డ్రైవింగ్ లైసెన్స్ కోసం అర్టీవో కొత్త రూల్స్ తెలుసా?
ఇందులో భాగంగా... డ్రైవింగ్ లైసెన్స్ ను పొందే విధానాన్ని మరింత సులభతరం చేసింది!
డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్ కోసం ఆర్టీవో ఆఫీసుకు అవసరం లేదు. ఇదే సమయంలో పెద్ద మొత్తంలో డాక్యుమెంట్లూ సమర్పించక్కర్లేదు. ఈ మేరకు జూన్ 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నట్లు.. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ ఇటీవల మార్గదర్శకాలు జారీ చేసింది. ఇందులో భాగంగా... డ్రైవింగ్ లైసెన్స్ ను పొందే విధానాన్ని మరింత సులభతరం చేసింది!
అవును... ఇకపై డ్రైవింగ్ టెస్ట్ కోసం ఆర్టీవో కు వెళ్లాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేట్ డ్రైవింగ్ స్కూళ్లలోనే ఈ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా దరఖాస్తు దారుడు టెస్ట్ లో పాసవ్వాలి. అలా అయితే... ఆ స్కూళ్లు వారికి ఒక ధ్రువపత్రాన్ని ఇస్తయి. వాటితో ఆర్టీవో కార్యాలయంలో లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవాలి.
అయితే ఇలా డ్రైవింగ్ టెస్ట్ ను నిర్వహించేందుకు, దరఖాస్తులు ఇచ్చేందుకు అనుమతి ఇస్తూ కేంద్రం ప్రైవేట్ సంస్థలకు సర్టిఫికెట్లు జారీ చేస్తోంది. ఆ అనుమతులు లేని స్కూళ్లలో డ్రైవింగ్ నేర్చుకుంటే మాత్రం కచ్చితంగా ఆర్టీవోలోని టెస్ట్ కు హాజరుకావాల్సిందే.
ప్రైవేట్ డ్రైవింగ్ స్కూళ్లకు మార్గదర్శకాలు..:
ఈ సందర్భంగా... ప్రైవేట్ డ్రైవింగ్ స్కూళ్లకు కేంద్రం కొన్ని మార్గదర్శకాలను పేర్కొంది. ఇందులో భాగంగా... డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలకు కనీసం ఒక ఎకరం స్థలం ఉండాలి.. అదేవిధంగా హెవీ వెహికల్స్ శిక్షణకైతే రెండు ఎకరాల స్థలం ఉండాలి. ఇదే సమయంలో... స్కూళ్లలో డ్రైవింగ్ టెస్ట్ నిర్వహణకు సంబంధించిన వసతులు ఉండాలి.
ఈ క్రమంలో లైట్ మోటార్ వాహనాలకు గరిష్ఠంగా నాలుగువారాల్లో 29 గంటల శిక్షణనివ్వాలి. అందులో 21 గంటలు ప్రాక్టికల్, 9 గంటలు థియరీ సెషన్ గా విభజించారు. ఇక మీడియం, హెవీ వెహికల్స్ కు అయితే ఆరు వారాల్లో కనీసం 38 గంటల శిక్షణ అందించాలి.
ఇక శిక్షణనిచ్చేవాళ్లకు కనీసం హైస్కూల్ డిప్లొమా దానికి సమానమైన అర్హత ఉండాలి. అదేవిధంగా... డ్రైవింగ్ లో కనీసం ఐదేళ్ల అనుభవంతో పాటు బయోమెట్రిక్స్ సహా ఐటీ సిస్టమ్స్ పై అవగాహన అవసరం. ట్రైనింగ్ ఇవ్వకుండా లైసెన్స్ జారీ చేస్తే డ్రైవింగ్ స్కూళ్లు రూ.5,000 ఫైన్ కట్టాల్సి ఉంటుంది.
కొత్త నిబంధనల ప్రకారం ఫీజుల వివరాలు..!:
లెర్నర్స్ లైసెన్స్ - రూ.200
లెర్నర్స్ లైసెన్స్ రెన్యువల్ - రూ.200
పర్మినెంట్ లైసెన్స్ - రూ.200
పర్మినెంట్ లైసెన్స్ రెన్యువల్ - రూ.200
లైసెన్స్ వివరాల్లో మార్పులు - రూ.200
ఇంటర్నేషనల్ లైసెన్స్ - రూ.1,000