నాడు పార్లమెంటుకు ప్రణమిల్లి.. నేడు వీడ్కోలు.. మోదీ ప్రస్థానం

నేడు వీడ్కోలులో..కొత్త పార్లమెంటు భవనంలో ప్రధాని, సభ్యులు సభలోకి వెళ్లాక జాతీయ గీతం ఆలపించారు.

Update: 2023-09-19 09:32 GMT

ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ లో కీలక ఘట్టం.. 75 ఏళ్లుగా మనం చూస్తున్న పార్లమెంటు భవనం ఇక పాతదైపోయింది. కొత్తగా నిర్మించిన భవనంలో ప్రస్థానం మొదలైంది. మంగళవారంతో పార్లమెంటు పాత భవనానికి వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా సెంట్రల్ హాల్ లో ఉద్విగ్నభరిత వాతావరణం నెలకొంది. అనంతరం ఉభయ సభల సభ్యలు పాదయాత్రగా కొత్త భవనంలోకి వెళ్లారు. వీరందరి ముందుగా ప్రధాని మోదీ నడుస్తుండగా.. ఎంపీలు ఆయనను అనుసరించారు. విశేషం ఏమంటే.. భారత ప్రజాస్వామ్య మూలస్తంభం అయిన "రాజ్యాంగాన్ని" కొత్త భవనంలోకి తరలించారు.

నాడు మొదటిసారి వచ్చినప్పుడు కొత్త భవనం లోపలికి వెళ్లిన అనంతరం.. మోదీ దానిని నిశితంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన తొలిసారి పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికై.. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా గుర్తుకొచ్చింది. మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా 12 ఏళ్లు సుదీర్ఘకాలం పనిచేశారు. ఎమ్మెల్యే కూడా కాకుండానే సీఎం అయినా.. 2014లో బీజేపీ ప్రధాని అభ్యర్థిగా జాతీయ రాజకీయాల్లోకి వచ్చారు.

ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడంతో మోదీ ప్రధాని అయ్యారు. తొలిసారి పార్లమెంటు వచ్చిన సందర్భంలో మోదీ పార్లమెంటు ద్వారం వద్ద ప్రణమిల్లారు. నాడు ఈ సీన్ ఎంతగానో చర్చనీయాంశమైంది. ప్రజాస్వామ్యానికి పుట్టిల్లు అయిన పార్లమెంటుకు మోదీ అత్యంత గౌరవం ఇచ్చారనే వ్యాఖ్యలు వినిపించాయి.

నేడు వీడ్కోలులో..కొత్త పార్లమెంటు భవనంలో ప్రధాని, సభ్యులు సభలోకి వెళ్లాక జాతీయ గీతం ఆలపించారు. సభ్యులు కూర్చున్నాక కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. స్పీకర్ ప్రసంగించాక ప్రధాని మోదీ తొలి ప్రసంగం చేశారు. వినాయక చవితి రోజు కొత్త భవనాన్ని ప్రారంభించుకోవడం శుభసూచకమని పేర్కొన్నారు. కొత్త భవనంలోకి కొత్త సంకల్పం తీసుకెళ్లాలని ఆకాంక్షించారు. ప్రాచీన ప్రజాస్వామ్య స్ఫూర్తి, ఆధునిక భారతీయతత్వం కలబోత ఈ కొత్త భవనం’ అని ఈ సందర్బంగా మోదీ వెల్లడించారు.

కాగా, మోదీ హయాంలోనే కొత్త పార్లమెంటు భవనం నిర్మాణం ప్రారంభమైంది. సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా దీనిని చేపట్టారు. నిర్మాణం పూర్తవడంతో మోదీ చేతుల మీదుగానే ప్రారంభం కూడా జరిగిపోయింది. తద్వారా మోదీ చరిత్రాత్మక కార్యక్రమంలో పాలుపంచుకున్నట్లయింది. ఇదే సమయంలో కొత్త పార్లమెంటు భవనంలో జరగనున్న ప్రత్యేక సమావేశాలు ఎన్నో కీలక పరిణామాలకు వేదిక అవుతాయని అంటున్నారు. చూద్దాం.. ఏం జరగనుందో?

Tags:    

Similar News