ఏపీలో కూటమి వస్తే ఆయనే స్పీకర్ !?
ఏపీలో ఎవరిది అధికారం అన్నది తెలియడానికి కరెక్ట్ గా మరో ఆరు రోజులు మాత్రమే సమయం ఉంది.
ఏపీలో ఎవరిది అధికారం అన్నది తెలియడానికి కరెక్ట్ గా మరో ఆరు రోజులు మాత్రమే సమయం ఉంది. ఇంకా చెప్పాలంటే వచ్చే మంగళవారం ఈపాటికి ఎవరిది అధికారం అన్నది తెలిసిపోతుంది. ఇదిలా ఉంటే ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే ఎవరు స్పీకర్ ఎవరు హోం మంత్రి ఇలా చాలా విషయాల మీద విస్తృతంగా చర్చ సాగుతోంది.
హోం మినిస్టర్లకు చాలా పేర్లు వినిపించాయి. ఒక స్పీకర్ విషయం తీసుకుంటే ట్రిపుల్ ఆర్ అనబడే రఘురామ క్రిష్ణం రాజు పేరు ఆయన అభిమానులు సోషల్ మీడియా ద్వారా బయటకు తెస్తున్నారు. కానీ చంద్రబాబుకు ఒక లెక్క పక్కాగా ఉంటుంది. ఆయన ఎవరిని ఏ పదవికి ఎంపిక చేసినా వారి టాలెంట్ ని నూరు శాతం చూసి మాత్రమే ఇస్తారు.
అలా చూస్తే కనుక బాబు మనసులో ఒకరి పేరు ఉంది అని అంటున్నారు. ఆయన ఎవరో కాదు పయ్యావుల కేశవ్ అని అంటున్నరు. అనంతపురం జిల్లా ఉరవకొండకు చెందిన కేశవ్ సీనియర్ మోస్ట్ లీడర్. ఆయన ఎన్టీయార్ హయాం నుంచి టీడీపీలో ఉన్నారు.
సీనియర్ నేత అయినా ఇప్పటిదాకా మంత్రి పదవికి నోచుకోలేకపోయారు అన్నది కూడా ఆయన అభిమానులలో ఉంది. అయితే ఈసారి ఆయనకు అత్యున్నత పదవి వరించే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని అంటున్నారు. ఏపీ శాసన సభకు కొత్త స్పీకర్ గా ఆయన పేరుని చంద్రబాబు ఎంపిక చేయవచ్చు అని ప్రచారం సాగుతోంది.
శాసనసభ వ్యవహారాలు క్షుణ్ణంగా అవగాహన ఉన్న నేత కావడంతో పాటు డైనమిక్ లీడర్ గా పయ్యావుల కేశవ్ కి పేరు ఉంది. ఆయనను అందుకే విపక్షంలో ఉన్నపుడు చంద్రబాబు పబ్లిక్ అఫైర్స్ కమిటీ చైర్మన్ పదవిని ఇచ్చారు. ఆ విధంగా ఆయనకు సరైన న్యాయం జరిగింది అని చెప్పాలి. ఆ పదవిలో కూడా గత అయిదేళ్లుగా ఆయన బాగానే రాణించారు.
ఇక ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం వస్తే స్పీకర్ పదవికి పయ్యావుల కేశవ్ కంటే మంచి సెలక్షన్ ఉండదని అంటున్నారు. దానికి కారణాలు అనేకం ఉన్నాయని చెబుతున్నారు. ఈసారి అసెంబ్లీలో ఎవరు అధికారంలోకి వచ్చినా బొటాబొటీ మెజారిటీ మాత్రమే వస్తుందని లెక్కలు చెబుతున్నాయి.
అంటే విపక్షం కూడా బలంగా ఉంటుందని దాని అర్ధం. ఏపీ ఆసెంబ్లీలో అరవై నుంచి డెబ్బై సీట్లకు తగ్గకుండా విపక్షం ఉన్న వేళ సభను నడపాల్సిన కీలక బాధ్యత స్పీకర్ మీదనే ఉంటుంది. అదే విధంగా సభను ఏ ఇబ్బందులూ లేకుండా నడిపించడం కూడా కత్తి మీద సాము అవుతుంది.
ఇక ఏమి చేసినా రూల్స్ ప్రకారంగా ఉండాలి అంటే సభలో జరిగే బిజినెస్ మీద కానీ రూల్స్ మీద కానీ పూర్తి అవగాహన ఉండాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ బాగా ఉన్న వారు కాబట్టే పయ్యావుల కేశవ్ పేరుని ప్రస్తావిస్తున్నారు.
సభా నిబంధనలను చక్కగా అమలు చేస్తూ హుందాగా వ్యవహరించడం అన్నది కూడా చేయాలంటే సమర్ధుడు అయిన వరు ఎంతో ఓపిక సహనం కలిగిన వారు అవసరం. ఈ లక్షణాలు అన్నీ పయ్యావులలో బాగా ఉన్నాయని అంటున్నారు. ఆయనకు ఆవేశం పాళ్ళు తక్కువ. ఆలోచన ఎక్కువ. ఆయన ఏమి చెప్పినా సభలో బాగా చెబుతారు. అంతే కాదు ఆయన సబ్జెక్ట్ మీద మాట్లాడడంలో ఎక్స్ పెర్ట్ గా పేరు గడించారు.
ఇక పయ్యావుల కేశవ్ లాంటి వారు స్పీకర్ గా ఉంటే సభను నూరు శాతం కంట్రోల్ చేయగలరు అన్న మాట కూడా ఉంది. ఆయన టీడీపీ సభ్యుడే అయినా కొంత న్యూట్రల్ గా కూడా కనిపిస్తారు. వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుల మీద ఆయన చాలా నిర్మాణాత్మకంగా చేసిన ప్రసంగాలే అందుకు ఉదాహరణ అని అంటున్నారు.
మొత్తానికి పయ్యావుల వంటి వారికి ఈ కీలకమైన రాజ్యాంగబద్ధ పదవి నిజంగా అప్పగిస్తే కొత్త శాసనసభలో అర్ధవంతమైన చర్చకు ఆస్కారం ఉంటుందని అంతా భావిస్తున్నారు. మరి రేపటి రోజున కూటమి అధికారంలోకి వస్తే చాలా కీలకమైన స్పీకర్ పదవికి పయ్యావుల ఫస్ట్ బెస్ట్ ఛాయిస్ అని అంతా అంటున్నారు. ఏమి జరుగుతుందో చూడాల్సి ఉంది.