ సమస్యగా పరిణమించింది. దీంతో... అందులో ప్రయాణించడం సురక్షితం కాదని తేల్చిన నాసా... అప్పటి నుంచి సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఫలితంగా వీరి తిరుగు ప్రయాణంపై ఇప్పటివరకూ క్లారిటీ రాకుంది. ఈనేపథ్యంలో తాజాగా ఓ కీలక విషయం తెరపైకి వచ్చింది.
అవును... ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి ఇద్దరు వ్యోమగాములను తిరిగి తీసుకురావడానికి బోయింగ్ కొత్త క్యాప్సూల్ సురక్షితంగా ఉందో లేదో ఈ వారంతంలో నిర్ణయిస్తామని నాసా తెలిపింది. ఈ మేరకు నాసా అడ్మినిస్ట్రేటర్ బిల్ నెల్సన్ సహా ఇతర ఉన్నతాధికారులు సమావేశం కానున్నారు. దీంతో... ఈ భేటీ అనంతరం సునీతా విలియమ్స్ తిరుగు ప్రయాణంపై క్లారిటీ రానుందని అంటున్నారు.
ఈ నేపథ్యంలో ఒకవేళ స్టార్ లైనర్ సేఫ్ కాదని భావిస్తే అది ఖాళీగానే వచ్చే నెలలో భూమి దిశగా ప్రయాణం సాగిస్తుంది. అదే జరిగితే ఈ ఇద్దరు వ్యోమగాముల కోసం నాసా ప్రత్యేకంగా స్పేస్ ఎక్స్ క్యాప్సుల్ ను పంపాల్సి ఉంటుంది. అయితే.. దీనికి కోసం వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకూ వేచి చూడాల్సి రావొచ్చని ఇటీవల హింట్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా స్పందించిన ఇంజినీర్లు... స్టార్ లైనర్ థ్రస్టర్లను గాడిన పెట్టేందుకు కొత్త కంప్యూటర్ మోడల్ ను పరీక్షిస్తున్నట్లు వెల్లడించారు. దీన్ని సమీక్షించిన తర్వాతే నాసా ఓ నిర్ణయం తీసుకోనుందని అంటున్నారు. ఏది ఏమైనా సునీతా విలియమ్స్ తిరుగు ప్రయాణంపై ఒకటి రెండురోజుల్లో క్లారిటీ రావొచ్చని తెలుస్తోంది.