పురందేశ్వరి దూకుడు.. ఆర్ధికమంత్రితో భేటీ.. నెక్స్ట్ ఏంటి?

ఏపీ రాష్ట్ర ప్రభుత్వంపై పురందేశ్వరి విమర్శలు కొనసాగిస్తున్నారు

Update: 2023-07-28 04:31 GMT

ఏపీ బీజేపీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టినప్పటినుండీ దూకుడు ప్రదర్శిస్తున్నట్లు కనిపిస్తోన్న పురందేశ్వరి... తాజాగా కేంద్ర ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్ ను కలిశారు. ఈ సందర్భంగా ఏపీపై దుమ్మెత్తి పోసిన పురందేశ్వరి... ఆ రాష్ట్రానికి సహకరించొద్దని చెప్పారని తెలుస్తోంది.

రాష్ట్రం అభివృద్ధి చెందుతుందో లేదో కేంద్రంలోని ప్రభుత్వ పెద్దలకు తెలియంది కాదు. కాస్త కల్లెట్టి కాగ్ నివేదికలు చూసినా... ఏపీలో పాలన సజావుగానే సాగుతుందని చెబుతున్నారు వైసీపీ నేతలు. మరోపక్క కేంద్రం కూడా పార్లమెంటు సాక్షిగా... ఏపీకి సంబంధించిన మంచి విషయాలే చెప్పింది. ఈ సమయంలో పురందేశ్వరి ఫైనాన్స్ మినిస్టర్ ని కలిశారు.

ఏపీ రాష్ట్ర ప్రభుత్వంపై పురందేశ్వరి విమర్శలు కొనసాగిస్తున్నారు. ఆర్థిక వ్యవహారాల పైన ఆరోపణలు చేస్తున్నారు. అయితే పురందేశ్వరి చేస్తోన్న ఆరోపణలను ఏపీ ప్రభుత్వం తీవ్రంగా ఖండించడంతోపాటు లెక్కలు బయట పెట్టింది. ఈ సమయంలో తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను కలిసిన పురందేశ్వరి కీలక వ్యాఖ్యలు చేసారు. రాష్ట్రంలో అప్పులే మినహా ఆస్తుల కల్పన లేదని ఆరోపించారు.

ఇదే సమయంలో… 2023 జూలై నాటికి ఏపీకి రూ.10,77,006 కోట్ల అప్పు ఉందని పురందేశ్వరి పేర్కొన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రూ.7 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసిందని అన్నారు. అదేవిధంగా... కార్పొరేషన్‌ ద్వారా చేసిన అప్పులు అధికారికమా, అనధికారికమా అన్నది ఏపీ ప్రజలకు తెలియాలన్నారు. అలాగే...15వ ఆర్థిక సంఘం పంచాయతీ నిధులను అనధికారికంగా వాడటంపై సర్పంచ్‌ లకు సమాధానం చెప్పాలని పురందేశ్వరి డిమాండ్‌ చేశారు.

ఏపీ వ్యవహారాల ఇంచార్జ్ మురళీధరన్ తో కలిసి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను కలిసిన పురందేశ్వరి... పై ఆరోపణల మేరకు ఏపీలో ఏపీలో అప్పులు, ఆర్థిక అవకతవకలపై దృష్టి సారించాలని కోరినట్లు సమాచారం. ఇదే సమయంలో ఏపీ ప్రభుత్వానికి సహకరించవద్దని విజ్ఞప్తి చేశారని అంటున్నారు. ఇందులో భాగంగా... వినతి పత్రం సమర్పించారు.

కాగా... పురందేశ్వరి ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి వైసీపీ ప్రభుత్వ అప్పులు, కేంద్ర నిధుల మళ్లింపుపై ఎక్కువ విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో అమరావతే రాజధాని అని కూడా గట్టిగా చెప్పే ప్రయత్నం చేశారు. ఇదే సమయంలో పొత్తులపైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు.

పొత్తుల విషయంలో కొత్త విషయం ఏమీ చెప్పనప్పటికీ... జనసేనతో పొత్తు కొనసాగుతందని అన్నారు. ఎన్నికలకు రెండు నెలల ముందు పొత్తులపైన పార్టీ నాయకత్వం స్పష్టత ఇస్తుందని చెబుతున్నారు. ఇందులో భాగంగా గణాంకాలతో సహా కేంద్ర ఆర్దిక మంత్రిని కలిసి ఫిర్యాదులు చేసినట్లు చెబుతున్నారు.

Tags:    

Similar News