ఈ జైలే నా చివరి మజిలీ.. మరణాన్ని ముందే గ్రహించిన నావల్నీ
అలాంటి పుతిన్ కు ఎదురుగా నిలిచి ప్రాణాల మీదకు తెచ్చుకున్నారో రష్యా నాయకుడు.
పుతిన్ అంటే.. ఉక్రెయిన్ పై యుద్ధం మొదలయ్యాక ప్రపంచానికి ఇప్పుడే బాగా తెలిసిందేమో..? కానీ, పుతిన్ అంటే ఎంతటి నియంతో ఆ దేశంలోని ప్రతిపక్ష నాయకులను అడిగితే చెబుతారు. తన విధానాలను ప్రశ్నించిన గళాలను నిర్దాక్షిణ్యంగా తొక్కేస్తారని పుతిన్ వ్యతిరేకులు చెబుతుంటారు. 25 ఏళ్లుగా రష్యా అంతటి పెద్ద దేశాన్ని ఉక్కు పిడికిలిలో బంధించారు పుతిన్. అధికారం ఆయన చేతి నుంచి చేజారకుండా ఏకంగా రాజ్యాంగాన్నే మార్చారు. అలాంటి పుతిన్ కు ఎదురుగా నిలిచి ప్రాణాల మీదకు తెచ్చుకున్నారో రష్యా నాయకుడు.
ఎన్నో హత్యాయత్నం అనుమానాలు..
పుతిన్ కు ప్రత్యర్థులను కర్కశంగా అణచివేస్తారనే చెడ్డ పేరుంది. ఆయన మాటను ఎదిరిస్తే ఇక ఖతమే. ఇలాంటి వారి జాబితాలోని వారే అలెక్సీ నావల్నీ. ఓ దశలో రష్యాకు భవిష్యత్ నాయకుడిగా పేరుతెచ్చుకున్నారు నావల్నీ. కానీ, ఆయనకు భవిష్యత్తే లేకుండా చేశారు పుతిన్. వాస్తవానికి నావల్నీపై పలు హత్యాయత్నాలు జరిగాయి. వాటినుంచి ఆయన బయటపడ్డారు. కానీ, జైలులో శిక్ష అనుభవిస్తూ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆయన మరణించారు. అప్పటికే ఉక్రెయిన్ పై యుద్ధం ప్రారంభమై రెండేళ్లయింది. అయితే, నావల్నీ జైల్లో ఉండగా డైరీ రాశారు. అందులోని కొన్ని సంచలన విషయాలు బయటపడ్డాయి. అలాంటి అంశాలన్నిటినీ తీసుకుని పుస్తకంగా తీసుకొస్తున్నారు.
నా జీవితం జైలు గోడల్లోనే..
అలెక్సీ నావల్నీ.. ఓ పార్టీ నాయకుడు. ఆ పార్టీ పేరు ‘రష్యా ఆఫ్ ది ఫ్యూచర్’. దేశంలోని ప్రభుత్వ ఉన్నతాధికారుల అవినీతిని తమ పార్టీ వేదికగా బయటపెట్టారు నావల్నీ. అంతేకాదు.. గతంలో జరిగిన ఎన్నికల్లో పుతిన్ పైనే పోటీ చేశారు. వాస్తవానికి పుతిన్ విధానాలపై రష్యాలో వ్యతిరేకత ఉంది. నావల్నీ దానిని సొమ్ము చేసుకుని ప్రత్యామ్నాయ నాయకుడిగా ఎదుగుతారని భావించారు. ఆయనకు జనాదరణ కూడా పెరుగుతోంది. దీంతో పుతిన్ తట్టుకోలేకపోయారు. నావల్నీపై కేసులు బనాయించారు 2020లో సెర్బియాలో ఉండగా విష ప్రయోగం చేశారు. నావల్నీ నరాల్లోకి విష ఇంజెక్షన్ ను ఎక్కించారు. దీనికి నావల్నీ తీవ్రంగా ప్రభావితం అయ్యారు. జర్మనీలో కొన్ని నెలల పాటు చికిత్స పొందాక కానీ.. మనిషి కాలేదు. అయితే, అంతటితో ఆగలేదు. మళ్లీ రష్యాకు వచ్చారు. 2021 జనవరిలో దేశంలో కాలుపెట్టగానే విమానాశ్రయంలోనే పోలీసులు అరెస్టు చేశారు. అధికారంలోనే లేని నావల్నీపై నిధుల దుర్వినియోగం సహా అభియోగాలను మోపి అదుపులోకి తీసుకున్నారు. వివిధ కేసుల్లో 19 ఏళ్ల జైలు శిక్ష పడింది. అలా జైల్లో ఉండగానే ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆయన ప్రాణాలు కలోపయారు. దీనికి పుతిన్ ప్రభుత్వమే కారణం అంటూ ఆరోపణలు వచ్చాయి. నావల్నీ మద్దతుదారులు అయితే తీవ్ర నిరసనలకు దిగారు. కానీ, వాటిని ప్రభుత్వం అణచివేసింది.
పది రోజుల్లో పుస్తకం
నావల్నీ జైల్లో రాసిన డైరీలోని అంశాలతో ఈ నెల 22న పుస్తకం తేనున్నారు. అందులో ఆయన చాలా ఆవేదనగా రాసిన అంశాలున్నాయి. తన జీవితం ఈ జైల్లోనే ముగిసిపోతుందంటూ 2022 మార్చి 22న రాశారు. అంటే.. అప్పటికే ఏడాదికి పైగా జైల్లో ఉన్న ఆయన తనను ప్రభుత్వం ఏదో చేయబోతోందని గ్రహించారు. తనకు వీడ్కోలు కూడా దక్కదని వాపోయారు. అంటే తనకు కనీసం గుడ్ బై కూడా చెప్పేందుకు ఎవరూ ఉండరని భావించారు. తాను లేకుండానే వార్షికోత్సవాలు జరుగుతాయని.. తాను మనవళ్లను చూడటం కుదరదని పేర్కొన్నారు. కాగా, నావల్నీ రాసిన అంశాలను అమెరికా అంతర్జాతీయ మీడియా బయటపెట్టింది. దీంతో కొంత అనుమానం వ్యక్తం అవుతోంది. ఒక్క విషయం మాత్రం వాస్తవం.. పుతిన్ ప్రభుత్వం చేతిలో నావల్నీ నరకం అనుభవించారు.