జగన్ జమానాలో ఆంధ్రా సర్వనాశనం! నీతి అయోగ్ సంచలన నివేదిక

గత ప్రభుత్వ పాలనలో ఏపీ అప్పుల కుప్పగా మారిందని, విచ్చలవిడి ఆర్థిక విధ్వంసం చోటుచేసుకుందని కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని నీతి అయోగ్ తేల్చిచెప్పింది

Update: 2025-01-27 07:00 GMT

గత ప్రభుత్వ పాలనలో ఏపీ అప్పుల కుప్పగా మారిందని, విచ్చలవిడి ఆర్థిక విధ్వంసం చోటుచేసుకుందని కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని నీతి అయోగ్ తేల్చిచెప్పింది. ఆ సంస్థ విడుదల చేసిన ‘ఆర్థిక ఆరోగ్య సూచిక - 2025’ సంచలన విషయాలను బయటపెట్టింది. జగన్ అధికారంలో ఉండగా ఆర్థిక లోటు, అతి తక్కువ మూలధన వ్యయం, భారీ అప్పుల వల్ల రాష్ట్రం ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల్లో కూరుకుపోయిందని ఆ నివేదికలో తెలిపింది.

2022-23 ఆర్థిక సంవత్సరంలో దేశంలో 18 పెద్ద రాష్ట్రాల్లోని ఆర్థిక పరిస్థితులను విశ్లేషిస్తూ నీతి అయోగ్ ఓ నివేదికను రూపొందించింది. కాగ్, ఆర్బీఐతోపాటు వివిధ మార్గాల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఆర్థిక ఆరోగ్య సూచిక రూపొందించింది. ఈ నివేదిక ప్రకారం ఆర్థిక క్రమశిక్షణలో ఏపీ అట్టడుగు నుంచి రెండో స్థానంలో నిలిచింది. అంటే మొత్తం 18 రాష్ట్రాల్లో ఏపీ 17వ స్థానంలో నిలిచి పేలవ పనితీరును కనబరిచినట్లు నీతి అయోగ్ స్పష్టం చేసింది. ఈ నివేదికలో చివరి స్థానంలో ఉన్న పంజాబ్ నిలిచింది. అయితే గతంలో పంజాబ్ మినహా మిగతా రాష్ట్రాల కంటే ఏపీ మెరుగైన పనితీరు కనబరిచేదని గుర్తు చేసింది. కాగా, ఈ నివేదికలో తొలి రెండు స్థానాల్లో ఒడిశా, ఛత్తీస్ గఢ్ దక్కించుకోవడం గమనార్హం.

2014-15 నుంచి 2021-22 మధ్య సగటున 13వ ర్యాంకులో నిలిచిన ఆంధ్రప్రదేశ్ ఆ తర్వాత 17వ స్థానానికి పడిపోయింది. ఖర్చుల నాణ్యత విషయంలో 15, ఆదాయ సమీకరణ, ఆర్థిక హేతుబద్ధతలో 16, రుణ సూచికలో 12వ స్థానాన్ని రాష్ట్రం దక్కించుకుంది. పంజాబ్, ఏపీ, పశ్చిమబెంగాల్, కేరళ తీవ్రమైన ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్నట్లు నీతి అయోగ్ వెల్లడించింది. ముఖ్యంగా ఏపీ తీవ్ర ఆర్థిక లోటుతో సతమతమైనట్లు వివరించింది. అప్పులు, వడ్డీ చెల్లింపులు పెరగడం రాష్ట్రానికి ప్రధాన ఆర్థిక సమస్యగా మారినట్లు వెల్లడించింది. మొత్తం వ్యయంలో రాష్ట్ర మూలధన వ్యయం 3.5 శాతానికి పరిమితమైనట్లు తెలిపింది. 2022-23లో చేసిన అప్పుల్లో 4.4% మాత్రమే మూలధన వ్యయానికి ఖర్చుచేసినట్లు వెల్లడించింది.

2018-19 నుంచి 2022-23 మధ్య రాష్ట్ర సొంత ఆదాయ వార్షిక వృద్ధి -6%గా నమోదైనట్లు తెలిపింది. మొత్తం ఆదాయంలో రాష్ట్ర సొంత ఆదాయం 2018-19లో 64% ఉండగా, 2022-23 నాటికి అది 67% చేరినట్లు వెల్లడించింది. సొంత ఆదాయ వృద్ధి రేటు 2018-19లో 17.1% ఉండగా, 2022-23లో అది 9.8%కి పడిపోయింది. 2022-23లో ఆర్థిక లోటు జీఎస్డీపీలో 4శాతం ఉండగా, నిర్దేశిత లక్షం 4.5% లోపే ఉన్నట్లు వెల్లడించింది. రాష్ట్ర విభజన తర్వాత ఈ సూచిలో ఏపీ 2014-15లో 3వ స్థానంలో ఉండగా, 2022-23 నాటికి 17వ స్థానానికి చేరుకోవడం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తేటతెల్లం చేసిందని వివరించింది. ప్రభుత్వ అప్పులు 16.5%, వడ్డీ చెల్లింపులు 15% శాతం పెరగినట్లు నీతి అయోగ్ వివరించింది. గత ఐదేళ్లలో ఇవి ఏటా సగటున 10 శాతం పెరిగినట్లు నివేదికలో బయటపెట్టింది.

Tags:    

Similar News