మూడ్ ఆఫ్ నెల్లూరు...!
నెల్లూరు జిల్లాలో కీలకంగా ఉండే ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీ మారిపోయారు ఉన్న వారు కూడా అసంతృప్తిగా ఉన్నారు.
ఏపీలో కీలకమైన జిల్లాగా ఉమ్మడి నెల్లూరు జిల్లా ఉంది. ఈ జిల్లా ఏపీ రాజకీయాలను విపరీతంగా ప్రభావితం చేసే స్థితిలో ఉంది. ఎందుకంటే 2014, 2019లలో ఈ జిల్లా వైసీపీకి కొమ్ము కాసింది. ఇక 2019లో అయితే మొత్తం పదికి పది అసెంబ్లీ సీట్లతో పాటు, ఎంపీ సీటు కూడా వైసీపీ గెలుచుకుని క్లీన్ స్వీప్ చేసి పారేసింది. అయితే అనూహ్యంగా అలాంటి జిల్లాలో ఇపుడు వైసీపీకి ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది.
నెల్లూరు జిల్లాలో కీలకంగా ఉండే ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీ మారిపోయారు ఉన్న వారు కూడా అసంతృప్తిగా ఉన్నారు. ఇక రాజకీయంగా చూస్తే ఈ జిల్లా వైసీపీకి చాలా ప్రతిష్టాత్మకమైనది. అలాంటి జిల్లాలో ప్రజల మూడ్ ఎలా ఉంది అన్నది చర్చగా ముందుకు వస్తోంది. మూడ్ ఆఫ్ నెల్లూరు పేరుతో తాజాగా వచ్చిన ఒక సర్వే ఆసక్తికరంగా ఉంది. ఇది రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది.
గత ఎన్నికల్లో పదికి పది గెలిచిన వైసీపీకి ఇపుడు ఈ సర్వే ప్రకారం చూస్తే ఆరు సీట్లు మాత్రమే దక్కుతాయని అంటున్నారు. నాలుగు సీట్లను టీడీపీ గెలుచుకునే బలంతో ఉందని అంటున్నారు. ఆ సీట్లు ఏంటో చూస్తే కనుక ఇలా ఉన్నాయి.
నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో టీడీపీ జనసేన కూటమి 52 శాతం ఓట్లతో ముందంజలో ఉందని ఈ సర్వే తేల్చేస్తోంది. ఇక్కడ వైసీపీకి 43 శాతం ఓటు షేర్ మాత్రమే దక్కుతుందని పేర్కొంది. ఇతరులకు మూడు శాతంగా ఉంది.
అలాగే నెల్లూరు సిటీ నియోజకవర్గంలో చూస్తే టీడీపీ జనసేన కూటమికి 52 శాతం ఓటు షేర్ ఉంది. ఇక్కడ వైసీపీకి 44 శాతం ఓట్లు దక్కుతాయని సర్వే పేర్కొంది. ఇతరులకు రెండు శాతం వస్తాయని తేలుతోంది.
గూడూరు అసెంబ్లీ సీటు తీసుకుంటే టీడీపీ జనసేన కూటమికి 50 శాతం, వైసీపీకి 46 శాతం ఇతరులకు రెండు శాతంగా సర్వే పేర్కొంది.
వెంకటగిరి అసెంబ్లీ సీటు తీసుకుంటే టీడీపీ జనసేనలకు కలిపి 51 శాతం, వైసీపీకి 45 శాతం, ఇతరులకు 2.5 శాతం ఓట్లు దక్కుతాయని పేర్కొంది.
సర్వేపల్లి లో వైసీపీకి 50 శాతం ఓట్లు వస్తే టీడీపీ జనసేన కూటమికి 45.5 శాతం, ఇతరులకు రెండు శాతం ఓట్లు వస్తాయని తేలింది.
కొవూరు లో వైసీపీకి 49.75 శాతం, టీడీపీ జనసేనకు 46.5 శాతం ఓటు షేర్ వస్తే ఇతరులకు 1.75 శాతం ఓట్లు వస్తాయని తేల్చింది.
సుళ్ళూరుపేట అసెంబ్లీ సీటులో వైసీపీకి 51 శాతం, టీడీపీ జనసేనకు 45.5 శాతం ఇతరులకు 1.5 శాతం ఓట్లు షేర్ వస్తుందని పేర్కొంది.
ఆత్మకూరు లో వైసీపీకి 49.5 శాతం, టీడీపీ జనసేన కూటమికి 46 శాతం ఓట్లు ఇతరులకు 2 శాతం దక్కుతాయని వివరించింది.
కావలిలో వైసీపీకి 49 శాతం, టీడీపీ జనసేన కూటమికి 48 శాతం ఓటు షేర్ వస్తుందని పేర్కొంది. ఇతరులకు 1.5 శతం దక్కుతుందని వెల్లడించింది.
చివరిగా ఉదయగిరిలో వైసీపీకి యాభై శాతం టీడీపీ జనసేన కూటమికి 45.5 శాతం ఓట్లు ఇతరులకు 2.5 శాతంగా దక్కుతుందని పేర్కొంది.
దాదాపుగా ఆరు నియోజకవర్గాలలో వైసీపీ లీడ్ లో ఉంది అని ఈ సర్వే తేల్చింది. ఇందులో కూడా కావలిలో హోరా హోరీ పోరు ఉంటుందని పేర్కొంది. ఇక్కడ వైసీపీకి టీడీపీ జనసేన కూటమికి మధ్య కేవలం ఒక్క శాతం మాత్రమే తేడా ఉందని కూడా పేర్కొంది.
ఈ సర్వే మరో విషయం కూడా పేర్కొంది. టీడీపీ జనసేన కూటమి వైసీపీ మీద ఆధిక్యం చూపుతున్న నియోజకవర్గాలలో నెల్లూరు రూరల్ లో అయితే ఏకంగా తొమ్మిది శాతం ఆధిక్యత ఉంది. అంటే ఈ సీటు కచ్చితంగా కూటమిదే అన్న మాట.
అలాగే నెల్లూరు సిటీలో అయితే ఏడు శాతం పైగా ఓట్ల ఆధిక్యతతో ఉంది అంటే ఈ సీటు మీద కూడా వైసీపీ ఆశలు పెట్టుకోకూడదు అని అంటున్నారు. అలాగే వెంకటగిరిలో ఆరు శాతం, గూడురులో మాత్రం నాలుగు శాతం ఆధిక్యత ఉంది.
అదే వైసీపీ ఆధిక్యత చూపుతున్న ఆరింటిలో కావలి పోటా పోటీగా ఉంటే మిగిలిన అయిదింటిలో ఒక్క సుళ్లూరుపేట మాత్రమే 5.5 శాతం ఆధిక్యత అత్యధికంగా కనిపిస్తోంది. మిగిలినవి అన్నీ 3.5 నుంచి 4.5 మధ్యలోనే ఉన్నాయి.
ఇంకా ఎన్నికలకు సమయం ఉంది కాబట్టి నెల్లూరులో ఈ తక్కువ మార్జిన్ తో ఉన్న సీట్లలో ఫలితాలు అటూ ఇటూ అవుతాయా అన్న చర్చ ఉంది. ఏది ఏమైనా వైసీపీకి కంచుకోట లాంటి నెల్లూరు జిల్లాలో ఇపుడు టీడీపీ జనసేన కూటమి పాగా వేసినట్లుగానే కనిపించేలా ఈ మూడ్ ఆఫ్ నెల్లూరు ఉంది అని అంటున్నారు.