రెట్టింపు వేగం, తగ్గనున్న సమయం.. తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్!

ఇది పూర్తైతే శంషాబాద్ నుంచి విశాఖకు కేవలం 4 గంటల్లో చేరుకోవచ్చు.

Update: 2024-10-26 23:30 GMT

సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నానికి ట్రైన్ లో ఇప్పుడు తక్కువలో తక్కువ 10 నుంచి 12 గంటలకంటే ఎక్కువ సమయం పడుతుంది! ఇక వందేభారత్ ట్రైన్ లో అయితే 8:30 గంటలు పడుతుంది. ఐతే.. ఇకపై అంత సమయం అవసరం లేదు! తాజాగా సరికొత్త ప్రాజెక్ట్ రాబోతోంది. ఇది పూర్తైతే శంషాబాద్ నుంచి విశాఖకు కేవలం 4 గంటల్లో చేరుకోవచ్చు.


అవును... తెలుగు రాష్ట్రాల్లో రెండు ప్రధాన నగరాలైన హైదరాబాద్, విశాఖపట్నం మధ్య రైలు ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గించే ప్రాజెక్టు ప్రాణాళిక కీలక దశకు చేరిందని తెలుస్తోంది. ఇందులో భాగంగా... శంషాబాద్ - విశాఖపట్నం మధ్య సెమీ హైస్పీడ్ రైల్ కారిడార్ ఎలైన్మెంట్ ఖరారైంది.

ఈ మేరకు.. సూర్యాపేట, విజయవాడ మీదుగా ఈ మార్గాన్ని ప్రతిపాదించారు. ఇదే సమయంలో... విశాఖ నుంచి కర్నూలు వయా విజయవాడ, సూర్యాపేట మరో కారిడర్ కూడా నిర్మించనున్నారు. ఈ సమయంలో... వీటి ప్రిలిమినరీ ఇంజినీరింగ్, ట్రాఫిక్ సర్వే తుది దశకు చేరింది. ఈ నివేదికను నవంబర్ లో రైల్వే బోర్డుకు సమర్పించనున్నట్లు తెలుస్తోంది.

వాస్తవానికి ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి విశాఖకు... వరంగల్, ఖమ్మం, విజయవాడ మీదుగా ఒక మార్గం... నల్గొండ, గుంటూరు, విజయవాడ మీదుగా మరో మార్గం ఉన్న సంగతి తెలిసిందే. ఈ మార్గాల్లో ట్రైన్స్ గరిష్ట వేగం గంటకు 110 నుంచి 130 మిలోమీటర్లు. అయితే... రానున్న కొత్త మార్గంలో వేగం రెట్టింపు, సమయం సగానికి పైగా తగ్గింపు!

ఇదే సమయంలో... ఈ కొత్త కారిడార్ వల్ల తెలంగాణలో ఇప్పటివరకూ రైలు కూత వినిపించని అనేక పట్టణాలు, జిల్లాల్లో గంటకు 220 కి.మీ.వేగంతో రైళ్లు దూసుకుపోబోతున్నాయని చెబుతున్నారు. ఇందులో ప్రధానంగా ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి మహబూబ్ నగర్ తో పాటు నాగర్ కర్నూల్ జిల్లాలో ఈ సందడి నెలకొననుందని చెబుతున్నారు.

ఇక ఈ రెండు రూట్ల మధ్యలో స్టేషన్లను ఒకసారి పరిశీలిస్తే...

“శంషాబాద్ - విశాఖ రూట్లో”... శంషాబాద్ -> గట్టుప్పల్ -> చిట్యాల్ -> నకిరేకల్ -> సూర్యపేట జంక్షన్ -> జగ్గయ్యపేట -> విజయవాడ -> ఏలూరు -> రాజమండ్రి ఎయిర్ పోర్ట్ -> తుని ఈస్ట్ -> విశాఖ (దువ్వాడ).

“విశాఖ – కర్నూల్ రూట్లో”... విశాఖపట్నం (దువ్వాడ) -> తుని ఈస్ట్ -> రాజమండ్రి ఎయిర్ పోర్ట్ -> ఏలూరు -> విజయవాడ -> జగ్గయ్యపేట -> సూర్యపేట జంక్షన్ -> నల్గొండ సౌత్ -> కల్వకుర్తి -> నాగర్ కర్నూల్ -> వనపర్తి -> గద్వాల్ -> కర్నూల్.

Tags:    

Similar News